అందరూ భావిస్తున్నట్లు.. పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాలేదు. ఎన్నో ఒప్పందాల పునాదులపై రాష్ట్ర విలీనం జరిగింది. అభివృద్ధి చెందిన ఆంధ్రా ప్రాంతం ఓ వైపు... అట్టడుగున ఉన్న తెలంగాణ మరో వైపు.. ఈ రెండింటినీ కలపడం కోసం ఎన్నో హామీలను ఇచ్చారు ఆంధ్రా నేతలు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి.. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించే వరకూ ఎన్నో కీలక పరిణామాలు... సంఘటనలు చోటు చేసుకున్నాయి.. వాటిపై ప్రత్యేక వ్యాసం..
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉంటే.. తెలుగు జాతి అభివృద్ధి కష్టమని భావించడంతో.. ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం మొదలయ్యింది. దీనికి ప్రేరణ.. బెంగాల్ రాష్ట్ర విభజన. 1911లో భారత గవర్నర్ జనరల్ కలకత్తా ప్రెసిడెన్సీలోని హిందీ మాట్లాడే వారిని విభజించి.. బీహార్ రాష్ట్రంగా ఏర్పాటు చేశాడు. అప్పటికే స్వతంత్ర్య పోరాటంలో ఉధృతంగా పాల్గొంటున్న ఆంధ్రులను కదిలించింది. మద్రాసు రాష్ట్రంలోని తెలుగువారికోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలన్న డిమాండ్ అప్పటి నుంచే ఊపందుకొంది. 1938 నాటికి ఈ డిమాండ్ మరింత తీవ్రమయ్యింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ నేరుగా లండన్ వెళ్లి.. బ్రిటీష్ ప్రభుత్వ కార్యదర్శితో చర్చలు కూడా జరిపారు. మరో ఏడాదిలో ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు అక్కడ గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే.. అప్పుడే రెండోప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో.. పెండింగ్‌లో పడింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. మద్రాసు స్టేట్‌ను విభజించడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. అయితే.. మద్రాసు రాజధానిగా కావాలని పట్టుబడ్డటం.. దీనికి తమిళనేతలు మోకాళ్లడ్డడంతో.. ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఇదే సమయంలో ఆంద్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ.. స్వామి సీతారం 35 రోజుల పాటు నిరాహారదీక్ష కూడా చేశారు. అయితే వినోభాభావే జోక్యం చేసుకోవడంతో.. ఆయన దీక్ష విరమించారు. చివరకు.. మద్రాసు రాజధానిగా ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. పొట్టి శ్రీరాములు ఆమరణదీక్ష పూనడంతో.. పరిస్థితిలో మార్పు వచ్చింది. 58 రోజుల దీక్ష తర్వాత.. ఆయన ప్రాణం వదలడంతో.. ఆంధ్రదేశంలో కల్లోలం పుట్టింది. ఎక్కడికక్కడ ఆందోళనలు చేసి.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని భారత ప్రధాని నెహ్రూ డిసెంబర్ 19, 1952న స్వయంగా ప్రకటన చేశారు. కానీ.. రాష్ట్ర విభజన పూర్తి కావడానికి దాదాపు పదినెలల సమయం పట్టింది. అక్టోబర్ 1, 1953న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు బాధ్యతలు స్వీకరించారు. అయితే.. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలవడంతోనే రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల మధ్య విబేధాలు వచ్చాయి. 1937లో కాశీనాధుని నాగేశ్వరావు నివాసం.. శ్రీభాగ్‌లో ఇరు ప్రాంత నేతలూ చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని సీమ నేతలు డిమాండ్ చేశారు. ఆ ఒప్పందం ప్రకారం.. ఆంధ్రా యూనివర్సిటీకి వాల్తేరుతో పాటు అనంతపురంలోనూ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కోస్తా జిల్లాలతో సమానంగా సీమ జిల్లాలు అభివృద్ధి చెందడానికి పదేళ్లపాటు.. నీటిపారుదల రంగంలో ప్రాధాన్యం ఇవ్వాలి. రాజధాని ఓ ప్రాంతంలో ఏర్పాటైతే.. హైకోర్టు మరోప్రాంతంలో ఏర్పాటు కావాలి.. ఇలా చాలా విషయాలపై అవగాహన కుదుర్చుకున్నారు. దీనికి అనుగుణంగా.. రాజధాని కర్నూలులో ఏర్పాటు చేశారు. హైకోర్టును గుంటూరులో పెట్టారు. ఇక హైదరాబాద్‌రాష్ట్రాన్ని కూడా... ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేసుకోవాలన్న ఉద్దేశం అప్పటికే చాలామంది నేతల్లో ఉంది. విశాలాంధ్ర ఏర్పడితే.. అప్పటికే అన్ని వసతులున్నహైదరాబాద్‌ను రాజధానిగా చేసుకుందామని.. ఆంధ్ర,సీమ ప్రాంత నేతలంతా అప్పటికే ఓ అవగాహనకు వచ్చారు.
మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడానికి అప్పటిదాకా పోరాడిన వారంతా.. ఆపై తమ ఉద్యమాన్ని హైదరాబాద్ వైపు మళ్లించారు. రెండు రాష్ట్రాలను విలీనం చేసి విశాలాంధ్ర ఏర్పాటు చేయాలంటూ ఆంధ్రప్రాంతంలో ఉద్యమం ఊపందుకొంది. కాంగ్రెస్ నేతలతో పాటు.. కమ్యూనిస్టు నేతలూ ఇందులో కీలకపాత్ర పోషించారు. కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే.. విశాలాంధ్ర ఏర్పాటుకు పావులు కదిలాయి. అప్పటికే.. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి కమ్యూనిస్టు నేతలు.. విశాలాంధ్ర కోసం డిమాండ్ చేస్తుండడంతో.. ఆంధ్రాప్రాంతంలో.. పార్టీలకతీతంగా ఈ ఉద్యమం పాకిపోయింది. భాషా ప్రాతిపదికన ఆంధ్రా, హైదరాబాద్ రాష్ట్రాలను కలిపివేసి ఒకే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై ఒత్తిడి పెరిగింది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా రాష్ట్ర విభజన డిమాండ్లు వస్తుండడంతో.. ఫజల్ అలీ ఛైర్మన్‌గా రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ను 1953 డిసెంబర్‌లో ఏర్పాటు చేశారు. ఆంధ్రా, హైదరాబాద్‌కు చెందిన నేతలు ఎంతోమంది.. ఈ కమిషన్‌కు రెండు రాష్ట్రాల విలీనంపై ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. విస్తృత అధ్యయనం తర్వాత.. సెప్టెంబర్ 30, 1955న ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్‌ను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. అయితే.. విశాలాంధ్ర ఏర్పడితే.. ప్రయోజనాలున్నప్పటికీ.. హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠా, కన్నడ మాట్లాడే ప్రాంతాలను విడదీసి.. తెలుగుమాట్లాడేవారికోసం.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఫజల్ అలీ కమిషన్ సూచించింది. ఈ రిపోర్ట్‌పై.. తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది. విశాలాంధ్రకు మద్దతు ఇస్తున్న హైదరాబాద్‌లోని కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు తమ పదవులు వదలుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే.. కమిషన్ తన రిపోర్ట్‌లోనే మరో విషయాన్ని కూడా చెప్పింది. ఒకవేళ రెండు రాష్ట్రాలను విలీనం చేయాలని భావిస్తే మాత్రం.. ఇప్పటికిప్పుడే ఆ ప్రయత్నం చేయకూడదని రిపోర్ట్‌లో పేర్కొంది. ఆంధ్రా ప్రజల్లో విశాలాంధ్రకు సంపూర్ణ మద్దతు ఉన్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం.. ఈ విషయంలో అనిశ్చితి నెలకొందని ఫజల్ అలీ గుర్తించారు. ఈ విషయాన్నే కేంద్ర ప్రభుత్వానికి ఆయన విన్నవించారు. అందుకే.. 1961లో జరిగే ఎన్నికల తర్వాత.. హైదరాబాద్ అసెంబ్లీలో విశాలాంధ్రకు అనుకూలంగా తీర్మానం ప్రవేశపెట్టాలని... మూడింట రెండొంతుల మెజార్టీతో విజయం సాధిస్తేనే.. రాష్ట్రాల విలీనానికి అంగీకరించాలని స్పష్టంగా చెప్పింది.. ఎస్సార్సీ.
ఎస్సార్సీ రిపోర్ట్ ప్రకారం వెళ్లాలంటే.. 1961 తర్వాత గానీ.. రాష్ట్ర విలీనం సాధ్యం కాదు. కానీ.. అరకొర వసతులతో నెట్టుకొస్తున్న ఆంధ్రరాష్ట్రానికి ఇది చాలా ఇబ్బందిగా మారింది. అప్పటికే మూడేళ్లుగా హైదరాబాద్‌ను ఎప్పుడెప్పుడు కలుపుకుందామా అన్న ఆతృతతో అక్కడి నేతలున్నారు. మరో ఐదేళ్లు ఆగితే.. ఇక రాష్ట్ర విలీనం కాదన్న అంచనాతో.. ఆంధ్రా కాంగ్రెస్ నేతలు విశాలాంధ్రకోసం ఉద్యమాన్ని తీవ్రం చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండడంతో.. వెంటనే విలీనం జరగాలంటూ.. పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. విశాలాంధ్ర ఏర్పాటుకు కాంగ్రెస్ హై కమాండ్ కూడా.. సముఖంగా ఉండడంతో.. రెండు ప్రాంతాల మధ్య విభేధాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. దీంతో ఎస్సార్సీ రిపోర్ట్‌కు భిన్నంగా.. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి మార్గం సుగమమయ్యింది.
నెహ్రూకి ఇష్టమేనా... ?
భాషా ప్రాతిపదికన దేశాన్ని విభజించడం నెహ్రూకు మొదటి నుంచీ ఇష్టం లేదు. కానీ పరిపాలన సులవవుతుందన్న ఉద్దేశంతో దానికి ఆయన అంగీకరించాడు. అయితే.. విశాలాంధ్ర ఏర్పాటును మాత్రం చివరి వరకూ ఆయన వ్యతిరేకించాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు కొన్ని నెలల ముందు అంటే.. మార్చి 6, 1956న నిజామాబాద్‌లో జరిగిన సభలో నెహ్రూ పాల్గొన్నారు. ఓ అమాయకురాలైన తెలంగాణకు.. తుంటరి అబ్బాయి లాంటి ఆంధ్రాకు ముడిపెడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విడిపోవచ్చని ఆయన స్పష్టంగా చెప్పారు (కిందిపోస్ట్‌లో వీడియో ఉంది కావాలంటే చూడొచ్చు). దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ఎన్ని అపనమ్మకాల మధ్య ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.
డిమాండ్లు..
ఆంధ్రాప్రాంతంతో కలవడానికి.. హైదరాబాద్ రాష్ట్ర నేతలు సులువుగానే అంగీకరించారు కానీ.. విలీనానికి మాత్రం కొన్ని ప్రత్యేక రక్షణల కోసం డిమాండ్ చేశారు. అప్పటికే ఆంధ్రాప్రాంతం విద్య,వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చెంది ఉండడం.. తెలంగాణలో.. ఈ రెండూ కుంటుపడడంతో.. ఈ హామీలు కోరడం తప్పనిసరి అని అప్పటి నేతలు భావించారు. అందులో భాగంగానే పెద్దమనుషుల ఒప్పందం తెరపైకి వచ్చింది. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నేతలు ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు. ఆంధ్రా,తెలంగాణ బడ్జెట్‌లను ప్రత్యేకంగా నిర్వహించాలన్నది ఇందులో ప్రధానాంశం.కేవలం బడ్జెట్ మాత్రమే కాదు.. మరెన్నో విషయాలనూ ఈ ఒప్పందంలో చేర్చారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో విద్యవైద్య సౌకర్యాలను పెంచాలి. ఉద్యోగాల విషయంలోనూ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలను అమలు చేయాలి. దీని ప్రకారం.. ఆంధ్రా ప్రాంతం వారు.. తెలంగాణకు వచ్చి 12 ఏళ్లు ఉంటే గానీ, స్థానికులుగా గుర్తించకూడదు. ఇక్కడి వ్యవసాయ భూములను ఆంధ్రులు కొనకూడదు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులను చెరో ప్రాంతం తీసుకోవాలి. ఇక తెలంగాణ అభివృద్ధి విషయంలో నిర్ణయాధికారాలు తీసుకొని.. ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి రీజనల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి. దీనికి చట్టబద్దత కల్పించాలి. ఇవన్నీ పెద్దమనుషుల ఒప్పందంలోని కీలకాంశాలు. ఈ డిమాండ్లన్నింటినీ ఆమోదిస్తున్నట్లు ఆంధ్రాప్రాంత నేతలు హామీల మీద హామీలు ఇచ్చారు. అయితే.. వీటన్నింటినీ తెలంగాణ ప్రాంతం నేతలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో.. ఏకంగా.. ఆంధ్రా శాసనసభలో నీలం సంజీవరెడ్డి స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాతే.. రాష్ట్ర విలీనం మొదలయ్యింది. ఇలా ఆంధ్రరాష్ట్ర నాయకులు అధికారికంగా హామీలను ఇవ్వడంతో.. తెలంగాణ నేతలు విలీనానికి ఒప్పుకున్నారు. ఈ ఒప్పందాలకు లోబడే.. హైదరాబాద్ రాష్ట్రం , ఆంధ్రరాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. ఈ ఒప్పందాలే లేకపోతే.. ఇప్పటికి వేరు వేరు రాష్ట్రాలుగానే రెండు ప్రాంతాలు ఉండేవన్నది మాత్రం నిజం.
19, డిసెంబర్ 2009, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
its great sir i am just 23 naaku nijanga evanni telusukovalani unna avakasham raledu eelanti viluvyna samacharanni istunnanduku krutagnudanu
endukandi ae media kuda elanivi cheppadam ledu ooho avikuda vallave kada
naakoka anumanam asalu karnool unchi hyd ki rajadanini marchadanni eeppati nayakulu evidanga samardinchukuntaru manalani bagucheyadanikana leka variki vasatulu levana ? mari vasatulu levani vachhinavallaku ippudu matlade hakku ekkadidhi ela vachhinavallu alane kada vellali