12, మే 2009, మంగళవారం
ఎన్డీఏ గూటికి చంద్రబాబు?
Categories :
ఎన్డీఏ . కేసీఆర్ . చంద్రబాబు . టిఆర్‌ఎస్ . మూడో కూటమి
మహాకూటమి.. మహాఫ్లాప్ అయ్యే దిశలో పయనిస్తోంది. ఎన్నికలముందు.. పోట్లాడుకుంటూనే.. ఒక్కపంచన చేరిన తెలుగుదేశం, టిఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐలు తలోదారి చూసుకునే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలవ్వడమే ఆలస్యం.. జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమిలో చేరిపోయిన టిఆర్‌ఎస్.. మిగిలిన మూడు పార్టీలకు ఝలక్ ఇచ్చింది. మూడోఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు దాదాపుగా లేనేలేవన్నది ఇప్పటిదాకా వెలువడ్డ అన్ని సర్వేల్లో తేలిన విషయం. పైగా.. యూపీఏను సోనియా.. ఎన్డీఏను అద్వానీ నడిపిస్తున్నట్లుగా.. మూడో కూటమిని ముందుండి నడిపించే నాయకుడే లేడు. ఆధిపత్యం కోసం అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ప్రధాని పదవి ఇస్తానంటేనే కూటమిలో చేరతానంటూ.. అటు మాయ.. ఇటు జయ లోపాయికారీ షరతులు పెట్టడమూ.. కూటమి ఏర్పాటు విఘాతంగా మారింది. లెఫ్ట్ పార్టీలు ముఖ్యంగా.. సీపీఎం థర్డ్ ఫ్రంట్‌కోసం విశేషంగా కృషి చేసినా.. సాధ్యం కాదన్న విషయం ఈపాటికే తెలిసొచ్చింది. అందుకే.. కాంగ్రెస్‌కు కేంద్రంలో మద్దతిచ్చేదే లేదని తెల్చి చెప్పేసిన... ఆ పార్టీ అధినాయకత్వం... ఇప్పుడు మెల్లగా మాటమారుస్తోంది. ఫలితాలయ్యాకే.. మద్దతు విషయం తేలుస్తామంటూనే.. కాంగ్రెస్ అంటరాని పార్టీ కాదనీ చెబుతోంది. లెఫ్ట్‌మద్దతు కోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ.. మన్మోహన్‌సింగ్ నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మూడో కూటమిలో చేరుతున్నట్లు ప్రకటించిన ఒరిస్సా.. బిజూ జనతాదళ్ పార్టీ కూడా తన వైఖరిని మార్చుకుంటున్నట్లే కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ వ్యవహారాన్ని చూసిన నవీన్ పట్నాయక్... తాము కూడా ఎన్డీఏతో కలిసి వెళ్లడమే మేలనుకుంటున్నారు. మొత్తంమీద మిగిలింది చంద్రబాబే. రాష్ట్రంలో సమీకరణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి ఎలాగూ మద్దతు ఇవ్వలేడు. దీంతో... బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడమా.. లేక తటస్థంగా ఉండడమా అన్నదే ఇప్పుడు తేల్చుకోవాల్సిన పరిస్థితి ఆయనకు ఎదురయ్యింది. రాష్ట్రంలో టిడీపీ విజయం సాధిస్తుందన్న అంచనాలున్న నేపథ్యంలో.. అధికారం దక్కితే.. ఎన్డీఏకే మద్దతు ఇవ్వాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఫలితంగా మధ్యంతర ఎన్నికలను తప్పించుకునే అవకాశం ఉంది. కేంద్రంలో కావల్సిన ప్రభుత్వం ఉంటే.. రాష్ట్రంలో కావల్సిన పథకాలను ఎలాంటి ఆటంకమూ లేకుండా అమలు చేసుకోవచ్చు. ఇలా ఏ రకంగా చూసుకున్నా.. ఎన్డీఏ చెలిమితో బాబుకు కలిసొచ్చేదే ఎక్కువ. మైనార్టీలు దూరం అవుతారని అనుకుంటే.. ప్రభుత్వంలో చేరకుండా.. బయటినుంచి మద్దతు ఇచ్చి.. కాలం గడిపేయొచ్చు. తెలంగాణలో బలమైన టీఆర్‌ఎస్సే.. బిజేపీతో కలుస్తున్నప్పుడు.. ఈ మైనార్టీ కార్డు.. టీడీపీకి పెద్దగా అడ్డుకాకపోవచ్చు. ఏదేమైనా.. చంద్రబాబును ఒప్పించడానికి.. బిజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు.. ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫలితాలు రావడం ఆలస్యం.... చంద్రబాబు ఏ గూటిలో చేరతారో తేలిపోతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నేను తెలుగు దేశం పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే మావోయిస్ట్ ని కాబట్టి చంద్రబాబు మైండ్ లో ఏముందో నాకు బాగా తెలుసు. చంద్రబాబు ఎల్లప్పుడూ బి.జె.పి. అభిమానే. కేవలం సెక్యులర్ ఇమేజ్ కోసం బి.జె.పి.ని విమర్శించాడు. ఒకవేల అతనికి అనుకున్నంత సెక్యులర్ ఇమేజ్ రాకపోతే తన పాత మిత్రుడు బి.జె.పి.కి దగ్గర అవుతాడు. NDA గెలిచినా, ఓడినా చంద్రబాబు మళ్లీ చేరేది NDA గూటికే.
రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం అని చంద్రబాబు చెప్పడం అంతా నాటకం. NDA గెలిచినా, ఓడినా అతను మళ్ళీ NDA గూటికే చేరుతాడు.
రాష్ట్రంలో కూడా ఓడినా, గెలిచినా బి.జె.పి.కే సపోర్ట్ ఇస్తాడు.