హైదరాబాద్.. భోలక్‌పూర్ నీటికాలుష్యం మొత్తం మీద తొమ్మిది మంది ప్రాణాలు బలికొంది. ఇంకా ఎంతోమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు. వైఫల్యం అంతా జలమండలిదేనని జిహెచ్‌ఎంసీ అధికారులు.. అసలు గొడవంతా.. తోళ్ల పరిశ్రమల వల్లేనంటూ జలమండలి అధికారులు వాదులాడుకొంటున్నారు. తప్పెవరిదైనా.. ఇక్కడ పోయింది ప్రజల ప్రాణాలు. ప్రజల జీవితాలంటే వీరికి అసలు లెక్కలేదా.. కుటుంబ పెద్ద పోతే.. ఆ కుటుంబం.. ఈ మహానగరంలో ఎలా బతకగలుగుతుంది. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం వీరికి ఏమూలకు వస్తుంది. అసలు అందుతుందన్న గ్యారెంటీ ఏమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలు వీటికి సమాధానం ఇచ్చేవారే లేరు.
సురక్షితం కాని రక్షిత మంచినీరు
ఇక భోలక్‌పూర్ సంఘటనకు తోళ్లపరిశ్రమల వ్యర్థాలే కారణం అనుకుందాం.. ఇక్కడ తప్ప మిగిలిన ప్రాంతాల్లో సురక్షిత మంచినీటిని జలమండలి అందించగలుగుతుందా.. వీటిని తాగితే.. మనం సేఫ్‌గానే ఉండగలుగుతామా.. ఇటీవలే.. నగరంలో అనేక చోట్ల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్- IPM అనే సంస్థ నీటి శాంపిళ్లను సేకరించి పరీక్షలు జరిపింది. హైదరాబాద్‌లో దాదాపు 60 చోట్ల కలుషిత నీరే సరఫరా అవుతుందని ఈ పరిశోధనల్లో తేలింది. నిర్ణీత ప్రమాణంలో ఉండాల్సిన దాని కన్నా ఎన్నో రెట్టు ఎక్కువగా బ్యాక్టీరియా ఈ నీళ్లలో ఉందని ఐపిఎం నివేదిక తేల్చింది. వంద మిల్లీలీటర్ల నీటిలో పది శాతం వరకూ కోలిఫాం బ్యాక్టీరియా ఉండొచ్చు. కానీ మన భాగ్యనగరంలో మాత్రం బ్యాక్టీరియా.. 1600 శాతం ఉంది. ముఖ్యంగా... బొల్లారం, చిలకలగూడ, కాచిగూడ హరిజన్‌కాలనీ, న్యూ బోయిగూడ, శాలిబండ, ఎల్‌బి నగర్‌లో బ్యాక్టీరియా 1609 శాతం. ఇక గోల్నాక, సికింద్రాబాద్‌లోని సుభాష్‌రోడ్, రాజేంద్రనగర్ సమీపంలోని బుద్వేల్‌లో 1100 శాతం బ్యాక్టీరియా ఉంది. భోలక్‌పూర్‌లో 210 శాతం బ్యాక్టీరియా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.
ఇదీ మన జలమండలి సరఫరా చేసే మంచినీళ్ల పరిస్థితి. ఎడాపెడా పన్నులు బాధుతుంటే జిహెచ్ఎంసీకి ఇదేమీ పట్టదు. ఇక మీటర్లు పెట్టిమరీ డబ్బులు గుంజుతున్న జలమండలికి మంచి నీళ్లు అందివ్వడమే తెలియదు. ప్రజలకు రక్షిత నీరు అందించలేని ప్రభుత్వం ఎందుకు.. ప్రభుత్వ సంస్థలు ఎందుకు.. వాటికి బిల్లులు కట్టడం ఎందుకు.. డబ్బులిచ్చి మరీ రోగాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితిని హైదరాబాద్‌లో కల్పిస్తున్న జలమండలిని ఏం చేయాలి.. మీరే ఆలోచించండి. అంతకన్నా ముందు.. మీరు తాగుతున్న నీరు సురక్షితమో కాదో ఒక్కసారి చూసుకోండి..
9, మే 2009, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి