పాకిస్తాన్‌లో నియంతృత్వ పాలనపోయి.. ప్రజాస్వామ్య వ్యవస్థ కొలువు తీరిందన్న ప్రపంచ దేశాల సంతోషం అప్పుడే ఆవిరైపోయింది. ఆఫ్ఘన్‌లో ప్రాబల్యం కోల్పోయిన తాలిబన్లు ఇప్పుడు పాకిస్తాన్‌లో పాతుకుపోతున్నారు. చివరకు.. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు వంద కిలోమీటర్ల దూరంలోని బునేర్ పట్టణాన్ని ఆక్రమించుకొని.. ప్రమాద హెచ్చరికలు మోగించారు. సమస్యల సుడిగుండంలో ఉన్న పాకిస్తాన్‌కు మరో ప్రమాదం. ప్రభుత్వ వైఫల్యాన్ని.. బలహీనతను సొము్మ చేసుకుంటున్న తాలిబన్లు తమ ప్రాబల్యం పెంచుకుంటున్నారు. నార్‌త వెస్‌ట ప్రావిన్‌సలోని స్వాత్‌లోయపై పట్టు బిగించిన తాలిబన్లు.. ఇప్పుడు ఇతర ప్రాంతాలకు విస్తరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్వాత్‌లోయలో పూర్తిగా తాలిబన్ నియంతృత్వమే కొనసాగుతోంది. వారు చెప్పిందే వేదం.. చేసిందే చట్టం. ప్రభుత్వాన్ని బెదిరించి మరీ షరియా చట్టం అమలుకు ఆమోద ముద్ర వేయించుకోగలిగారు తాలిబన్లు. దీని ప్రకారం ప్రజాస్వామ్య చట్టాలకు బదులు.. ఇస్లాం చట్టాలు అమలులోకి వచ్చాయి. పాక్ ప్రభుత్వ వ్యవస్థ అక్కడ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. స్వాత్‌లోయంతా ఇప్పుడు తాలిబన్‌ల రాజ్యం.. కొన్నేళ్లక్రితం ఆప్ఘనిస్తాన్‌లో ఏదైతే చేశారో.. అచ్చంగా దాన్నే అమలు పరుస్తున్నారు ఈ ముష్కర మూకలు. అయితే.. స్వాత్‌లోయలో అధికారం అందడంతోనే ఆగలేదు తాలిబన్లు. పాకిస్తాన్‌లో మరింత పట్టు బిగించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగమే.. బునేర్ పట్టణంపై దాడి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు కేవలం వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణాన్ని తాలిబన్లు ఆక్రమించారు. అత్యాధునిక మారణాయుధాలతో బునేర్ పట్టణంలో సై్వర్య విహారం చేస్తూ.. అల్లకల్లోలం సృష్టించారు. సైనిక బలగాలు లేకపోవడం.. అక్కడున్న భద్రతా వ్యవస్థ బలహీనమైంది కావడంతో.. తాలిబన్లు సులువుగానే బునేర్‌ను చేజిక్కించుకున్నారు. బునేర్‌తో పాటు.. షాంగ్లా జిల్లా కూడా తాలిబన్ ఆక్రమణలోకి వెళ్లిపోవడంతో.. ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమయ్యింది. పాకిస్తాన్‌పై అమెరికా సహా అనేక దేశాలు ఒత్తిడి తెచ్చాయి. దీంతో.. పాకిస్తాన్ బునేర్‌కు సైన్యాన్ని తరలిస్తున్నట్లు ప్రకటించింది. వెంటనే వెనక్కు తగ్గాలని తాలిబన్లకు అల్టిమేటం జారీ చేసింది. ముందు బెట్టు చేసినప్పటికీ.. పరిస్థితులను జాగ్రత్తగా గమనించిన తాలిబన్లు వెనక్కి తగ్గారు.. బునేర్ పట్టణాన్ని ఖాళీ చేస్తున్నట్లు ప్రకటించారు. బునేర్ పట్టణం నుంచి తాలిబన్లు వెనక్కి తగ్గడాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. అయితే.. అంతా నిజం కాదన్నది మరో వాదన. ఇప్పటికీ బునేర్‌లో కొన్ని ప్రాంతాల్లో తాలిబన్లు నక్కే ఉన్నారని సమాచారం.
తాలిబన్లు ఎలా వచ్చారు ?
బునేర్‌ను వదిలి వెళ్లారనే అనుకుందాం.. కానీ సరిహద్దులకు అవతల ఉండాల్సిన ఉగ్రవాదులు.. యధేచ్చగా దేశంలోకి ఎలా చొచ్చుకు రాగలిగారు. దేశ రాజధానిని ఎలా సమీపించగలిగారు... ఇవే కీలక ప్రశ్నలు. వీటికి సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో లేదు.. పాకిస్తాన్ ప్రభుత్వం. తాలిబన్ ఉగ్రవాదులు పాక్‌లో ప్రవేశించడం వెనక చాలా పెద్ద కథే నడిచింది. సెప్టెంబర్ 11 డబ్లుటిసి టవర్‌సపై అల్‌ఖైదా దాడులతో.. అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి చేసింది. అప్పటివరకూ అక్కడ అధికారాన్ని అనుభవించిన తాలిబన్లు పారిపోవాల్సి వచ్చింది. నగరాలను, పట్టణాలను వదలి కొండల్లోకి వచ్చేసిన ఈ అఫ్ఘన్ ఉగ్రవాదులు.. పాకిస్తాన్ సరిహద్దుల్లోని స్వాత్‌లోయపై కన్నేశారు. పాక్ సరిహద్దులు దాటి వచ్చి క్రమంగా బలం పెంచుకున్నారు. పాకిస్తాన్‌లోని నార్‌తవెస్‌ట ఫ్రంటియర్ ప్రావిన్‌సలోని ఈ భూభాగంలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండడమూ వీరికి కలిసొచ్చింది. పాక్ సైన్యం ఎక్కువగా భారత సరిహద్దుల్లోనే మోహరించి ఉండడంతో.. వీరిని కట్టడి చేయలేకపోయింది పాక్ ప్రభుత్వం. దీంతో అతి తక్కువ కాలంలోనే ఈ ప్రాంతంలో తమ బలగాన్ని పెంచుకున్నారు తాలిబన్లు. స్థానిక మత పెద్దలతో సత్సంబంధాలు పెట్టుకున్న తాలిబన్లు.. తమ విస్తరణకు మతాన్నే పావుగా వాడుకొన్నారు. ఇస్లామిక్ చట్టాలను అమలు చేయాలంటూ మత పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. ప్రపంచమంతా ఈ చట్టాన్నే అమలు చేద్దామంటూ ప్రజలను రెచ్చగొట్టారు. ఇలా ఉద్రేక పూరిత ప్రసంగాలతో జనంలో మద్దతు కూడగట్టుకున్నారు. 2007 నుంచి తాలిబన్ల ప్రభావం ఇక్కడ పెరిగిపోయింది. అదే ఏడాది నవంబర్‌లో అలపురి జిల్లాపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. అక్కడి పోలీసులు పెద్దగా ప్రతిఘటించకుండానే పారిపోయారు. అయితే.. డిసెంబర్ నాటికి పాక్ బలగాలు తాలిబన్లతో తీవ్రంగా పోరాడాయి. 250 మంది మిలిటెంట్లను హతమార్చి.. స్వాత్‌లోయను విముక్తి చేశామని ప్రకటించాయి. అయితే ఆ తర్వాతే.. అసలుగొడవ మొదలయ్యింది. కిడ్నాప్‌లు.. హత్యలకు తాలిబన్లు తెగబడ్డారు. ఆత్మాహుతి దాడులనూ పెంచారు. ఇలా దాడులకు పాల్పడుతూ.. అల్లకల్లోలం సృష్టించారు తాలిబన్లు. పాకిస్తాన్ అధ్యక్షుడు.. ప్రధానులు.. తమ సొంత పనులు చక్కబెట్టుకుంటుండగానే.. స్వాత్ లోయలో అధికారం ప్రభుత్వం చేజారింది. ఈ జనవరి వచ్చే సరికి స్వాత్‌లోయను ప్రభుత్వం పూర్తిగా వదిలేసుకుంది. స్వాత్‌లోయలో అల్లకల్లోలం ఏర్పడడంతో.. దేశవ్యాప్తంగా కలకలం మొదలయ్యింది. మరోవైపు.. మతపెద్దలూ ప్రభుత్వంపై ఒత్తడి తేవడం మొదలుపెట్టారు. అందుకే.. ఎప్పుడూ లేనట్టుగా.. స్వాత్ లోయలో షరియా చట్టాన్ని అమలు చేయడానికి పాక్ అధ్యక్షుడు జర్దారీ ఆమోదముద్ర వేశారు. దీనిప్రకారం.. పాక్ రాజ్యాంగం గానీ.. చట్టాలు గానీ.. స్వాత్ లోయలో ఏమాత్రం పనిచేయవు. పాలనంతా తాలిబన్ల చేతుల్లోకి పూర్తిగా వెళ్లిపోయింది. జర్దారీ ఇలా సంతకం చేశారో లేదో.. అలా తాలిబన్లు హవా చెలాయించడం మొదలుపెట్టారు. ఆడపిల్లలు చదువుకోకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. పురుషుల తోడు లేకుండా.. మహిళలు బయటకు రాకూడదని కట్టుదిట్టం చేశారు.
పాక్ లో తాలిబాన్ రాజ్య స్థాపనే ధ్యేయం
అధికారం వచ్చిందని ఆగలేదు.. అల్లరిమూకలు. పాక్ ప్రభుత్వం లొంగిపోయిందన్న భావనతో.. దుందుడుకు చర్యలు మొదలుపెట్టారు. ఏకంగా పాకిస్తాన్ మొత్తాన్ని ఆక్రమించుకోవడానికి పన్నాగం పన్నారు. అందులో భాగమే.. బునేర్ ఆక్రమణ.. ఈమాటలు చాలు.. తాలిబన్లు స్థానికులను ఎంతగా ప్రభావితం చేస్తున్నారో తెలుసుకోవడానికి. ఇ స్లాంను ప్రపంచవ్యాప్తం చేస్తామంటూ.. ప్రజల్లో చొచ్చుకువెళుతున్నారు ఉగ్రవాదులు. షరియా చట్టానికి అనుకూలంగా పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టుకున్నారు. ఇదే చట్టం అమలు కావాలంటున్నారు.. స్వాత్‌లోని స్థానికులు. బునేర్‌లోనూ తాలిబన్లకు ప్రజలనుంచి ప్రతిఘటన ఎదురుకాలేదు. పాక్ ప్రభుత్వం కన్నా కరుడుగట్టిన ఉగ్రవాదులే నయమన్న ఉద్దేశం.. అక్కడి ప్రజలది. ఇదంతా పాకిస్తాన్ పాలకులు చేసిన పుణ్యమే. సైనిక పాలన.. అల్లకల్లోలమైన ఆర్థిక వ్యవస్థ.. నింగికెగసిన నిత్యావసర ధరలు.. ముషరాఫ్, జర్దారీ, నవాజ్ షరీఫ్‌ల స్వార్థ రాజకీయాలతో జనం విసిగిపోయారు. ఇవన్నీ కలగలిపి తాలిబన్లకు మద్దతునిచ్చేలా చేశాయి. ఇలా ఏరకంగా చూసుకున్నా.. తాలిబన్లు బలం పుంజుకోవడానికి .. పాకిస్తాన్ ప్రభుత్వమే కారణం. అయితే.. ఈ తాలిబన్లను పెంచి పోషించింది అమెరికానే. ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కూడా స్వయంగా సెలవివ్వడమే దీనికి నిదర్శనం. పాముకు పాలుపోస్తే.. పెరిగి పెదై్ద ఎలా కాటేస్తుందో.. తాలిబన్లు కూడా అదే తరహాలో ఇప్పుడు విషం చిము్మతున్నారు. బిన్‌లాడెన్ సంస్థ అల్‌ఖైదా అండతో.. ఆర్థికంగా.. ఆయుధపరంగా బలోపేతమై రోజురోజుకూ విస్తరిస్తున్నారు. ఆప్ఘనిస్తాన్ విషయంలోనూ.. తాలిబన్లపై మెతకవైఖరినే అవలంబించింది పాకిస్తాన్. స్వాత్‌లోయలో అడుగుపెడుతున్నప్పుడే వారిని దెబ్బతీసి ఉంటే.. ఈరోజు ప్రధాన భూభాగాన్ని కోల్పోయే ప్రసక్తే ఉండేది కాదు. ఇలా అన్ని రకాలుగా.. పాకిస్తాన్.. అమెరికాలే ఈ మహాసర్పాన్ని పెంచిపోషించారు. కానీ... ఇప్పుడు పాక్ నోరు పారేసుకుంటుంది మాత్రం మనపైనే. తాలిబన్ ఉగ్రవాదులను మనమే పెంచి పోషించామంటోంది పాకిస్తాన్. ఎంతమాట.. ఎంతమాట.. అయితే.. అమెరికా మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా ప్రవర్తించింది. ముందు తాలిబన్ల పనిపట్టమంటూ పాక్‌కు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ఆగ్రహాన్ని చూసిన పాకిస్తాన్ ఇప్పుడు హడావిడిగా ... సైన్యాన్ని స్వాత్ లోయకు పంపిస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడే ఆ దేశం వ్యహరిస్తున్న రెండునాల్కల ధోరణి బయటపడింది. స్వాత్‌లో తాలిబన్ల పాలనకు గేట్లు తెరుస్తూ.. షరియా చట్టానికి అనుమతి ఇచ్చి వారం రోజులు కాకుండానే.. సైన్యంతో దాడి చేస్తున్నామని ప్రకటిస్తే.. ఎవరైనా నమ్మగలరా.. కానీ నమ్మించడానికి ప్రయత్నిస్తుంది పాకిస్తాన్.
29, ఏప్రిల్ 2009, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి