8, ఫిబ్రవరి 2010, సోమవారం
వంగకు బెంగ...
Categories :
దేశంలో ఎన్నో సమస్యలున్నాయి.. ఓ వైపు ద్రవ్యోల్బణం.. ఆకాశాన్నంటిన రేట్లు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. మరోవైపు టెర్రరిజం కేంద్ర ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వడం లేదు. ఇలాంటి సమస్యలన్నింటినీ పక్కన పెట్టి నెలరోజులకుపైగా.. ఓ అంశం దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. అదే బీటీ వంకాయ. రెండో రోజుల్లో ప్రభుత్వం.. ఈ బీటీ వంకాయకు అనుమతిచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది.
దేశంలో బీటీ బాంబులు పేలుతున్నాయి. ఎక్కడికక్కడ వ్యతిరేక నిరసనలు.. అనుకూల ప్రదర్శనలు. బీటీ వంకాయకు అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిన గడువు దగ్గర పడుతున్న కొద్దీ.. ఇవి మరింత తీవ్రమవుతున్నాయి. బీటీ వంకాయతో దిగుబడులను భారీగా పెంచుకోవచ్చని ఓ వర్గం భావిస్తుండగా.. మరో వర్గం తీవ్రమైన దుష్పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని వాదిస్తోంది. ఆరోగ్య సమస్యలతో పాటు.. మన దేశంలో సాంప్రదాయంగా వస్తున్న విత్తన వ్యవస్థ పూర్తిగా బహుళజాతి సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
బీటీ వంకాయకు దాదాపుగా అన్ని అనుమతులు ఎప్పుడో లభించేశాయి. దేశంలో జన్యుమార్పిడి పంటలు సాగు చేయాలంటే.. అనుమతులు మంజూరు చేయాల్సిన జెనిటికల్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ.. బీటీ వంకాయ ప్రయోగాత్మక సాగుకు గత ఏడాది అక్టోబర్ 14నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఎంతలేదు.. అమల్లోకి వచ్చేస్తుందన్న తరుణంలో.. పర్యావరణ మంత్రిత్వ శాఖ వద్ద దీనికి బ్రేక్ పడింది. బీటీ వంగపై.. దేశంలో విస్తృతస్థాయిలో చర్చ జరగలేదని భావించిన కేంద్ర మంత్రి జైరాం రమేశ్.. ఆ ఫైల్‌ను పక్కన పెట్టారు. తొలిసారిగా దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే... ఏడు చోట్ల విస్తృత సమావేశాలను ఏర్పాటు చేశారు. అయితే.. ఎక్కడిక్కకడ నిరసనలే జైరాం రమేశ్‌కు స్వాగతం పలికాయి.
బీటీ వంగ విషయంలో దేశం రెండుగా చీలిందని చెప్పొచ్చు. ఒకటి విత్తన కంపెనీలు లీడ్ చేస్తున్న వర్గమైతే.. మరొకటి స్వచ్చంధసంస్థలు నడిపిస్తున్న వర్గం. ప్రజాభిప్రాయ సేకరణలో ఈ రెండు వర్గాలు తమ వాదన వినిపించడానికి బలమైన ప్రయత్నమే చేశాయి. అనూహ్యలాభాలను అందుకోవాలంటే.. వంగలోకి బీటీని చొప్పించాల్సిందేనని ఓ వర్గం అభిప్రాయపడగా.. కేంద్ర ప్రభుత్వం మోనశాంటో ఏజెంట్‌గా వ్యవహరిస్తుందని మరికొంతమంది రైతులు ఆరోపించారు. ఈ సమస్య పరిష్కారం కోసమే.. ప్రజలదగ్గరకు వచ్చానన్నది కేంద్రమంత్రి సమాధానం. ఇలా దేశవ్యాప్తంగా జైరాం రమేశ్ నిర్వహించిన సమావేశాలు ఫిబ్రవరి 6తో పూర్తైపోయాయి. ఇక నిర్ణయం ప్రకటించడమే మిగిలింది. ఈ నెల పదో తేదీన తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నిర్ణయం బీటీ వంకాయకు అనుకూలంగా ఉంటుందా.. లేదా.. వ్యతిరేకంగా వస్తుందా.. ఇదే ఇప్పుడు అందిరినీ వేధిస్తున్న ప్రశ్న.
వంకాయకే బీటీ ఎందుకు?
వంకాయ వంటి కూరయు.. పంకజముఖి సీతవంటి భార్యా మణియున్... శంకరుని వంటి దైవము ... లంకాపతి వైరి వంటి రాజును గలడే అంటూ.. వంకాయ గొప్పదనాన్ని కీర్తించాడు శ్రీనాథ మహాకవి. వంకాయతో చేయగలిగినన్ని కూరలు మరొకదానితో చేయలేమన్నదీ వాస్తవమే. అందుకే.. యుగయుగాలుగా వంకాయ మనవారికి అత్యంత ఇష్టమైన వంటకమై కూర్చొంది. దేశవ్యాప్తంగా అత్యధికంగా పండించే పంటల్లో మొదటిది బంగాళాదుంప అయితే.. రెండోది వంకాయే. ఏటా 90 లక్షలకు పైగా వంకాయలు మన దేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో మనరాష్ట్రం వాటా దాదాపు 5 లక్షల టన్నులు. పైగా మనదేశంలో దాదాపు వెయ్యిరకాల వంకాయలు లభ్యమవుతున్నాయి. ఇంత వైవిధ్యమున్న కూరగాయ మరొకటి మనకు కనిపించదు.
వంకాయ చూడడానికి అందంగానే ఉన్నా... కళ్లుమూసుకొని కొనుక్కోవడానికి మాత్రం లేదు. ఏ కాయలో పుచ్చు ఉంటుందో ఏమాత్రం చెప్పలేం. దీనికి కారణం.. ఫ్రూట్ అండ్ షూట్ బోరర్ పురుగు... అదే కాయతొలిచే పురుగు. ఎన్ని మందులు కొట్టినా.. దీన్ని సమూలంగా నివారించడం మాత్రం సాధ్యం కాదు. ఈ కాయతొలిచే పురుగుకు శాశ్వత పరిష్కారమంటూ ముందుకొస్తోంది.. బీటీ పరిజ్ఞానం. వంకాయలోకి ఈ బ్యాక్టీరియాను ప్రవేశ పెడితే.. పురుగును సమూలంగా నాశనం చేస్తుందని బీటీ విత్తనాలు తయారు చేస్తున్న అమెరికన్ కంపెనీ మోన్‌శాంటో చెబుతోంది. పైగా.. బీటీ వంగను సాగుచేస్తే.. ఎలాంటి క్రిమిసంహారకాలను వాడనక్కరలేదంటోంది. కానీ, ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. తరతరాలుగా విత్తనాలను మన రైతులే తయారు చేసుకుంటున్నారు. మంచి వంగడాలు కావాలంటే.. ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ కంపెనీలు రైతులకు అందజేస్తున్నాయి. వీటిని సాగు చేయడం ద్వారా కాసిన కాయలనుంచి.. మళ్లీ విత్తనాలను తయారు చేసుకునే సౌలభ్యం ఉంది. కానీ.. బీటీ విషయంలో మాత్రం ఇలా కాదు. బీటీవిత్తనాలను ప్రతీసారి కంపెనీనుంచే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పైగా... సాధారణ వంగడాలతో పోల్చితే.. బీటీ విత్తనాల ధర చాలా ఎక్కువ. దేశంలోని రైతులందరినీ.. దోచుకోవడానికి ఈ ప్లాన్ అని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పైగా.. ఓ బహుళజాతి సంస్థకు మేలు చేకూర్చడానికి ఇంత ఆత్రం చూపిస్తున్న ప్రభుత్వం.. రైతు సమస్యలను పట్టించుకోవడంలేదని వాదిస్తున్నాయి.
బీటీ వంకాయతో మరో సమస్య కూడా ఉంది. ఇది కాయతొలుచు పురుగును మాత్రమే అరికడుతుంది. ఇతర పురుగులేమైనా పంటను సోకితే మళ్లీ పెస్టిసైడ్స్ కొట్టాల్సిందే. ఈ విషయంలో.. బీటీ వంకాయ విత్తనాలను మనదేశంలో సరఫరా చేయాలనుకుంటున్న మహికో కంపెనీ ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. అంతేకాదు.. వంకాయలను తింటే.. మనుషులు అనారోగ్యం బారిన పడతారన్న అనుమానాలు ఉన్నాయి. క్యాన్సర్, సంతానలేమి, కిడ్నీ సమస్యలకు సంబంధించి.. మహికో కంపెనీ ఎక్కడా వివరణ ఇవ్వలేదు. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.
బీటీ అంటే..
భూమి పైపొరల్లో ఉంటుంది బీటీ బ్యాక్టీరియా. దీని పూర్తిపేరు.. బాసిల్లస్ తురంజెన్‌సిస్. కాయతొలుచు పురుగులను సంహరించే గుణం ఈ బ్యాక్టీరియాకు ఉంది. ఈ లక్షణాన్నే.. విత్తనాల్లోకి చొప్పించే.. ఈ పురుగుల నుంచి పంటకు పూర్తి రక్షణ లభిస్తుందన్న ఆలోచనతోనే.. బీటీ పరిజ్ఞానం రూపుదిద్దుకొంది. బీటీ బ్యాక్టీరియా డీఎన్‌ఏ లోని జన్యువులను.. విత్తనంలోని డీఎన్‌ఏతో కలపడం ద్వారా.. కొత్త వంగడాన్ని శాస్త్రీయ పద్దతుల్లో తయారు చేస్తారు.
బీటీ విత్తనాల నుంచి మొలకెత్తిన మొక్కలో.. బీటీ బ్యాక్టీరియా లక్షణాలుంటాయి. కాయతొలుచు పురుగు మొక్కపై దాడి చేసి.. కాయలను గానీ, ఆకులను గానీ తింటే.. అది కొద్దిసేపటికే చనిపోతుంది. దీనివల్ల పంటకు చీడపీడల సమస్య ఉండదన్నది.. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసినవారు చెబుతున్నారు. క్షారపూరితంగా ఉండే చోట్లే.. ఈ బ్యాక్టీరియా పనిచేస్తుంది కాబట్టి.. పురుగులు చనిపోతాయి. ఇక మనుషుల విషయానికొస్తే.. మన కడుపులో మాత్రమే ఆమ్లాలుంటాయి.. మిగిలిన శరీరమంతా క్షారమయమే. కాబట్టి.. మనుషులకూ సమస్య ఉండొచ్చని కొంతమంది సైంటిస్టులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కడపులోకి వెళ్లగానే.. ఆమ్లాల వల్ల ఈ బ్యాక్టీరియా చనిపోతుందని.. దీనివల్ల మిగిలిన శరీరాని ఎలాంటి సమస్యలు రావని మోనోశాంటో ప్రతినిధులు చెబుతున్నారు. ఈ పరిజ్ఞానానికి అనుకూలంగా ఉన్న వారి వాదనా.. కాస్త వింతగానే ఉంది.
అయితే.. బీటీ పరిజ్ఞానం వల్ల దిగుబడులు పెరుగుతాయన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే.. ఇది కేవలం పురుగును నాశనం చేయడమే తప్ప.. దిగుబడిని పెంచే క్రాస్ ఫాలింగ్ వెరైటీ కానే కాదు. దేశంలో హరితవిప్లవం సమయంలో సృష్టించిన వరి, గోధుమ వంగడాల తరహాది కూడా కాదు. కాయతొలుచు పురుగును అరికట్టడం వల్ల ఆ కాయల వరకూ రైతులకు మిగిలే అవకాశం ఉండొచ్చు. పైగా.. ఇదంతా ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రతీ విత్తనాన్ని ఈ తరహాలో సిద్ధం చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎవరుపడితే వారు తయారుచేయడానికి కూడా లేదు. ప్రపంచవ్యాప్తంగా బీటీ పరిజ్ఞానం విషయంలో అమెరికన్ కంపెనీ మోనోశాంటో గుత్తాధిపత్యం సాగుతోంది. అందుకే.. విత్తనాల ధర చాలా ఎక్కువ. ఇప్పటికే.. బీటీ పత్తి విత్తనాలను మనదేశంలో అమ్ముతూ కోట్లు గడిస్తోంది. ఒక్క 2009లోనే.. 53 వేల కోట్ల రూపాయల వితనాలను ప్రపంచవ్యాప్తంగా అమ్మగలిగింది. దీన్ని బట్టి ఇదెంత పెద్ద వ్యాపారమో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఎక్కువగా వినియోగించే కూరల్లో వంగ ముందంజలో ఉండడంతో.. ఆ కంపెనీ కన్ను దీనిపై పడింది. పైగా.. కాయతొలుచు పురుగు ఇందులో ఉంటుంది కాబట్టి... దాన్ని నివారించడానికి బీటీ ఒక్కటే మందంటూ ప్రచారం చేస్తోంది.
బీటీ పత్తి సమస్య
బీటీ పరిజ్ఞానం మనకి కొత్తేమీ కాదు. కొన్నేళ్ల క్రితమే బీటీ పత్తి రంగ ప్రవేశం చేసింది. అయితే.. బీటీ పత్తితో లాభపడిన వారు కొంతమందే కాగా.. నష్టపోయినవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా 2002-04 మధ్య తీవ్ర దుష్పరిణామాలను బీటీపత్తి సాగు చేసిన రైతులు ఎదుర్కోవాల్సి వచ్చింది.. బీటీ విత్తనాల్లో మొదటగా పత్తిని భారతదేశంలోకి ప్రవేశపెట్టింది మోనోశాంటో. దేశీయ సంస్థ మహికోతో కలిసి.. బీటీ పత్తిని మార్కెట్ చేసింది. జన్యుమార్పిడి పద్దతిలో పత్తి తొలిసారిగా ఇలా రైతులకు చేరింది. కాయతొలుచు పురుగుతో సతమతమవుతున్న రైతన్నలకు ఆపన్నహస్తంగా దీన్ని ప్రచారం చేశారు. పురుగు మందులు కొట్టాల్సిన పనే ఉండదంటూ ఊదరగొట్టారు. అప్పటికే.. పత్తిసాగులో తీవ్ర నష్టాలు చవి చూసిన వారంతా.. .. బీటీ విత్తనాలను అధికమొత్తం చెల్లించి కొనుగోలు చేశారు. కానీ, ఫలితం తారుమారయ్యింది. చాలా చోట్ల మొక్కలే సరిగ్గా రాలేదు. మొక్క పెరిగిన చోట కాయలు లేవు. కాయలున్న చోట.. పురుగులకు ఆహారమైపోయాయి. మళ్లీ పురుగుమందుల మీదే ఆధారపడాల్సి వచ్చింది. మొత్తంమీద చూస్తే.. కంపెనీ చెప్పిన దానికి.. రైతులకు అందిన దానికి పోలికే లేదు.
బీటీ దెబ్బకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో చాలామంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. బీటీ పత్తి మొక్కలను తిన్న ఆవులు, గేదెలు చనిపోయాయన్న వార్తలు రైతులను మరింత ఆందోళనలో పడేశాయి. అందుకే.. ఇప్పుడు బీటీ వంగ అనగానే.. రైతులకు మరోసారి బెంగపట్టుకుంది. పత్తి వాణిజ్య పంట మాత్రమే. కానీ, వంగ ఆహారపంట. ప్రతీ ఒక్కరూ తినే రకం. అందుకే.. దుష్పరిణామాలు ఎంతగా ఉండొచ్చో అన్న ఆందోళనలో జనం ఉన్నారు.
14 ఏళ్ల వయస్సు
జన్యుమార్పిడి పంటలు ప్రపంచానికి పరిచయం అయ్యి 14 ఏళ్లు దాటుతోంది. అయినా.. ఇప్పటివరకూ కేవలం 25 దేశాలు మాత్రమే ఈ వంగడాలకు అనుమతి ఇచ్చాయి. యురోపియన్ యూనియన్.. ఈ తరహా వంగడాలను పూర్తిగా నిషేధించింది. పెరూలో బీటీ బంగాళాదుంపలను నిషేధించారు. చైనాలో బీటీ సోయాకు అనుమతి లేదు. ప్రపంచం మొత్తంమీద సాగవుతున్న భూమిలో కేవలం 8 శాతం మాత్రమే జన్యుమార్పిడి పంటలు సాగవుతున్నాయంటే.. వీటికి ఆదరణ ఎంత కరువయ్యిందో అర్థం చేసుకోవచ్చు. పైగా మన దగ్గర బీటీ పత్తి సృష్టించిన అనర్థాలను ఎవరూ మరిచిపోలేదు. దేశంలో వంగను పండించే ప్రధాన రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్నాటక, కేరళ, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బీటీ వంగను నిషేధిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.
కానీ.. మన దగ్గర సమస్యలను సాకుగా చేసుకుని, బీటీ వంగడాలను ఎక్కువగా అమ్ముకునే కుట్ర ప్రస్తుతం జరుగుతోంది. బీటీ వంకాయకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే.. దాని వెంటే.. మరో 41 వంగడాలు బీటీ పరిజ్ఞానంతో రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వరి, బంగాళాదుంపలు, టమాట, మొక్కజొన్న, కంది, వేరుశెనగ, ఆవాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బెండ ఇలా ఎన్నో రకాలు అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద ఎదురుచూస్తున్నాయి. మనం నిత్యం ఉపయోగించే మిరప, అల్లం, ఉల్లి, గోధుమ, అరటి లాంటి రకాల్లో బీటీ చొప్పించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. వంగతో సహా.. వీటన్నింటికీ అనుమతులు ఇస్తే.. మన వ్యవసాయం కొన్నేళ్లలో విదేశీ కంపెనీల నియంత్రణలోకి వెళ్లిపోవడం ఖాయమే. పైగా.. బీటీ పత్తి నుంచి పూర్తిస్థాయిలో పాఠాలు నేర్చుకోకుండానే.. మరో తప్పటడుగు వేస్తే మాత్రం భారీ మూల్యాన్నే ప్రభుత్వం చెల్లించుకోవాల్సి రావచ్చు.
ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే నిర్ణయం ఉంటుందన్నది.. కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తాజా స్టేట్‌మెంట్. ఏదేమైనా.. బీటీ వంగతో.. మనుషులకు హాని జరుగుతుందా లేదా అన్నది మరింత శాస్త్రీయంగా పరిశోధించాల్సిన అవసరం మాత్రం ఉంది. పైగా.. ఇది ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో నిష్పక్షపాక్షికంగా జరిగినప్పుడే జనానికి నమ్మకం కలుగుతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మీరు చెప్పినది కొంతవరకూ నిజమే కావచ్చు. కాని 'ఇక ఎవరూ దేశవాళీ వంకాయలు పండిచకూడదు, పండిస్తే జైల్లో పెడతాం ' అనే నిభంధన ఏమీ లేదనుకుంటాను. మీరు చెప్పినట్టు రుచి పచీ లేకుంటే, ఆ వంకాయ కాలగర్భంలో కలిసి పోతుంది. ఒకవేళ అది బాగా వుంటేనో? నిజంగా చీడ పీడలు తగ్గి దిగుబడి పెరిగితేనో? అవి ఎక్కువకాలం పాడవకుండా వుండగలిగితేనో? కోట్లాది మంది మధ్యతరగతి జీవులు దాన్నుంచి గుత్తివంకాయ కూర కాకున్నా , వంకాయ పచ్చడైనా అందుబాటులోకి వస్తుందేమో!
ఓపన్ మైండ్ తో ఆలోచిస్తే .. రానివ్వండి , ఫ్రీ మార్కెట్ లో నిలదొక్కుకుంటే సరే , లేదా మన ఆప్షన్ మనకుంటుంది. అమెరికా ఐనా, ఆఫిర్కా ఐనా కొత్త టెక్నాలజీని ఆదరించడం ప్రజలకే వదిలేయాలి. ప్రతిదానికీ రిజర్వేషన్లు అని గిరి గీచుకుని , సాంప్రదాయంగానే వుండాలి అనే చాందసం అభివృద్ధికి దోహదం చేస్తుందంటారా? ఏమో నాకూ మొదట 'వద్దూ అనిపించినా అంత భయం అనవసరమేమో అనిపిస్తోంది.
హైబ్రిడ్ బెండ, టమేటాలు , పత్తి, బియ్యం అల్రెడీ వున్నాయి , మరి ఈ వంకాయ పంచాయతీ ఎందుకో! పోటీ పడగలిగితే వుంటుంది , లేకుంటే మ్యూజియంలో పెడదాము. ఇది మొదటి రకం , ఇంకా అభివృధ్ధి చేస్తారేమో ,చిదిమేయడం న్యాయమా?!
శంకర్