4, జనవరి 2012, బుధవారం
ఛానళ్ల అమ్మకంపై రామోజీ ప్రకటన...
నెట్‌వర్క్ 18 చేసిన ప్రకటనకు కాస్త భిన్నమైన ప్రకటనను రామోజీ గ్రూప్ సంస్థ ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ చేసింది. దీని ప్రకారం, ఈటీవీలో ఛానళ్ల అమ్మకం ఎప్పుడో పూర్తైపోయింది. ఈటీవీ తెలుగు, ఈటీవీ 2 మినహా మిగిలిన అన్ని ఛానళ్లను ముఖేష్ అంబానీ చాలా రోజుల క్రితమే కొనేశారు. ఈటీవీ తెలుగు, ఈటీవీ 2 ల్లో మాత్రం 49 శాతం రిలయన్స్ కొనుగోలు చేసింది. రిలయన్స్ కొన్న ఛానళ్లలోనే వాటాలను.. టీవీ 18 దక్కించుకుంది. దీన్ని బట్టి చూస్తే, ఇది టీవీ 18కు, రిలయన్స్‌కు మధ్య కుదిరిన ఒప్పందమే తప్ప.. ఈటీవీకి, టీవీ 18కు కుదిరిన ఒప్పందం కాదని తెలుస్తోంది. ఈటీవీ నెట్‌వర్క్‌ను రిలయన్స్ కొనుగోలు చేసిందన్న విషయమూ ఇంతవరకూ బయట పడకపోవడం విశేషమే.. బహుశా, ఈటీవీ గ్రూప్ ఎంప్లాయిస్‌కు ఇది మరింత పెద్ద షాక్ కావచ్చు.. ఛానళ్ల అమ్మకంపై రామోజీ గ్రూప్ ఇచ్చిన వివరణ ఇదీ..
ఈటీవీ ఛానెళ్లలో వాటాల మార్పిడి జరిగింది. రామోజీరావుకు చెందిన మీడియా సంస్థ ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కొద్దికాలం క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన గ్రూపు కంపెనీల ద్వారా పెట్టుబడి పెట్టింది. ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌కు రెండు తెలుగు ఛానళ్లు(ఈటీవీ, ఈటీవీ-2), పది ఇతర భాషా ఛానళ్లు ఉన్న విషయం విదితమే. ఇందులో ఈటీవీ బంగ్లా, ఈటీవీ మరాఠీ, ఈటీవీ కన్నడ, ఈటీవీ గుజరాతీ, ఈటీవీ ఒరియాలు భాషా ఛానళ్లు కాగా, ఈటీవీ ఉర్దు, ఈటీవీ ఉత్తరప్రదేశ్, ఈటీవీ బీహార్, ఈటీవీ రాజస్థాన్, ఈటీవీ మధ్యప్రదేశ్ మాత్రం వార్తా- వినోద ఛానళ్లు. ఇంతకుముందు కుదిరిన ఒప్పందం ప్రకారం రెండు తెలుగు ఛానళ్లు మినహా, మిగిలిన 10 ఛానళ్లలో 100% వాటా రిలయన్స్ గ్రూపు సంస్థలకు దక్కుతుంది. రెండు తెలుగు ఛానళ్లలో మాత్రం 49% వాటా కేటాయిస్తారు. మిగిలిన 51% వాటా ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌కే ఉంటుంది.
రిలయన్స్ నుంచి టీవీ 18కు ....
మరోవైపు రిలయన్స్ గ్రూపు సంస్థలు ఈటీవీ ఛానళ్లలోని తమ వాటాను కొంత మేరకు టీవీ 18 బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్, నెట్‌వర్క్ 18లకు విక్రయిస్తున్నాయి. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టీవీ 18 బ్రాడ్‌కాస్ట్, నెట్‌వర్క్ 18 సంస్థలు మంగళవారం వెల్లడించాయి. దీని ప్రకారం రిలయన్స్ గ్రూపు సంస్థల నుంచి అయిదు ఈటీవీ ప్రాంతీయ వార్తా- వినోద ఛానళ్లలో(ఈటీవీ ఉర్దు, ఈటీవీ ఉత్తరప్రదేశ్, ఈటీవీ బీహార్, ఈటీవీ రాజస్థాన్, ఈటీవీ మధ్యప్రదేశ్) నూరు శాతం వాటాను నెట్‌వర్క్ 18 కొనుగోలు చేస్తోంది. అదేవిధంగా అయిదు ఇతర భాషా ఛానళ్లలో (ఈటీవీ బంగ్లా, ఈటీవీ మరాఠీ, ఈటీవీ కన్నడ, ఈటీవీ గుజరాతీ, ఈటీవీ ఒరియా) 50% వాటా తీసుకుంటోంది. అంతేగాక రెండు తెలుగు ఈటీవీ ఛానళ్లలోనూ తనకు ఉన్న 49% వాటా నుంచి రిలయన్స్ గ్రూపు సంస్థలు 24.5% వాటాను నెట్‌వర్క్ 18 సంస్థలకు విక్రయిస్తున్నాయి.
నిధుల సేకరణకు నెట్‌వర్క్ 18 సన్నాహాలు
ఈటీవీ ఛానళ్లలో వాటాల కొనుగోలు నిమిత్తం అవసరమైన నిధుల సేకరణకు నెట్‌వర్క్ 18, టీవీ 18 సన్నాహాలు చేస్తున్నాయి. రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సేకరించనున్నట్లు ఈ కంపెనీలు వెల్లడించాయి. రైట్స్ ఇష్యూలో భాగంగా ఈ రెండు సంస్థల ప్రమోటర్లు కూడా తమ వంతు వాటా నిధులు తెచ్చేందుకు సంసిద్ధమవుతున్నారు. నెట్‌వర్క్ 18 మీడియా, టీవీ 18 బ్రాడ్‌కాస్ట్‌లు రెండూ స్టాక్ మార్కెట్లో నమోదైన సంస్థలు. ఈ రెండూ మంగళవారం రైట్స్ ఇష్యూ ప్రకటన చేశాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Nice Analysis
?!