16, జనవరి 2012, సోమవారం
కేవీపీ నిజం చెప్పారా..?
ఎమార్ కేసులో సీబీఐ ముందడుగు వేసింది. ఈ కేసులో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న కేవీపీ రామచంద్రరావును అధికారులు మూడుగంటల పాటు ప్రశ్నించారు. వైఎస్ హయాంలో APIICకు వాటాలు తగ్గడంలో కేవీపీ కీలకపాత్ర పోషించి ఉంటారని సీబీఐ అనుమానిస్తోంది. ఎమార్ కేసులో వచ్చే నెలలో ఛార్జిషీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో, కీలక వివరాలను తెలుసుకోవడానికి.. కేవీపీని అధికారులు ప్రశ్నించారు. APIIC వాటా తగ్గడంపైనా, విల్లాల కేటాయింపుపైనా.. కేవీపీపై ప్రశ్నలవర్షం కురిపించారు సీబీఐ అధికారులు.
ఎమార్ కుంభకోణం జరిగిన సమయంలో APIIC డైరెక్టర్‌గా ఉన్న పార్థసారధి.. కేవీపీ బంధువు కావడంతో.. కథంతా ఆయనే నడిపించారని సీబీఐ భావిస్తోంది. దీనికి తోడు ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న బీపీ ఆచార్యతో ఉన్న సంబంధాలపైనా అధికారులు ఆరా తీశారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సమయంలోనే ఎమార్‌లో విల్లాల కేటాయింపు జరిగింది. కేవీపీ భార్య సునీత పేరుతో, వియ్యంకుడు రఘురామరాజు, అతని స్నేహితులకు 16 విల్లాలు కేటాయించడంలో కేవీపీ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దీనిపైనా సీబీఐ ప్రశ్నించి, వివరాలను నమోదు చేసుకుంది. కేవీపీ మాత్రం తనను సాక్షిగానే పిలిచారని, తనదగ్గరున్న సమాచారాన్ని అందించానని మీడియాకు తెలిపారు.
ఎమార్ ప్రాపర్టీస్ కేసులో కేవీపీ రామచంద్రరావు ఇచ్చిన సమాచారమే.. సిబిఐ దర్యాప్తులో కీలకం కానుంది. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు, బీపీ ఆచార్య, పార్ధసారధిల అరెస్టుకు సీబీఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ కేసులో అరెస్టుల ప్రకియ మొదలైనట్లే, ఎమార్ లోనూ అరెస్టులు త్వరలోనే ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి