బీజేపీ "ఉక్కుమనిషి"గా పేరొందిన ఎల్‌కే అద్వానీ ప్రధానమంత్రి ఆశలు 15వ లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా అడుగంటాయి. రాకరాకవచ్చిన ప్రధాని అవకాశం.. ఆయనకు అల్లంతదూరానే ఉండిపోయింది. వాజ్‌పేయి రాజకీయరంగవిరమణతో ప్రధాని అభ్యర్థిగా తెరపైకి వచ్చిన అద్వానీ... విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డారు. ఈసారి కాకపోతే.. మరోసారి ప్రధాని అయ్యే అవకాశం రాదని ఆయనకు బాగా తెలుసు. అయితే.. అధికార యూపీఏ కూటమి తాజా ఎన్నికల్లో ప్రజామోదాన్ని పొందటంతో ప్రతిపక్ష బీజేపీ మరోసారి ప్రతిపక్ష పాత్రకు పరిమితం కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని కావాలన్న అద్వానీ కోరిక తీరే అవకాశం లేకుండా పోయింది.2009 లోక్‌సభ ఎన్నికల తీర్పు బీజేపీకి ప్రతికూలంగా రావడం.. వయస్సు మీదపడుతుండటం తదితర కారణాలతో అద్వానీ ప్రధాని అయ్యేందుకు భవిష్యత్ అవకాశాలు పరిమితంగా ఉన్నాయనేది రాజకీయ వర్గాలు భావన. ఈసారి జరిగే ఎన్నికలు అద్వానీ ప్రధాని కల నెరవేర్చుకునేందుకు చివరి అవకాశంగా పలువురు భావిస్తూ వచ్చారు.దాదాపుగా ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎక్కువ సమయం మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి నీడగా ఉన్న అద్వానీ తాజా ఎన్నికల్లో గాంధీనగర్ నియోజకవర్గం నుంచి అందరూ ఊహించినట్లు విజయం సాధించినప్పటికీ, ఆయన ఊహల్లోని ప్రధాని పదవికి మాత్రం దూరంగానే నిలిచిపోయారు.బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎన్డీఏ కూటమిపై ఎన్నికల్లో అధికార యూపీఏ ఘన విజయం సాధించింది. అయితే బీజేపీ పరాజయంతో అద్వానీ కల చెదిరినట్లేనని, వయస్సు మీదపడుతుండటంతో ఆయన తిరిగి ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఆశించకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.అయోధ్య- రామ జన్మభూమి ఉద్యమంతో బీజేపీలో కీలక నేతగా మారిన అద్వానీ ఐదేళ్ల తరువాత మళ్లీ జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం అంత సులభం కాకపోవచ్చని జనహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (ఢిల్లీ) రాజకీయ శాస్త్రవేత్త సుధా పాయ్ ఓ వార్తా సంస్థతో చెప్పారు. అయోధ్య ఉద్యమంతో బీజేపీ హిందుత్వ ప్రచారానికి ఇన్‌ఛార్జి బాధ్యతలు స్వీకరించిన అద్వానీ పార్టీని ఒక్క దశాబ్దంలోనే దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగేందుకు కారణమయ్యారు.1984లో రెండు లోక్‌సభ సీట్లకే పరిమితమై ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రధాన జాతీయ పార్టీగా ఉందంటే దానివెనుక అద్వానీ కృషి ఎంతో ఉందనేది నిర్వివాదాంశం. అయితే తన లౌకికవాదాన్ని చాటుకోవడంలో వ్యక్తిగతంగా విఫలమైన అద్వానీ తన విధానాన్ని ఏనాడూ స్పష్టంగా వ్యక్తీకరించలేకపోయారు.దీంతో సరిగా దశాబ్దం క్రితం ఆదర్శవంతమైన వాజ్‌పేయిని ప్రధాని అభ్యర్థిత్వం వరించింది. అద్వానీ పార్టీలో నెంబర్‌టూ స్థానానికి పరిమితమయ్యారు. అయితే వాజ్‌పేయి అనారోగ్యం ప్రత్యక్ష రాజకీయ జీవితానికి దూరం కావడంతో రెండేళ్ల క్రితం బీజేపీ ప్రధాని అభ్యర్థిత్వం అద్వానీని వరించింది. తాజా ఎన్నికల్లో ప్రధాని కల నెరవేరకపోవడంతో.. "ఎప్పటికీ ఆయనకది కలగానే మిగిలిపోనుందా" అనేది చాలా మందికి ఇప్పుడు సమాధానం తెలిసిన ప్రశ్నే. అయితే అద్వానీ మాత్రమే దీనికి స్పష్టమైన సమాధానం చెప్పగలరు.
ఇక ఇప్పటిదాకా బీజేపీలో దివిటీలా వెలుగుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ.. ఈసారి హీరో నుంచి జీరోకి పడిపోయారు. మోడీవల్లే ఈ ఎన్నికల్లో ఓడామన్నది కమలనాథుల కొత్తవాదన. అద్వానీతోపాటు మోడీకూడా ప్రధాని అభ్యర్థే నంటూ ప్రకటించి గందరగోళం సృష్టించడం వల్లే.. ఎక్కువసీట్లు రాలేదని పార్టీనేతలు భావిస్తున్నారు. అయితే.. మోడీసొంతరాష్ట్రంలో మాత్రం బీజేపీ ఒక్కస్థానాన్ని మెరుగుపరుచుకుని 15 స్థానాలు సాధించగా.. కాంగ్రెస్ ఒక్కస్థానాన్ని పోగొట్టుకొని.. పది స్థానాలకే పరిమితమయ్యింది.
18, మే 2009, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి