15, జూన్ 2010, మంగళవారం
బెజవాడ బూచోళ్లు..
బూచాడంటే చిన్నపిల్లలకు భయం. మారాం చేసినా.. అన్నం తినకపోయినా బూచాడొస్తాడంటూ.. పిల్లలను భయపెట్టడం సహజం. కానీ బెజవాడ బూచాళ్లంటే మాత్రం.. పిల్లలకే కాదు పెద్దలకూ భయమే. వారు దౌర్జన్యం చేసినా.. కబ్జా చేసినా.. చివరకు మర్డర్లు చేసినా.. జనం నోరు మూసుకునే ఉంటారు తప్ప.. ఎదురించరు. కొన్నాళ్లుగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న బెజవాడ పెద్ద బూచి దేవినేని నెహ్రూకు.. ఇప్పుడు మరో బూచి ఎదురొచ్చి నిలిచింది. అదే.. వల్లభనేని వంశీ. ఈ ఇద్దరు బూచాళ్లతో.. బెజవాడ బితుకుబితుకమంటోంది..
విజయవాడ వెనక్కి పోతోందా?
రౌడీ రాజకీయాలకు వేదికవుతోందా?
దాడులు ప్రతిదాడులు జరగబోతున్నాయా..?
మళ్లీ నెత్తుటేర్లు పారనున్నాయా?
బెజవాడ భయపడుతోంది. ఇద్దరి మధ్య జరుగుతున్న పోరాటాన్ని చూస్తూ.. వణుకుతోంది. ఎవరిపై ఎవరు దాడులు చేస్తారో అని కలవరపడుతోంది. ప్రశాంతంగా ఉన్న విజయవాడలో చాపకింద నీరులా విస్తరించిన పగలు..ప్రతీకారాలు.. ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. మూడు దశాబ్దాల క్రితం నాటి ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ గుర్తుకుతెస్తున్నాయి..
ఇంత అలజడికి కారణం కేవలం ఇద్దరు వ్యక్తులు. ఒకరు.. కంకిపాడు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, మరొకరు విజయవాడ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలైన వల్లభనేని వంశీ మోహన్. ఒకరిది కాంగ్రెస్ పార్టీ అయితే.. మరొకరిది తెలుగుదేశం పార్టీ. వీర్దదరి మధ్యా సాగుతున్న పోటీ.. ఇప్పుడు బెజవాడ పాలిట శాపంగా మారింది. వర్గాల పేరుతో కుమ్ములాటకు బీజం వేసింది.
ఇటు నెహ్రూ.. అటు వంశీ విజయవాడపై ఆధిపత్యం కోసం పావులు కదుపుతుండడం సమస్యలు సృష్టిస్తోంది. సామాన్యుడికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఎంతోకాలంగా కొనసాగుతున్న నెహ్రూ హవాకు.. చెక్ చెప్పడానికి వంశీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సహజంగానే ఇది దేవినేని వర్గాన్ని ఇది రెచ్చగొడుతోంది. ఈ ఇద్దరి ఆధిపత్య పోరు ఇప్పుడు శృతిమించింది. ఒకరిపై మరొకరు నేరుగా మాటలయుద్ధం చేసుకునే దాకా వచ్చింది.
పోటాపోటీ
తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని కొట్టాడని ఆరోపిస్తూ.. దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్‌పై వల్లభనేని వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడి నుంచి అసలైన బెజవాడ రౌడీరాజకీయం తెరపైకి వచ్చింది. వంశీ, నెహ్రూలు ఒకరిపై ఒకరు నేరుగా విమర్శలు చేసుకుని వాతావరణాన్నిమరింత వేడెక్కించారు. వీరిద్దరి మాటలతోనే వివాదం సద్దుమణుగలేదు సరికదా.. రోజురోజుకూ పెరిగిపెద్దదవుతోంది. ఇప్పుడు రెండోస్థాయి నేతలు పోట్లాడుకునే పరిస్థితి వచ్చింది. రెండువర్గాల నేతలూ ఎదురూ బొదురూ పడితే కొట్టుకునే పరిస్థితి నెలకొంది. ఒకవర్గంపై మరో వర్గం విమర్శల విల్లు ఎక్కుపెట్టింది.
నెహ్రూ, వంశీల మధ్య వ్యక్తిగతంగానే వివాదం మొదలైనా.. క్రమంగా పార్టీల మధ్య పోరుగా మారిపోతోంది. టీడీపీ కార్పొరేటర్లు.. కాంగ్రెస్ కార్పొరేటర్లు.. ఎవరికి వారే పోటాపోటీగా ప్రెస్మీట్లు పెడుతున్నారు. ఎదుటి వర్గంపై విరుచుకుపడుతున్నారు. టీడీపీ కార్పొరేటర్లకు నెహ్రూ టార్గెట్ అయితే.. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు వంశీ టార్గెట్.
ఇక కార్పొరేటర్లు భాష విషయంలోనూ తమ నేతలనే ఫాలో అవుతున్నారు. ఎంత ఘాటుగా మాట్లాడితే అంత గొప్పవాళ్లమని ఫీలవుతున్న పొలిటికల్ లీడర్లు.... ప్రజలకు నేతలమన్న విషయాన్ని మరిచిపోతున్నారు. పక్కా రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. జనాన్ని బెదరగొడుతున్నారు.వంశీ, నెహ్రూల మధ్య గొడవగానే చాలామంది దీన్ని భావిస్తున్నప్పటికీ.. ఇది బెజవాడ మొత్తానికి పాకిపోయేలా ఉంది. మళ్లీ వర్గపోరు మొదలవుతుందేమోనన్న అనుమానాలనూ కలిగిస్తోంది.
గొడవెందుకు?
వంశీకి.. నెహ్రూకు మధ్య వివాదం రావడానికి అసలు కారణం ఏమిటి? దీనికి గతంలో జరిగిన సంఘటలనూ.. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలూ రెండూ కారణమే. విజయవాడలో తమ ప్రాబల్యం పెంచుకోవడానికి పావులు కదుపుతుండడంతోనే.. అసలు సమస్య మొదలయ్యింది.
వర్గపోరుకు శాశ్వత చిరునామా విజయవాడ. దశాబ్దాల తరబడి ఏదో రకంగా వర్గాల మధ్య పోరాటం సాగుతూనే ఉంది. అది రాజకీయాలకూ విస్తరించి.. రౌడీరాజకీయాన్ని సృష్టించింది. ఆ రౌడీరాజకీయానికి ఎవరు లీడర్ కావాలన్నదే తాజా గొడవకు అసలు కారణం.
బెజవాడ రాజకీయాల్లో ఎప్పటినుంచో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు దేవినేని నెహ్రూ. ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా.. బెజవాడలో తన పట్టు తప్పకుండా చూసుకుంటున్నారు. తన ఇలాకాలో తాను చెప్పిందే వేదం అన్నట్లుగా నడిపించారు. వంగవీటి రంగా మరణం తర్వాత.. నెహ్రూకు అడ్డులేకుండా పోయింది. రాజకీయంగా ఢీ అంటే ఢీ అన్నా.. వ్యక్తిగతంగా నెహ్రూతో పూర్తిస్థాయిలో తలపడ్డ నేతలూ ఈ మధ్య కాలంలో ఎవరూ లేరు. రంగా తనయుడు రాధాకృష్ణ కొంతకాలం హడావిడి చేసినా.. ఆయనకూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ.. వల్లభనేని వంశీ ప్రవేశంతో పరిస్థితి మారింది. గన్నవరం నుంచి టీడీపీ రాజకీయాల్లోకి వచ్చిన వల్లభనేని వంశీ విజయవాడ అర్భన్ అధ్యక్ష పదవిని అందుకునే దాకా ఎదిగారు. పార్టీపై పట్టుకోసం ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న వంశీ... అందుకు నెహ్రూను ఢీకొట్టడమే మార్గం అనుకున్నారు. వీరిద్దరిమధ్యా ఎన్నికల సమయంలోనే కోల్డ్‌వార్ మొదలైనప్పటికీ.. ప్రత్యక్షంగా నెహ్రూను దెబ్బకొట్టే అవకాశం ఇటీవలే వచ్చింది. ఓ దాడి కేసులో నెహ్రూ కొడుకుపైనే కేసు పెట్టించి.. టీడీపీ వర్గాల్లో తన ప్రతిష్టను పెంచుకున్నారు వల్లభనేని వంశీ.
నెహ్రూను ఢీ కొంటే వంశీకి వచ్చేదేమిటి? వాస్తవానికి నెహ్రూ, వంశీ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. విజయవాడలోని అదే సామాజిక వర్గంపై నెహ్రూకు మంచి పట్టుంది. అదే సమయంలో నెహ్రూ అంటే చాలామందికి భయమూ ఉంది. నెహ్రూ ఎదిరించి బతకడం కష్టమన్న అభిప్రాయమూ జనంలో ఉంది. అందుకే టీడీపీకి మద్దతిచ్చేవారు కూడా.. నెహ్రూకు వ్యతిరేకంగా పనిచేయడానికి పెద్దగా సిద్ధపడరు. ఇటీవల ఎన్నికలతోనే విజయవాడలోకి ఎంటరైన వంశీకి.. ఈ వర్గంపై పట్టుసాధించడం అత్యవసరం. భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలంటే నెహ్రూ ఆధిపత్యాన్ని తగ్గించి.. తన పట్టు పెంచుకోవాల్సి ఉంటుంది. అందుకే.. ప్రతీ విషయంలోనూ నెహ్రూను వీలైనంతగా ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. మద్యం టెండర్ల విషయంలోనూ నెహ్రూ వర్గాన్ని వంశీ వర్గం ఢీకొంది. నెహ్రూ సోదరుడు నిర్వహించే బార్లు, మద్యం షాపులకు ఇంతవరకూ ఎవరూ పోటీగా టెండర్లు వేసేవారు కాదు. కానీ.. ఈ సారిమాత్రం వంశీ వర్గం వాటిపై కన్నేసింది. దీంతో.. ఎక్కువమొత్తం చెల్లించి వాటిని నెహ్రూ సోదరుడు బాజీప్రసాద్ దక్కించుకోవాల్సి వచ్చింది. టెండర్ల తెరిచే సమయంలోనూ ఇరువర్గాల మధ్య స్వల్పంగా ఘర్షణ జరిగింది. అప్పటి నుంచీ రెండు వర్గాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఇక నేరుగా తన కొడుకుపైనే కేసు పెట్టడంతో వంశీని టార్గెట్ చేసుకోక తప్పదని గ్రహించారు నెహ్రూ. ఎన్నికల తర్వాత.. టీడీపీ కార్యకర్తలపై తరచుగా నెహ్రూ అనుచరులు దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే నెహ్రూకు భయపడి ఎవరూ పెద్దగా ఫిర్యాదు చేయడం లేదు. సరిగ్గా ఇలాంటి వారినే తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు వంశీ.
రాజకీయాల్లో బలం ఉన్నవాడిదే రాజ్యం. నెహ్రూకు అర్థబలం.. అంగబలం రెండూ ఉన్నాయి. వంశీకి అర్థం బలం ఉంది.. ఇప్పుడు పెంచుకోవాల్సింది అంగబలమే. అందుకే.. నెహ్రూను ఢీకొట్టడం ద్వారా... ఆయనకు ప్రత్యామ్నయంగా ఎదగాలనుకొంటున్నారు. కృష్ణాజిల్లాలో టీడీపీ బలంగానే ఉన్నప్పటికీ విజయవాడలో మాత్రం కాస్త బలహీనంగా ఉంది. దానికి కారణం రౌడీ రాజకీయమే. నెహ్రూ నియోజకవర్గంలో టీడీపీ తరపున కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది. త్వరలోనే వస్తున్న కార్పొరేషన్ ఎన్నికలు.. వంశీ ప్రతిష్టకు సవాల్‌గా మారాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఎక్కువ సీట్లను గెలుచుకోవాలంటే.. ఇప్పటి నుంచే నెహ్రూను ఎదుర్కోక తప్పదు. అదే.. వీరిద్దరి మధ్యా గొడవకు అసలు కారణం.
దశాబ్దాల పోరు
విజయవాడ వర్గపోరు ఈనాటిది కాదు.. నలభై ఏళ్ల క్రితం మొదలైన ఆధిపత్య పోరు.. తరాలు మారుతున్నా.. మనుషులు మారుతున్నా కొనసాగుతూనే ఉంది. ఒకరినుంచి మరొకరు స్పూర్తి పొందుతూ.. రౌడీరాజకీయాలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. రౌడీయిజం అంటే బెజవాడే అన్నంతగా పేరుపడిపోయిందంటే.. ఏ స్థాయిలో ఇక్కడ రౌడీలు హవా చెలాయించారో అర్థం చేసుకోవచ్చు..
రౌడీగా ముద్ర వేయించుకుంటే రాజకీయాల్లో హవా చెలాయించవచ్చన్నది ఎక్కువమంది నమ్మకం. దానికి తగ్గట్లుగానే.. బెజవాడ నేతల కార్యకలాపాలు సాగుతుంటాయి. 1970 నాటి నుంచీ ఇక్కడ ముఠా తగాదాలు మొదలయ్యాయి. అవేక్రమంగా రౌడీయిజానికి దారి తీశాయి. 1973లో కృష్ణలంక చెందిన చలసాని వెంకటరత్నం హత్య తర్వాత ఇవి మరింత పెరిగాయి. ఈ హత్య కేసులో వంగవీటి రాధాపై ఆరోపణలు వచ్చాయి. 1974 నవంబర్ 19న మ్యూజియం రోడ్డులో ఓ షాపు ఓపెనింగ్‌కు పిలిచి.. వంగవీటి రాధాను అత్యంత దారుణంగా ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ హత్య జరిగేనాటికి వంగవీటి రాధా, దేవినేని గాంధీ, నెహ్రూలు మిత్రులు. ఆ తర్వాత.. వీరిమధ్య విభేదాలు పెరిగాయి. రెండు వర్గాలు రాజకీయంగా ఎదగడానికి విద్యార్థులనే లక్ష్యంగా చేసుకున్నాయి. యునైటెడ్ ఇండిపెండెంట్స్ అనే విద్యార్థి సంఘాన్ని వంగవీటి రంగా స్థాపిస్తే... యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్‌ను దేవినేని నెహ్రూ ప్రారంభించారు. ఈ రెండు ఆర్గనైజేన్స్ మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేవారు. ఇరు వర్గాల మధ్య ఆధిపత్యపోరుకు నిదర్శనంగా.. 1976లో SRR కాలేజ్ సమీపంలో దేవినేని గాంధీ హత్య జరిగింది. ఈ హత్య తర్వాత.. విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేది. ఆ తర్వాత రంగా.. నెహ్రూలు రాజకీయాల్లోకి ప్రవేశించారు. రంగా కాంగ్రెస్‌లో చేరితే.. నెహ్రూ టీడీపీలో చేరారు. ఇదే సమయంలో నెహ్రూ సోదరుడు దేవినేని మురళి బెజవాడలో తన పట్టుపెంచుకున్నారు. ఏలూరు రోడ్డు దందాలు నిర్వహిస్తూ క్రమంగా ఎదిగారు. దీనిపై కలత చెందిన రంగా వర్గం.. మురళి హత్యకు ప్రణాళిక వేసింది. 1987లో లా పరీక్షలు రాసి కారులో విజయవాడకు వస్తున్న మురళిని ప్రకాశం జిల్లా ఎడ్లపాడు వద్ద లారీతో ఢీకొట్టి.. ఆపై వెంటాడి చంపారు.
మురళి హత్య తర్వాత పగప్రతీకారాలతో నిండిపోయిన నెహ్రూ వర్గం.. రంగాను టార్గెట్ చేసుకుంది. ప్రాణాలకు ముప్పుందని భావించిన రంగా.. రక్షణ కల్పించాలని కోరుతూ తన ఇంటి సమీపంలోనే నిరాహారదీక్ష చేపట్టాడు. 1988 డిసెంబర్ 25 రాత్రి.. అయ్యప్ప భక్తుల రూపంలో ఓ బస్సులో వచ్చిన దుండగులు ఒక్కసారిగా రంగా నిరాహారదీక్ష శిబిరంపై దాడి చేశారు. రంగాను హత్య చేశారు. ఆ తర్వాత రోజు.. బెజవాడ అగ్నిగుండంగా మారిపోయింది. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులపై రంగా వర్గీయులు దాడులు చేసి నాశనం చేశారు. చాలావాటిని కాల్చిబూడిద చేశారు. రంగా తర్వాత.. అతని భార్య రత్నకుమారి రాజకీయప్రవేశం చేసినప్పటికీ క్రమంగా వర్గపోరు తగ్గింది. అయితే.. వంగవీటి రాధా తనయుడు శంతన్ ప్రవేశం, అతనిపై హత్యాయత్నం, ఇలాంటి సంఘటనలతో అప్పుడప్పుడూ బెజవాడ రాజకీయాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. వంగవీటి రంగాకు, దేవినేని నెహ్రూకు ఒకప్పుడు జరిగింది సామాజిక వర్గపోరనే చెప్పాలి. కులాలుగా విడిపోయిన జనం.. అప్పట్లో కత్తులు దూసుకున్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం ఒకే సామాజిక వర్గంలో రగడ మొదలయ్యింది. నెహ్రూ ఆధిపత్యానికి చెక్ చెప్పడానికి వంశీ బరిలోకి దిగారు. మరి వీరిద్దరి మధ్య పోరు ఎటు దారితీస్తుందన్నదే అందరినీ కలవరపెడుతోంది. ప్రచ్చన్నంగా సాగుతున్న ఈ యుద్ధం ప్రత్యక్షపోరుకు దారితీస్తే ఎదురయ్యే నష్టం ఊహించలేనిదే. మళ్లీ మూడు దశాబ్దాల కాలం నాటి పరిస్థితి వస్తుందేమోనన్న ఆందోళన జనాన్ని భయపెడుతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Devineni Murali was killed near Chikaluripet in March, 1988 and not in 1987.
Another correction on "వంగవీటి రాధా తనయుడు శంతన్ ప్రవేశం" Santan is son of vangaveeti chalapatirao, not vangaveeti radha.