24, ఏప్రిల్ 2009, శుక్రవారం
రెండో దశ ఎన్నికల్లో 55 శాతం పోలింగ్
దేశవ్యాప్తంగా గురువారం జరిగిన రెండో దశ లోక్‌సభ ఎన్నికల్లో 55 శాతానికిపైగా పోలింగ్ నమోదయింది. ఎన్నికలు జరిగిన 12 రాష్ట్రాల్లోని 140 నియోజకవర్గాల్లో మొత్తం 200 మిలియన్ల మంది ఓటర్లు ఉన్నారు. జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లోని కొన్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మినహా దేశవ్యాప్తంగా రెండో దశ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.బీహార్‌లోని ముజాఫర్‌పూర్ జిల్లాలో మావోయిస్టులు గురువారం సాయంత్రం ల్యాండ్‌మైన్ పేల్చడంతో ఐదుగురు పోలీసు సిబ్బంది మృతి చెందారు. మృతుల్లో ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్ కూడా ఉన్నారు. ఈవీఎంలు తీసుకెళుతున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఈ దాడి చేశారు. బీహార్, జార్ఖండ్‌లో మావోలు జరిపిన ఇతర దాడుల్లో ఇద్దరు ఎన్నికల అధికారులు, ఓ జిల్లా కలెక్టర్ తృటిలో తప్పించుకున్నారు.ఐదు దశల్లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన రెండో దశ పోరులో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ (అమేథీ), ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (మాధా), కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి కమల్ నాథ్ (చింద్వారా), ఎల్జేపీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్ (హాజీపూర్), బీజేపీ నేత సుష్మా స్వరాజ్ (విదిషా) తదితర రాజకీయ ప్రముఖులు కూడా పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉన్నారు.రెండో దశతో దేశవ్యాప్తంగా 265 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 543 సీట్లు ఉన్న లోక్‌సభలో 125 సీట్లకు తొలి దశలో ఎన్నికలు జరిగాయి. గురువారం జరిగిన రెండో దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 140 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే రోజుతో పూర్తయ్యాయి.కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కీలకమైన ఆంధ్రప్రదేశ్‌లో 68 శాతం పోలింగ్ నమోదుకాగా, ఒరిస్సాలో 55 శాతం, మహారాష్ట్రలో 56 శాతం, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 44 శాతం, కర్ణాటకలో 55 శాతం, మధ్యప్రదేశ్‌లో 45 శాతం, జార్ఖండ్‌లో 47 శాతం, జమ్ము- కాశ్మీర్‌లో 46 శాతం పోలింగ్ నమోదయింది. రెండో దశ ఎన్నికలు దాదాపుగా ప్రశాంతంగా జరగడం సంతృప్తినిచ్చిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి