19, మే 2009, మంగళవారం
లంకలో విభీషణుడు
రామాయణంలో విభీషణుడు క్యారెక్టర్ అందరికీ తెలిసిందే. ముప్పైకోట్ల దేవుళ్లలో ఏ ఒక్కరికీ లొంగని రావణబ్రహ్మ.. ముల్లోకాలను గడగడలాడించిన ఆ లంకాధిపతి రాముడి చేతిలో హతమయ్యాడంటే.. అందుకు కారకుడు ఒకే ఒక్కడు.. అతడే విభీషణుడు. ఇంటిగుట్టు బయటపెట్టి లంకకే ముప్పుతెచ్చాడు. ఇదంతా రామాయణం. ఇక తాజా పరిణామాలకొస్తే.. ప్రస్తుత లంక జాతిపోరులోనూ విభీషణుడి పాత్రను పోషించిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే.. కల్నల్ కరుణ అమ్మన్. ఒకప్పుడు ప్రభాకరన్‌కు నమ్మిన బంటు. ఇప్పుడో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు అనుచరుడు. ప్రభాకరన్ రహస్యాలను.. ఎల్టీటీఈ వీక్ పాయింట్లను లీక్ చేసింది కరుణే. 1993లో ఎల్టీటీఈలో చేరిన కరుణ 2004 వరకూ ఆ సంస్థలో వివిధ పదవులు నిర్వహించాడు. ప్రభాకరన్‌కు కుడిభుజంగా ఎదిగాడు. అయితే.. పెద్దపులితో వచ్చిన ఆర్థికపరమైన విభేదాలతో.. వేరుపడి ప్రత్యేక గ్రూప్‌ను ఏర్పాటు చేశాడు. లంక తూర్పుభాగంలో పాగావేశాడు. క్రమంగా సైన్యంతో ఒప్పందం కుదుర్చుకొని, జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. అనంతరం ఎంపీగా ఎన్నికై.. రాజపక్సె ప్రభుత్వంలో చేరాడు. ఎల్టీటీఈపై ఎక్కడెక్కడ దాడులు చేయాలి.. ఎలా అంతం చేయాలన్న ప్రణాళికలో ప్రధానపాత్ర పోషించింది కరుణే. అప్పుడు రావణబ్రహ్మ ఎలా అంతమయ్యాడో.. ఇప్పుడు ప్రభాకరన్ కూడా అలాగే అంతమయ్యాడు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి