18, మే 2009, సోమవారం
రాజావారి విజయ రహస్యం..
అందరి అంచనాలు తలకిందులయ్యాయి. మహాకూటమి రాష్ట్రాన్ని క్లీన్‌స్వీప్ చేస్తుందనుకుంటే.. కూటమే స్వీప్ అయిపోయింది. నగదు బదిలీ.. కలర్ టీవీల పంపిణీలు.. అటు జూనియర్ ఎన్టీఆర్... ఇటు బాలకృష్ణ.. కూటమి అభ్యర్థులకు జోరుగా ప్రచారం చేయడం చూసి కాంగ్రెస్ నేతల వెన్నులో వణుకుపుట్టిన మాట నిజం. మరో వైపు మెగాస్టార్.. ఎటు వెళ్లినా జన ప్రభంజనం. దీంతో కాంగ్రెస్ ఈసారి బాల్చీ తన్నేస్తుందనే అంతా అనుకున్నారు. కాస్తో కూస్తే ప్రభావం ఉంటే మాత్రం వందలోపుకే పరిమితమవుతుందని అంచనా వేశారు. అయితే.. వైఎస్ సునామీ మాత్రం ఎవరూ ఊహించనంతగా ఎగిసిపడింది. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించింది. ఇంతకీ ఇందుకు కారణం ఏమిటి? తన ఎకౌంట్లో.. కొత్త పథకాలు లేకుండానే వైఎస్ ఎన్నికలకు వెళ్లినా... విజయం ఎలా సాధించగలిగారు. ఒక్కటే.. ఇప్పటివరకూ అమలవుతున్న పథకాలు జనం దగ్గరకు చేరడమే. ముఖ్యంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఒకప్పుడు.. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా గాయపడితే.. ఏ ఆటోనో.. కారో మాట్లాడుకుంటే తప్ప ఆసుపత్రికి వెళ్లేవాళ్లు కాదు. కానీ ఇప్పుడే.. 108 కొడితే చాలు.. పదినిమిషాల్లో అంబులెన్స్ సంఘటన జరిగిన చోటుకి చేరుకుంటుంది. నిజంగా ఇది అతిగొప్ప ప్రజోపయోగ కార్యక్రమమే. పేదవాళ్లకు కార్పొరేట్ ఆసుపత్రి ఇంతవరకూ అందని ద్రాక్షే. ఆరోగ్యశ్రీ పథకం మాత్రం దీన్ని తీపిద్రాక్షగా మార్చింది. ఇది డబ్బాకొట్టడం కాదు కానీ.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకోవాలి. ఆరోగ్యశ్రీలో అవకతవకలు లేవని చెప్పలేం.. కానీ.. ప్రతీ పనిలోనూ వంద శాతం ఆక్యురెన్సీ ఈ భూప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు. కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఈ పథకం వల్ల నష్టపోయినవారికన్నా.. లాభపడ్డవారే ఎక్కువ. మొత్తం మీద అంబులెన్స్‌పై ఉండే రెడ్‌లైటే... వైఎస్‌కు గ్రీన్ సిగ్నల్ చూపించింది. ప్రాజెక్టుల్లోనూ అవినీతి జరిగుండొచ్చు. కాంట్రాక్టర్లు కోట్లాది రూపాయలు దిగిమింగి ఉండొచ్చు.. కానీ ఇవేవీ నేరుగా ప్రజలపై ప్రభావం చూపించే అవకాశం లేదు. నిత్యావసర ధరలు అమాంతం పెరిగాయి. ఇది వైఎస్‌కు మైనస్సే కానీ.. చంద్రబాబుపై మాత్రం జనానికి ఇంకా నమ్మకం కుదిరినట్లు లేదు.. అందుకే వైఎస్‌కు జై అన్నారు... ఒక్కమాటలో చెప్పాలంటే.. వైఎస్ జనాన్ని నమ్మాడు.. జనం వైఎస్‌ను నమ్మారు.. అందుకే కాంగ్రెస్‌కు జై కొట్టారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి