31, జనవరి 2011, సోమవారం
మరో విప్లవం రావాల్సిందే!
పాలకుల వంచన తారాస్థాయికి చేరినప్పుడు.. సామాన్యుడి బతుకు దుర్భరమైనప్పుడు.. ప్రజల సొమ్ముతో పాలకులు భోగభాగ్యాలు అనుభవిస్తూ.. జనక్షేమాన్ని విస్మరించినప్పుడు.. విప్లవానికి బీజం పడుతుంది. పాలకులెంతటివారైనా, వారి బలం,బలగం ఎంతున్నా, జనం పిడికిలి ముందు అంతా పటాపంచలైపోతాయి. ఇప్పుడు అరబ్ దేశాల్లో జరుగుతోంది అదే.. ప్రజాగ్రహానికి ప్రభుత్వాలే కూలిపోతున్నాయి. కానీ.. అంతకన్నా ఎక్కువ దోపిడీ జరుగుతున్న మనదేశంలో మాత్రం స్పందన శూన్యం.. అవినీతి,అక్రమాలపై పోరాడడంలో ముందడుగు వేయలేకపోతున్నారు సామాన్యజనం. మరి లోపం ఎక్కడుంది..?
ఓ ఫ్రెంచ్ పోరాటం.. అమెరికా విప్లవం.. ఆ తర్వాత రష్యా రివెల్యూషన్.. వీటన్నింటి సరసన ఇప్పుడు మరో పోరాటాన్ని కూడా చేర్చుకోవాల్సి ఉంటుంది. అదే అరబ్ పోరాటం. అవును... ఓ చిన్న దేశంలో మొదలైన ప్రజాఉద్యమం ఇప్పుడు దేశదేశాలకు పాకుతోంది. అణువణువూ అవినీతితో నిండిపోయిన నేతల అంతు చూసే పోరాటం ఉధృతంగా సాగుతోంది..
జాస్మిన్ రివెల్యూషన్
వేలాది సైన్యం.. భారీగా ఆయుధ బలం.. అయినా... ప్రజల పిడికిలి ముందు సాటిరావని నిరూపించారు టునీషియా ప్రజలు. అధికారం చేతిలో ఉంది కదా అని.. అందర్నీ దోచుకుంటే ఎలాంటి పరిస్థితి వస్తుందో టునీషియా అధ్యక్షుడు అబిడైన్ బెన్ అలీకి బుద్ధి చెప్పారు. దేశం విడిచిపారిపోయేలా చేశారు. అధికారం అండ చూసుకొని టునీషియాను నిరంకుశ పాలనలోకి నెట్టిన చరిత్ర బెన్ అలీది. ప్రజలు ఆకలికేకలతో అలమటిస్తున్నా.. తాను, తన కుటుంబం, తన బంధుమిత్ర సపరివారం మాత్రం విలాసాల్లో మునిగితేలడానికే ప్రధాన్యం ఇచ్చారు. కంపెనీలు, డీలర్‌షిప్పులూ, వ్యాపారాలు అన్నీ ఆయన కుటుంబానివే. 23 ఏళ్లపాటు ఈ నిరంకుశ పాలనను టునీషియా వాసులు భరించారు. కానీ, బెన్ అలీ అక్రమాలు, అవినీతి పెరిగిపోవడంతో తిరుగుబాటు చేశారు. నిరుద్యోగం, అవినీతి, వాక్‌స్వాతంత్ర్యం కోసం నెల రోజుల క్రితం తీవ్రస్థాయిలో పోరాటం మొదలయ్యింది. వీటిని అధికారబలంతో అణిచివేయాలని చూసినా, బెన్ అలీ వల్ల కాలేదు. ప్రజా ఉద్యమం ముందు ప్రభుత్వ బలగం చిన్నబోయింది. ప్రాణాలు పోతున్నా లెక్కచేయక పోరాడుతున్న జనాన్ని చూసి.. టునీషియా అధ్యక్షుడు దేశం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే జాస్మిన్ రివెల్యూషన్‌గా పేరు తెచ్చుకుంది.
ఈజిప్ట్ పోరాటం
టునీషియా ప్రజల విజయం.. ఈజిప్ట్ వాసులకు స్ఫూర్తినిచ్చింది. ఈజిప్ట్ అధ్యక్షుడు అధ్యక్షుడు హోస్నీ ముబారక్ పాలనకు వ్యతిరేకంగా ప్రజాపోరాటం మొదలయ్యింది. మూడు దశాబ్దాలుగా ఈజిప్ట్ ప్రజలను పీడిస్తున్న నిరంకుశ పాలకుడ్ని దేశం నుంచి తరమికొట్టడానికి ప్రతీ ఈజిప్ట్ పౌరుడు ఇప్పుడు కంకణం కట్టుకున్నాడు. ముబారక్ పాలనలో ఈజిప్ట్‌లో అవినీతి, అక్రమాలు పెట్రేగిపోయాయి. ఆయన కుటుంబ సభ్యుల దోపిడీకి అంతేలేకుండా పోయింది. ప్రభుత్వ కాంట్రాక్టులు, సంస్థల్లో వాటాలు అన్నీ వారివే. ప్రజలకు అవసరమైనవేవీ అందుబాటులో ఉండవు. నిరుద్యోగం, దారిద్ర్యం పెరిగిపోతుంటే.. అధ్యక్షుడు కుటుంబ సుఖాలు మాత్రం రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. పైగా, ముబారక్ తర్వాత ఆయన కుమారుడినే అధికారపీఠం కూర్చోబెట్టడానికీ రంగం సిద్ధమయ్యింది. ఇక ఊరుకుంటే లాభం లేదనుకున్న ఈజిప్ట్ వాసులు పోరాటానికి దిగారు. తుటాల వర్షం కురుస్తున్నా.. ముబారక్‌ను గద్దె దించాలన్న కార్యదీక్షతను మాత్రం వదలడం లేదు. జనాగ్రహం చూసి కంగారుపడ్డ ముబారక్.. మిలట్రీని రంగంలోకి దించాడు. అయినా ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. వారికి కావాల్సింది ముబారక్ రాజీనామా. దానికోసం.. ఎంతమంది బలవడానికైనా సిద్ధమేనంటున్నారు. ఇప్పటికే ఒంటరిగా మారిన ముబారక్, సైన్యం కూడా జనంవైపు మొగ్గు చూపితే.. పారిపోవడమే మార్గం.
మరోవైపు యెమెన్‌లోనూ... సిరియాలోనూ విప్లవాలు మొదలయ్యాయి. అక్కడా అవినీతి, నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం సాగుతోంది. అక్కడా ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. అదే జరిగితే అవినీతి రహిత పాలన కోసం సాగిన అరబ్ వాసుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. మరెన్నో దేశాల్లో ప్రజలకు మార్గదర్శకం అవుతుంది.
అరబ్ దేశాల్లో విప్లవాల సంగతిని పక్కన పెడదాం.. మన దేశం గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ అని మనం ఘనంగా చెప్పుకోవడమే తప్ప ఆచరణలో నిజంగా కనిపిస్తోందా? మనం అభివృద్ధి దిశలో సాగుతున్నామా... లేక అవినీతి కూపంలో కూరుకుపోతున్నామా..? స్వచ్ఛమైన పాలన ప్రజలకు అందుతోందా..?
మనదేశం.. అతిగొప్ప ప్రజాస్వామ్యాల్లో ఒకటని చిన్నప్పటినుంచి చదువుకుంటూనే ఉన్నాం. ప్రపంచానికే ఆదర్శదేశమంటూ ఎలుగెత్తి చాటుకుంటాం. కానీ, వాస్తవంలో జరుగుతున్నదేమిటి? మన దేశ చరిత్ర పుటలను వెనక్కి తిప్పుతుంటే.. ఘన విజయాలు.. అభివృద్ధి సూచికలు కనిపిస్తాయనుకుంటే పొరపాటే. అడుగడుగునా అవినీతి మరకలు వెక్కిరిస్తుంటాయి. అవినీతి, అక్రమాలకు ఏ ప్రభుత్వమూ అతీతం కాదు. పాలకులు ఎవరైనా, యధేచ్చగా దోపిడీ సాగిపోతూనే ఉంది. దేశ ప్రతిష్టనే పణంగా పెట్టి దోచుకుంటున్న నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకు ఉదాహరణ ఇటీవలే వెలుగులోకి వచ్చిన 2జీ స్పెక్ట్రమ్ స్కామ్. తమకు కావల్సిన వారికి టెలికాం లెసెన్సులు కట్టబెట్టడానికి మంత్రులు ఎంతగా దిగజారుతారో నిరూపించిన ఉదంతమది. భారత ప్రభుత్వ ఖజానాలో చేరి, అభివృద్ధి కార్యక్రమాల రూపంలో ప్రజలకు ఉపయోగపడాల్సిన లక్షా 72వేల కోట్ల రూపాయలకు గండి పడిందంటే.. ప్రజాసేవపైన మన నేతలకున్న చిత్తశుద్ధేమిటో అర్థమైపోతుంది. ఈ వ్యవహారంలో చూస్తూ ఉండిపోయినవారంతా, పరోక్షంగా ఈ స్కామ్‌కు సాయం చేసినట్లే. అది ప్రధాని కావచ్చు.. లేదంటే మరో మంత్రి కావచ్చు..
దేశప్రతిష్టను ఇనుమడింపజేసేలా నిర్వహించాల్సిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో జరిగిన అక్రమాలు, నేతల అవినీతి జోరుకు పరాకాష్ట. ప్రతీ పనిలోనూ కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూ దేశానికే మచ్చతేవడానికి వెనుకాడని వాళ్లు మన నేతలు కావడం నిజంగా సిగ్గు చేటే. ఇక ప్రభుత్వంలో పనులు కావాలనుకున్నవారు నిసిగ్గుగా కొంతమంది బ్రోకర్లతో కలిసి లాబీయింగ్ చేస్తారు. తమ పనులు చేయించుకుంటారు.
2జి స్పెక్ట్రమ్, కామన్‌వెల్త్ గేమ్స్ మాత్రమే కాదు.. మరెన్నో స్కాంలు.. మరెన్నో అక్రమాలు. ప్రతీ అభివృద్ధి కార్యక్రమంలోనూ ఎంతోకొంత కమీషన్ నేతల జేబుల్లోకి వెళ్లాల్సిందే. లేదంటే పనులు కావు. నిధులు విడుదల కావు. ఎన్నికల్లో పోటీ చేసి అధికారం దక్కించుకున్నవారు మాత్రమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగుల అక్రమార్జనా తక్కువేమీ కాదు. ఏ ఆఫీసుకైనా వెళ్లండి.. ఉద్యోగ నిర్వహణలో భాగంగా చేసిన పనికీ ప్రత్యేక చెల్లింపులు చేసుకోవాలి. లేకపోతే, సవాలక్ష రూల్స్ వారికి గుర్తొస్తాయి. సింపుల్‌గా పనికావాలంటే అధికారుల చేతులను కరెన్సీ నోట్లతో తడపాలి. మన రాష్ట్రంలోనే కాదు.. దేశంలోని ఏ ప్రభుత్వ కార్యాలయమూ అవినీతిరహితం అని చెప్పుకోలేం. ఏసీబీ దాడులు జరుగుతున్నా, నిత్యం ఏదో ఓ అధికారి పట్టుబడుతున్నా లంచగొండులకు మాత్రం భయమనేదే లేదు. ఎందుకంటే, వాటినుంచి తప్పించుకోవడానికి అవసరమైన మార్గాలూ మన దగ్గర అందుబాటులో ఉండడమే..
చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులూ అక్రమార్జనకు పాల్పడతారు. చివరకు మన న్యాయవ్యవస్థలోనూ లంచావతారాలున్నాయంటూ కొంతమంది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలే చెప్పడం మన వ్యవస్థలోని లోపాలకు నిదర్శనం. చెప్పాలంటే.. ప్రతీ చోటా.. ప్రతీ మనిషీ.. దోపిడీకి గురవుతున్నాడు. మరి, దీనిపై మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదా..? దశాబ్దాలుగా ఈ పరిస్థితి మారకపోతున్నా.. మనం భరిస్తూనే ఉండాలా..? ఈ సహనం ఇంకెన్నాళ్లు...?
మరో విప్లవం తప్పదా?
లంచగొండులు.. అవినీతి పరులు.. అక్రమార్కులు... పైనుంచి కిందదాకా ఉన్నది వారే. ప్రతీ పనిలోనూ అడ్డుతగులుతోంది వారే. అందుకే, స్వాతంత్ర్యం వచ్చి ఐదు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ మన పరిస్థితి దయనీయంగానే ఉంది. మన దేశంలో ఉన్న వనరులు. .మేథాసంపద, అవకాశాలు, ఏ రకంగా చూసుకున్నా.. అభివృద్ధి చెందిన దేశాలకన్నా ఎంతో ముందుండాలి. కానీ, ఇప్పటికీ ఎదుగుతున్న దేశంగానే కొనసాగుతున్నాం. దీనికి కారకులెవరు..? అవినీతి నేతలు కాదా..? లంచాలను మరిగిన అధికారులు కారా..?
దేశంలో పెద్ద పెద్ద స్కాంలు జరుగుతున్నా, ప్రజాధనం అక్రమార్కుల పాలవుతున్నా, జనానికి చేరాల్సిన డబ్బు నల్లధనంగా మారుతున్నా.. మనలో చలనం రావడం లేదు. పేపర్లలో, టీవీల్లో చూసి కాసేపు మాట్లాడి ఆ తర్వాత మర్చిపోతున్నాం. ఎవడో లంచం తీసుకుంటే మనకెందుకులే అనుకునేస్థాయికి చేరుకున్నాం. కానీ, ఆ అవినీతి ప్రభావం మన జీవితాలనే దెబ్బతీస్తుందన్న విషయాన్ని మాత్రం మర్చిపోతున్నాం. అంతెందుకు, పెట్రోలు ధరలు పెరిగితే కాసేపు బాధపడుతున్నాం.. కానీ, దానివల్ల మన జీవితం మారుతున్నా, ధరలను తట్టుకోలేకపోయినా మన ప్రొటెస్ట్‌ను మాత్రం చూపించలేకపోతున్నాం. అంటే.. మనలో పోరాడేశక్తిగానీ, ఓపిక గానీ లేవన్నమాట. చేవచచ్చిపోయినవాళ్లమన్నమాట. అక్రమార్కుల దోపిడీని అడ్డుకోలేని సర్కార్.. దొంగపన్నుల రూపంలో జనాన్ని పీల్చిపిప్పిచేస్తున్నా.. దాన్ని భరిస్తున్నామే తప్ప, మా వల్ల కాదంటూ తిరగబడలేకపోతున్నాం.
కూరగాయల ధరలు పెరుగుతున్నాయని.. .నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని .. పెట్రోల్ ధరలు పెరిగాయని ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నాయే తప్ప.. చిత్థశుధ్దితో పోరాడడం లేదు. జనం కూడా ఇలాంటి వాటిపై పెద్దగా స్పందించడం లేదు. ధరలు పెరిగితే కాసేపు ప్రభుత్వాన్ని తిట్టుకోవడం మళ్లీ, రోజూవారి వ్యవహారాల్లో మునిగిపోవడం. పెరిగిన ధరలను తట్టుకోవడానికి ఎలా సంపాదించాలా అనే ఆలోచిస్తున్నారే తప్ప.. ఈ ధరలు నిజంగానే పెరగాల్సిన అవసరం ఉందా? అన్నది మాత్రం ఆలోచించడం లేదు. దొడ్డిదారిన ప్రభుత్వం మన జేబులు కొల్లగొడుతున్నా, మనలో స్పందన ఉండడం లేదు.
అధికారంలోకి వచ్చిన పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో మాయమాటలు చెప్పి గెలిచినవారు.. ఒక్కహామీని కూడా నెరవేర్చరు. పైగా, ఇప్పుడున్న ప్రజాప్రతినిధుల్లో ఎక్కువమంది తమ సొంత వ్యవహారాలు చక్కబెట్టుకునేవారే తప్ప, జనానికి మేలు చేసేవారే లేరు. కానీ మళ్లీ ఎన్నికలొస్తాయి... నిసిగ్గుగా ఆనేతలంతా జనంలోకి వస్తారు.. జనం కూడా వారికి జేజేలు కొడతారు. మళ్లీ గెలిపిస్తారు. అవినీతికి అండగా నిలుస్తారు. ఇక్కడ తప్పు ప్రజలదే. ఒక్కసారి అవినీతికి పాల్పడ్డవాడికి బుద్ధి చెబితే మరొకడు ఆ పనిని చేయడు. జనం సమస్యను పట్టించుకోని వాడికి తరిమికొడితే.. మరొకడు సొంతపనులకు ప్రాధాన్యం ఇవ్వడు.
కానీ, అలా చేయగలిగేది ఎవరు? అందుకు ముందడుగు వేసేది ఎవరు? రాజకీయ నేతల అక్రమాలను.. అధికారుల అక్రమార్జనకు అడ్డుపడేది ఎప్పుడు..? ఈ దేశం బాగుపడేది ఇంకెప్పుడు? అందుకే.. మరో పోరాటం రావాలి. అవినీతిని అంతం చేసే విప్లవం మొదలుకావాలి.
యువతరం కదలాలి
దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య అవినీతి. ఈ విషయాన్ని దేశంలో ఎవరిని అడిగినా చెబుతారు. కానీ, దాన్ని అంతమొందించడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారు..? అవినీతికి అడ్డుకట్ట వేస్తామంటూ కేంద్రప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతూనే ఉంది తప్ప సీరియస్‌గా తీసుకున్నదే లేదు. ఒకవేళ తీసుకొని ఉంటే.. ఇప్పుడు 2g స్పెక్ట్రం స్కాం జరిగేదే కాదు.. కామన్‌వెల్త్ గేమ్స్‌లో అక్రమాలకు అవకాశమే ఉండేది కాదు. అక్రమాలకు పాల్పడే ప్రతీ ఒక్కరినీ తీవ్రంగా శిక్షించడానికి ఉద్దేశించిన లోక్‌పాల్ బిల్లుకు మోక్షం కలిగితేనే ఇది సాధ్యమవుతుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే, ఏడాదిన్నరలోనే విచారణ అంతా పూర్తై అక్రమార్కులకు శిక్ష పడుతుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. ముందుగా నష్టం కలిగేది రాజకీయనేతలకే. అందుకే, ప్రభుత్వం ఈ బిల్లును పాస్ చేయడం లేదు.ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తప్ప ఇది సాధ్యం కాదంటున్నారు ఉద్యమకారులు. అవినీతి నుంచి దేశాన్ని రక్షించడం కోసం ఇప్పటికే ఉద్యమం మొదలయ్యింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, గాంధేయవాదులు అవినీతిపై పోరాటం సాగిస్తున్నారు. కానీ, వీరి డిమాండ్లకు ప్రభుత్వం దిగివస్తుందన్న నమ్మకం లేదు. దేశవ్యాప్త ఉద్యమం మొదలైతే తప్ప సర్కార్‌లో చలనం రాదు.
అవినీతిపై యువతరమూ సమరశంఖారావాన్ని పూరించింది. యూత్ ఫర్ ఇండియా పేరుతో యువకులు కలిసికట్టుగా పోరాటం మొదలుపెడుతున్నారు. ఈ ఉద్యమానికి స్పందన బాగానే ఉన్నా... పూర్తిస్థాయిలో మాత్రం లేదనే చెప్పాలి. ఇప్పటికీ చాలామంది టీనేజర్స్.. అవినీతిపై పోరాటం అంటేనే ఆమడదూరం పరిగెత్తుకుపోతున్నారు. వారికెంతసేపూ ఈ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. దేశం ఎటుపోయినా వారికి అవసరం లేదు. ఈ పరిస్థితులోనే ఇప్పుడు మార్పు రావాలి. ప్రభుత్వాలు కూడా ఉద్యమాలకు సిద్ధమైన విద్యార్థులను నీరుగార్చడానికే చూస్తాయి. చదువు ముఖ్యం, ఉద్యోగం ముఖ్యం అంటూ ప్రలోభపెడుతుంటాయి. యువత తిరుగుబాటు చేస్తే.. ఏమవుతుందో తెలుసుకాబట్టే వాటిని అణిచివేయడానికి ఏమైనా చేస్తాయి.
మన రాజకీయాలు కూడా మారాల్సిన అవసరం ఉంది. రౌడీయిజం, గుండాయిజం చేసేవారికీ, జులాయిగా తిరుగుతూ జనాన్ని బెదిరించేవారికే పార్టీలు పెద్ద పీట వేస్తున్నాయి తప్ప.. దేశాన్ని బాగు చేయాలని, జనానికి సేవ చేయాలన్న ఆలోచన ఉన్నవారికి ప్రోత్సాహం ఇవ్వడం లేదు. ఎలక్షన్లలో నోట్లు వెదజల్లి ఓట్లు కొనుక్కొని అక్రమార్కులే ఎన్నికవుతున్నారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చుకు వేయిరెట్లను ఒక్క టర్మ్‌లోనే సంపాదించుకుంటున్నారు. అందుకు వారు వెళుతోంది అవినీతి మార్గంలోనే. ఇది మన చేతులతో మనం కొనితెచ్చుకున్నదే. ఎన్నికల తీరు.. ఎన్నికయ్యే వారు మారితే గానీ దీనికి అడ్డు పడదు.
బహుశా ఈ మార్పు రావాలంటే.. మన దగ్గరా ఓ విప్లవం రావాలి. అవినీతిపరులు, అక్రమార్కుల ఆట కట్టించే ఉద్యమం రావాలి. అయితే ఇది రాజకీయపార్టీలో, రాజకీయ నాయకులో తెచ్చే అవకాశం ఎంతమాత్రమూ లేదు. ఒకవేళ రాజకీయనేతలు ఇందులో భాగస్వాములవుతున్నామని ప్రకటించినా దాన్ని నమ్మడానికి లేదు. ఈ పోరాటం చేయాల్సిన యువతరమే. ఆ ఉద్యమం దెబ్బకు అవినీతి సామ్రాజ్యాలు పునాదులతో సహా కూలిపోవాలి. ఇందుకు... అరబ్ దేశాల్లో పోరాటాన్ని స్పూర్తిగా తీసుకున్నా తప్పులేదు. మనకు కావాల్సింది.. మనం సాధించాల్సింది అవినీతిరహిత భారతదేశాన్ని.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Wow!. Well said.
Corrupt Dynastic rule (rumoured, a foreign spy) must go away. Hope Indians are watching the world events unfolding else where.
బాగా చెప్పారు. నెనర్లు!
tunisia struggle and Egypt struggle ని చూపించి భారతదేశం లో విప్లవం రావాలి అనుకోడం అంత కరెక్ట్ కాదని నా వుద్దేశ్యం...అక్కడ విప్లవం మొదలయింది నియంతృత్వం మీద..అంటే ఎవరో అన్యాయాలు సాగించారు...కాని ఇక్కడ అలా కాదు "ఆ ఎవరో " మనం ఎన్నుకున్న వాళ్ళే ...డబ్బులు తీసుకుని వోట్లు మనం వోట్లు వేసిన వాళ్ళే (money for vote అనేది పేదవారు చేస్తారు , చదువురాని వారి చేస్తారు అని ఒక నమ్మకం ...అది నిజం కాదు…మా ఇంటిదగ్గర ఉన్న టీచర్స్ కాలనీ లో 2009 elections కి డబ్బులు పంచడం కుదరడం లేదని కాంగ్రెస్సు వాళ్ళు cheques పంచి పట్టారు ) …ఇక మీరు ముందు రమ్మన్న యువతరం …full tank petrol , cricket kit తీసుకుని వోటెయ్యడానికి ముందు వస్తారు ….
అలా అని నేను నిరాశావాదిని కాదు…నియంతుత్రవం లో ప్రభుత్వం మారాలి అంటే… రక్తపాత విప్లవం జరగాలి, ప్రజాస్వామ్యం లో ఎన్నికలు జరిగితే చాలు…