31, జనవరి 2011, సోమవారం
మారుతున్న రాష్ట్ర రాజకీయం
రాష్ట్రంలో రాజకీయం అనూహ్యంగా మారుతోంది. గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌కు వచ్చిన రక్షణమంత్రి ఎ.కే.ఆంటోని చిరంజీవితో సంప్రదింపులు జరిపారు. చర్చల అనంతరం సోనియాతో చర్చించడానికి చిరంజీవికి ఆహ్వానం అందింది. ఇది దేనికి సంకేతం. ప్రభుత్వంలో చిరంజీవి చేరబోతున్నారా..? చిరంజీవి మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆరాటపడుతోంది..?
చిరంజీవి విషయంలో ఎప్పటినుంచో నాన్చుడు ధోరణిని అనుసరిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు ముందడుగు వేసింది. ప్రభుత్వంలో చేరే విషయంలో, ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో చిరంజీవిని ఒప్పించడానికి, ఆయనకు కావల్సింది చేసిపెట్టడానికి సిద్ధమయ్యింది. అందుకే కేంద్ర రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీని రాయబారిగా హైదరాబాద్‌కు పంపించింది. కేవలం సోనియాగాంధీతో చర్చలకు ఆహ్వానించడానికే ఆంటోనీ చిరంజీవి ఇంటికి వచ్చారని పీఆర్పీ చెబుతున్నా, తెరవెనుక మాత్రం చాలా జరిగినట్లే తెలుస్తోంది. ఆహ్వానం కోసమే అయితే ఆపనిని డీఎస్ ద్వారానో, లేదంటే సీఎం ద్వారానో సోనియాగాంధీ చెప్పించవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయిలో చక్రం తిప్పే ఆంటోనీనే రంగంలోకి దించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర కేబినెట్‌లో పీఆర్పీ చేరడంతో పాటు.. కేంద్రంలోనూ మంత్రి పదవిని పీఆర్పీకి అందిస్తామంటూ ఆంటోని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రాథమిక చర్చలు ఫలించడంతో మలివిడత చర్చలకు సోనియా దగ్గరకే చిరంజీవి వెళ్లబోతున్నారు.
జగన్ వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొగ్గుచూపడం, సభలో విశ్వాసానికి సిద్ధం కమ్మంటూ జగన్ వర్గం సవాల్ చేయడం చూసి బహుశా కాంగ్రెస్ పార్టీ కంగారు పడుతుందేమో.? ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందో అన్న భయం కాంగ్రెస్‌ది. దీనికి తోడు తెలంగాణ ఉద్యమం కూడా గుబులు పుట్టిస్తోంది. అందుకే ముందు జాగ్రత్తగా పీఆర్పీని దువ్వుతోంది.
ఈ సారి జరిగే అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడిస్తామంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్ తివారి ప్రకటించారు. అంటే, తెలంగాణ విషయంలో ముక్కుసూటిగానే వెళ్లాలని భావిస్తోందన్నమాట. అది తెలంగాణకు అనుకూలమైనా, వ్యతిరేకమైనా వచ్చే ఇబ్బందులను తట్టుకోవడం కోసమే చిరు మద్దతు తీసుకోవాలనుకోంటుందన్నమాట.. ఏమైనా ఈ ఒప్పందం వెనుకున్న రహస్యాలు.. ఉద్దేశాలు త్వరలోనే బయటపడడం ఖాయం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి