తమిళ పులుల పని దాదాపుగా అయిపోయినట్లే. శ్రీలంక ప్రభుత్వం ప్రభాకరన్ తో ఇక తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమయ్యింది. లొంగిపోవాలంటూ శ్రీలంక ప్రభుత్వం ఇచ్చిన అల్టిమేటంను ఎల్టీటీఈ ప్రభాకరన్ బేఖాతరు చేయడంతో సైన్యం రంగంలోకి దిగింది. నో ఫైర్ జోన్‌లోకి చొచ్చుకొని పోయిన మిలటరీ బలగాలు పుతుమధాలన్ ఆసుపత్రిని స్వాధీనం చేసుకున్నాయి. పెద్దపులి లొంగుబాటుకు ఇంకా తలుపులు తెరచే ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ సమస్యకు సైనిక చర్య పరిష్కారం కాదని చర్చల ద్వారా పరిష్కారం ఆలోచించాలని భారత్ సూచించింది. 24 గంటల్లో లొంగిపోవాలంటూ శ్రీలంక ప్రభుత్వం చేసిన హెచ్చరికను పెద్దపులి పెడచెవిన పెట్టింది. గడువు ముగిసినా ప్రభాకరన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇక సైన్యం రంగంలోకి దిగింది. టైగర్లకు గట్టి పట్టున్న ప్రాంతాలపై దాడులు ప్రారంభించింది. ఇప్పటికే పుతుమధాలన్ ఆసుపత్రికి స్వాధీనంలోకి తీసుకున్నట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా జరిగిన పోరులో ఓ సీనియర్ నేత సహా నలుగురు టైగర్లు మృతిచెందినట్లు తెలిపాయి. లొంగిపోతారో లేదా చస్తారో తేల్చుకోవాలంటూ సైన్యం వారికి స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా టైగర్ల ప్రాంతంలో చిక్కుకున్న పౌరులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇప్పటికే యాభై రెండు వేల మంది బయటకు వచ్చినట్లు సైన్యం పేర్కొంది. నో ఫైర్ జోన్ నుంచి సామాన్య ప్రజలు బయటకు వచ్చిన తర్వాత ప్రభాకరన్ అతని అనుచరులు లొంగిపోయే అవకాశం ఉందని శ్రీలంక భావిస్తోంది. మరోవైపు ప్రభాకర్ లొంగుబాటుకు తలుపులు తెరచే ఉన్నాయని శ్రీలంక అధ్యక్షుడు మహేంద రాజపక్సే వెల్లడించారు. ఒక వేళ పెద్దపులి లొంగిపోకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామన్నారు. అతనిపై ఉన్న అభియోగాల నేపథ్యంలో కోర్టులో హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు. అయితే రాజీవ్‌గాంధీ హత్య నేపథ్యంలో భారత్ కూడా ప్రభాకర్‌ను అప్పగించాలని కోరుతుందని ఆయన వెల్లడించారు. శ్రీలంకలో సైన్యం, టైగర్ల మధ్య జరుగుతున్న పోరుపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. సమస్యను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించింది. సమస్య పరిష్కారం కాకపోతే దాడులు, ప్రతిదాడులు జరుగుతూనే ఉంటాయని అభిప్రాయపడింది. ఎల్టీటిఈ సమస్యకు రాజకీయ పరిష్కారం ఒక్కటే మార్గమని పేర్కొంది.
22, ఏప్రిల్ 2009, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి