1, ఫిబ్రవరి 2011, మంగళవారం
అరచేతిలో సూర్యుడు
ప్రజారాజ్యం సూర్యుడు.. కాంగ్రెస్ జెండాపై ఉదయించబోతున్నాడు. ప్రజారాజ్యం జెండాను పక్కన పెట్టి.. కాంగ్రెస్ జెండాకు జై కొట్టబోతున్నాడు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో సాక్షాత్కారం కాబోయే దృశ్యమిది. ఇంతవరకూ రెండు పార్టీలుగా ఉన్న.. కాంగ్రెస్.. పీఆర్పీలు ఇకపై ఒక్కటిగా మారబోతున్నాయి. అయితే.. కాంగ్రెస్ పార్టీకి చిరంజీవితో అవసరం ఏమిటి? చిరంజీవికి కాంగ్రెస్‌తో పనేంటి? విలీనం కోసం ఈ రెండు పార్టీలు ఎందుకు తాపత్రయ పడుతున్నాయి.?
ప్రజారాజ్యం... ఎన్నికలకు ముందు ఎన్నో ఆశలతో.. ఎన్నో ఆకాంక్షలతో ప్రారంభమైన పార్టీ. వెండితెర జీవితాన్ని త్యాగం చేసి రాజకీయాల్లో సత్తా చూపించుకోవాలని చిరంజీవి ప్రారంభించిన పొలిటికల్ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీపై దేశంలోనే అతిపెద్దది.. పురాతనమైనదీ అయిన కాంగ్రెస్ పార్టీ కన్ను పడింది. పీఆర్పీని తనలో ఐక్యం చేసుకోవాలనుకొంటోంది. అందుకే, వడివడిగా పావులు కదుపుతోంది.
కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషించే ఎ.కే.ఆంటోనీ.. పీఆర్పీతో చర్చలకు రాయబారిగా వచ్చారు. రహస్యంగా హైదరాబాద్ వచ్చిన ఆంటోనీ చిరంజీవికి అసలు విషయాన్ని చెప్పేశారు. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయమంటూ విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే.. చిరంజీవి కోరిన వారికి మంత్రి పదవులతో పాటు.. ఇతర తాయిలాలూ అందిస్తామని ఆశ చూపించారు. తొలిదఫా చర్చలు సానుకూలంగా ముగియడంతో మలివిడత చర్చలను నేరుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో జరపవచ్చంటూ చిరంజీవికి ఆహ్వానాన్నికూడా అందించారు. చిరంజీవికి కూడా సోనియాతో చర్చలకు సిద్ధమవుతున్నారు. అంటే.. విలీనం ఖాయమేనా..?
ఆంటోనీ రాయబారం తర్వాత పీఆర్పీలో కాస్త అయోమయ పరిస్థితి నెలకొంది. పార్టీని విలీనం చేయాలా వద్దా అన్నది తేల్చుకోలేకపోతోంది. దీనిపై త్వరలోనే పీఆర్పీ అధినేత చిరంజీవి నిర్ణయం తీసుకోవచ్చు. అయితే.. ఇప్పటికిప్పుడు పీఆర్పీని తనలో విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎందుకు భావిస్తోంది..? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు చిరంజీవితో ఉన్న అవసరం ఏమిటి? పీఆర్పీ అధినేతకూ కాంగ్రెస్ పార్టీతో పని పడిందా..? విలీనానికి గానీ, మద్దతుకు గానీ ఎందుకు మొగ్గు చూపుతున్నారు?
రాష్ట్ర రాజకీయాన్ని, రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోయే నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతోందా..? రాష్ట్ర సర్కార్‌కు ముప్పుందన్న భయంతోనే చిరంజీవిని చేరదీస్తోందా..? భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం ఇప్పటినుంచే పావులు కదుపుతోందా..? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్-పీఆర్పీల మధ్య పెనవేసుకుంటున్న బంధం చుట్టూ తిరుగుతున్నాయి.. మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఏమిటి?
చిరుతో కాంగ్రెస్‌కు అవసరం ఏమిటి?
రాష్ట్రంలో ఎప్పటినుంచో అధికారం పంచుకుంటున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రత్యామ్నయమంటూ 2009 ఎన్నికల్లో పోటీ చేసింది ప్రజారాజ్యం పార్టీ. చిరంజీవి స్టార్‌డమ్‌నే పెట్టుబడిగా పెట్టుకున్నా, ఓటర్ల మనస్సులను మాత్రం పూర్తిగా గెలుచుకోలేకపోయింది. అందుకే.. కేవలం పద్దెనిమిది సీట్లను మాత్రమే దక్కించుకోగలిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి కూడా 2004తో పోల్చితే సీట్లు తగ్గినా సాధారణ మెజార్టీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌పై పీఆర్పీ వైఖరి క్రమంగా మారిపోయింది. ప్రభుత్వంపై కొన్ని విషయాల్లో పోరాడినా... చాలా విషయాల్లో మాత్రం మద్దతుగానే నిలిచింది. అంతేకాదు.. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తే తాము ఆదుకుంటామంటూ చిరంజీవే చాలాసార్లు ప్రకటించారు. పీఆర్పీ ఇలా బాహటంగానే మద్దతు ఇస్తున్నా.. కాంగ్రెస్ పార్టీ విలీనం కోసం ఎందుకు ప్రయత్నిస్తోందన్నదే ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేస్తున్న విషయం.
చిరంజీవితో కాంగ్రెస్ చెలిమి బలోపేతం కావడానికి ప్రధాన కారణం జగన్. కాంగ్రెస్ పార్టీనుంచి బయటపడ్డ జగన్.. తన బలాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. పార్టీ పెట్టకముందే దీక్షలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వల వేస్తున్నారు. ఇప్పటికే 30 మందిదాకా ఎమ్మెల్యేలు జగన్‌తో జట్టుకట్టారు. వీరందరినీ వదులుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడుతుంది. పైగా, కాంగ్రెస్‌కు, జగన్ ఎమ్మెల్యేలకు మధ్య అంతరం పెరుగుతోంది. జగన్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలంటూ స్వయంగా సీఎం ప్రకటించడం.. కిరణ్ సర్కార్ సభలో బలాన్ని నిరూపించుకోవాలని జగన్ వర్గం ప్రకటించడమూ నిప్పును మరింత రాజేశాయి. కాంగ్రెస్‌లో వరసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఏ క్షణాన ప్రభుత్వానికి ముప్పు వస్తుందో తెలియని పరిస్థితి. బలం తగ్గిపోతుందన్న ఒకే ఒక్క కారణంతో జగన్ వైపు వెళ్తున్న ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోలేక పోతోంది. అదే పీఆర్పీ విలీనమైతే.. 18 మంది సభ్యుల బలం ప్రభుత్వానికి కలిసి వస్తుంది. ఒకరిద్దరూ అటూ ఇటూ అయినా సమస్య లేదు. దీనికితోడు జగన్ వైపు వెళ్లిన ఎమ్మెల్యేలపై నిస్సంకోచంగా సస్పెన్షన్ కొరడా విదిలించవచ్చు. కీలకమైన వారిపై చర్యలు తీసుకుంటే.. మిగిలినవారంతా కాంగ్రెస్ దారిలోకి వచ్చేస్తారన్నది హైకమాండ్ ఆలోచన. కాంగ్రెస్ ఈ పని చేయాలంటే పీఆర్పీ మద్దతు కీలకం. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం కాకపోతే, వారు చివరివరకూ మద్దతిస్తారన్న నమ్మకం ఉండదు. అందుకే.. విలీనం కోసం అంతగా తాపత్రయ పడుతోంది కాంగ్రెస్ పార్టీ.
బలనిరూపణే కాదు.. భవిష్యత్ వ్యూహమూ చిరంజీవిని ఆహ్వానించడంలో కనిపిస్తుంది. వైఎస్ మరణానంతరం రాష్ట్రస్థాయిలో జనాన్ని ఆకర్షించగల నేత కాంగ్రెస్‌లో కరువయ్యారు. ముఖ్యంగా సీమాంధ్రలో పరిస్థితి మరీ దారుణం. జగన్ విజృంభించి భారీగా సభలు నిర్వహిస్తుంటే చూస్తుండిపోవాల్సిన పరిస్థితి. అదే చిరంజీవి కాంగ్రెస్‌లో చేరితే, ప్రజాకర్ష నేత దొరికినట్లే. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి చిరంజీవితో ప్రచారం చేయించుకోవచ్చు. 2014 ఎన్నికల సమయానికి పూర్తిస్థాయిలో సిద్ధం కావచ్చు. జగన్‌ను ఢీకొట్టాలంటే చిరంజీవినే రంగంలోకి దించాలనుకొంటోంది కాంగ్రెస్ పార్టీ. అందుకే, పీఆర్పీ విలీనం కోసం పట్టుబడుతోంది. కొంతకాలంగా మద్దతు ఇస్తూ వస్తున్న చిరంజీవిని పూర్తిగా తమలో కలుపుకొని పోవాలనుకొంటోంది. అందుకే.. పీఆర్పీ విలీన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. చాలాకాలంగా ఈ విషయం నలుగుతూ ఉన్నా.. ఆంటోనీ రాయబారంతో పీఆర్పీలో కదలిక వచ్చింది.
తెలంగాణ ప్రభావం
రాష్ట్ర విభజనపై తాడోపేడో తేల్చుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌ది. జస్టిస్ శ్రీకృష్ట కమిటీ నివేదిక అందడంతో మరోసారి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే.. ఇంతవరకూ జరిగిన సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రెండు రకాల వాదనలను వినిపించాయి. దీనిపై ఇతరపార్టీలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. కేంద్రం, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాల్సిందేనంటూ పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో ఈ సారి జరిగే సమావేశానికి పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. రాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయాన్ని చెప్పే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
ఒకవేళ రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే... తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ఇమేజ్ పెరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మళ్లీ అధికారం దక్కినా ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ, సీమాంధ్రలో మాత్రం వ్యతిరేక ప్రభావం కనిపించవచ్చు. కాంగ్రెస్ ఇమేజ్‌కు డ్యామేజ్ జరిగే అవకాశమూ లేకపోలేదు. దీన్ని జగన్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా సొమ్ము చేసుకునే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడం కోసమే చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఒకవేళ సమైక్యవాదానికే కాంగ్రెస్ మొగ్గు చూపితే, తెలంగాణలో సమస్యలు తప్పవు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలంతా మళ్లీ ఉద్యమంలోకి దిగితే కాంగ్రెస్‌కు కష్టకాలమే. అందుకే, చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానించి పరిస్థితిని చక్కదిద్దవచ్చనుకుంటుంది. కానీ, చిరంజీవికి అంతసీన్ లేదన్న అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలది. పీఆర్పీని విలీనం చేసుకోవడం వల్ల తెలంగాణ వాదానికి వచ్చిన ముప్పేమీ లేదన్నది మరికొంతమంది నేతల వాదన. చిరంజీవిని కేవలం ప్రభుత్వానికి సపోర్ట్‌గా ఉండడం వల్లే ఆహ్వానిస్తున్నారనీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీ చర్యను సమర్థించుకుంటున్నారు.
చిరంజీవి ఆశిస్తున్నదేమిటి?
ఎన్నికలకు ముందు ఎలా ఉన్నా.. ఎన్నికల తర్వాత మాత్రం చిరంజీవికి అసలు వాస్తవం బోధపడింది. ఇమేజ్‌కు ఓట్లు రాలవన్న విషయం అర్థమైపోయింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు వచ్చిన 18 సీట్లను తలచుకొని నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి వచ్చేసింది. పీఆర్పీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలంతా, ఎన్నికల పరాజయం తర్వాత తట్టాబుట్టా సర్దేసుకున్నారు. చాలామంది సొంతపార్టీలకు చెక్కేశారు. రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే ప్రభుత్వం అండ ఉండాల్సిందేనన్న విషయం చిరంజీవికి అర్థమయ్యింది. అందుకే.. అంతవరకూ కాంగ్రెస్ పార్టీని తిట్టినా, చెలిమి చేయాల్సి వచ్చింది.
అసలే అంతంతమాత్రం బలం. పైగా వారిపై కొత్త పార్టీల వల. అందుకే చిరంజీవి తొందరపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే, పీఆర్పీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో అధికారపార్టీ సభ్యులుగా చెలామణీ కావచ్చు. ప్రభుత్వ పథకాలను వీలైనంత ఎక్కువగా తమ ప్రాంతాల్లో అమలు చేసి, ప్రజాసేవకు పాటుపడ్డామన్న పేరు తెచ్చుకోవచ్చు. ఇప్పటికే మంత్రి పదవులూ అందిస్తామన్న హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. వచ్చే ఎన్నికల వరకూ ఆగి, ఒంటరిగా పోటీ చేసినా పీఆర్పీ పూర్తి మెజార్టీతో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు అసాధ్యమే. ఓ రకంగా చిరంజీవి ముఖ్యమంత్రి కావడం.. పీఆర్పీ నేతలు మంత్రులు కావడం ఇప్పట్లో సాధ్యం కాదు. అదే కాంగ్రెస్‌తో జట్టు కడితే.. ఇప్పటికిప్పుడే మంత్రులు కావచ్చు. అందుకే, కాంగ్రెస్‌తో పొత్తుకు పీఆర్పీ ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. నలుగురైదుగురు పీఆర్పీ ఎమ్మెల్యేలు అప్పుడే మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్నారు. అందుకే.. కాంగ్రెస్‌తో చాలాకాలంగా స్నేహం చేస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ వద్దనుకున్నా పీఆర్పీనే వెంటపడుతుందన్న విమర్శలకు తెరదించింది ఆంటోనీ రాయబారం. పీఆర్పీ మితృత్వాన్ని కాంగ్రెస్ కోరుకుంటుందన్న సంకేతాలు జనంలోకి వెళ్లాయి. నైతికంగా ఇది పీఆర్పీకి ఇమేజ్‌ను పెంచే సంఘటన.
కాంగ్రెస్‌లో పీఆర్పీని విలీనం చేసే విషయంలో మాత్రం చిరంజీవి ఆచితూచి వ్యవహరించవచ్చు. ఇప్పటికిప్పుడు విలీనం చేస్తే పదవులకోసమే పాకులాడారన్న అపనింద తనపై పడుతుందేమోనన్న అనుమానం చిరును వెంటాడుతోంది. అందుకే, 2014 వరకూ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి, అప్పటి ఎన్నికల్లో తనను సీఎం క్యాండిడేట్‌గా కాంగ్రెస్ అనౌన్స్ చేస్తే బాగుటుందన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. సోనియాతో జరిగే చర్చల్లో ఈ విషయాన్నే ప్రస్తావించవచ్చు. మరి చిరంజీవి కోరికను కాంగ్రెస్ పార్టీ మన్నిస్తుందా..? పీఆర్పీ ఆశలు ఫలిస్తాయా అన్నది త్వరలోనే తేలిపోవచ్చు.
రెండు పార్టీలకూ అవసరం
ఒకరి అవసరం ఒకరికి ఉండడం వల్లే కాంగ్రెస్- పీఆర్పీ మధ్య సయోధ్య కుదురుతోంది. విలీనమా, మద్దతా అన్నది పక్కన పెడితే.. కలిసికట్టుగా ఉండడం వల్ల రెండు పార్టీల్లోని నేతలకూ భారీగా లబ్ది చేకూరవచ్చు. అదే కాంగ్రెస్, పీఆర్పీలను ఒక్కతాటిపైకి తీసుకువస్తోంది. అయితే.. కాంగ్రెస్, టీడీపీలకు ప్రత్యామ్నయం అవుతానంటూ వచ్చిన చిరంజీవి.. సరైన రాజకీయ వ్యూహాలు లేకపోవడం వల్లే కాంగ్రెస్‌కు చేరువవుతున్నారన్న విమర్శ ఉంది. రాష్ట్రంలో రాజకీయ శక్తిగా ఎదగలేకే.. కాంగ్రెస్ విలీనానికి సిద్ధమవుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే.. పార్టీలను, వ్యక్తులను అవసరానికి వాడుకోవడంలో ఆరితేరిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చిరంజీవిని దువ్వుతోంది. 2014 ఎన్నికల్లో తన అవసరం తీరిపోతే.. చిరంజీవికి చీఫ్ మినిస్టర్ పోస్ట్ కాదు కదా.. చీఫ్ విప్ పదవీ ఇవ్వకపోవచ్చు. మరి ఆ విషయం చిరంజీవికి అర్థమవుతుందా..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
"అయితే.. పార్టీలను, వ్యక్తులను అవసరానికి వాడుకోవడంలో ఆరితేరిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చిరంజీవిని దువ్వుతోంది."
For Congress చిరంజీవి is nothing but a tissue paper. Congress is following the policy of use "it and through it".
How చిరంజీవి can benefit? He may get 10s of 1000s of Crores of Rupees from Congress (more corruption), so he can stash it in Swiss Banks.
In reality he don't need any more money. He has already have enough money to support next 25 generations of his family.
He will learn in a hard way.