19, డిసెంబర్ 2011, సోమవారం
పొట్టగొట్టదన్నందుకు.. కేసు పెట్టారు
Categories :
iron ore mines . marlapadu . news . TOP
గనులు మాకొద్దు.. మా పొలాలే మాకు కావాలి. .మా గ్రామం మాకు కావాలి అన్న పాపానికి కిరణ్ కుమార్ సర్కార్ జనంపై కేసులు పెట్టింది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని మర్లపాడు చుట్టుపక్కల గ్రామాల్లో ఐరెన్ ఓర్ గనుల తవ్వకాలకు ఏపీ మైనింగ్ కార్పొరేషన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనికోసం ప్రజాభిప్రాయ సేకరణకు చాలా కాలం క్రితమే శ్రీకారం చుట్టింది. రెండోవిడత ప్రజాభిప్రాయ సేకరణకు ప్రకాశం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సహా ఇతర అధికారులు డిసెంబర్ 17న మర్లపాడుకు చేరుకున్నారు. తమతో పాటే గనుల తవ్వకాలకు అనుకూలంగా ఉన్న కొంతమంది జనాన్ని పోగేసుకువచ్చారు. ఇది స్థానికుల్లో ఆగ్రహావేశాలను రగిలించింది. గ్రామేతరులను అడ్డుకున్న స్థానికులు, వారి వాహనాలపై దాడి చేశారు. కలెక్టర్ నిర్వహిస్తున్న సభ జరగకుండా అడ్డుపడ్డారు. కలెక్టర్ వెళ్లకుండా ఆయన కారు టైర్లలో గాలి తీసేశారు. దీంతో పోలీసులు జనంపై విరుచుకుపడ్డారు. ఓ దశలో తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ఓ మహిళ ఈ తొక్కిసలాటలో స్పృహ కోల్పోయింది. గ్రామస్తులు ఇదంతా చేసింది, తామెంతో కాలంగా నమ్ముకుని బతుకున్న గ్రామాన్ని, పొలాలను కాపాడుకోవడానికి. కానీ, పోలీసులకు మాత్రం ఇదంతా చట్ట వ్యతిరేక పనిలా కనిపించింది. అంతే, పోలీసులు,అధికారులపై దాడి చేశారంటూ మర్లపాడుకు చెందిన చాలామందిపై కేసులు నమోదు చేశారు. దీన్ని నిరసిస్తూ, ఇవాళ మర్లపాడు చుట్టుపక్కలకు చెందిన ఐదు గ్రామాల వాసులు ఒంగోలుకు కాలినడకన వచ్చి, ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. తమపై అక్రమ కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. పొరపాటునే అతిగా ప్రవర్తిస్తే, క్షమించాలని వేడుకొన్నారు. తమ తాపత్రయమంతా భూములకోసమేనని వివరణ ఇచ్చుకున్నారు. అయితే, కేసుల ఎత్తివేత విషయంలో మాత్రం ఎస్పీ నుంచి ఎలాంటి హామీ రాలేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి