12, జనవరి 2012, గురువారం
పాక్ అధ్యక్షుడు పారిపోయాడా..?
Categories :
asif ali zardari . milatary coup . news . pakistan . TOP
పాకిస్తాన్లో మరో ప్రజాస్వామ్య ప్రభుత్వం పతనం అంచున నిలిచింది. అక్కడి ప్రభుత్వానికి, సైనానికి మధ్య సంక్షోభం ముదిరి పాకానపడింది. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం చేజిక్కించుకోవడానికి ఆర్మీ కుట్రపన్నుతోందని చాలాకాలంగా ఆరోపిస్తున్న ప్రధాని యూసఫ్ రాజా గిలానీ, ఇటీవలే డిఫెన్స్ సెక్రటరీపై వేటు వేశారు. పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ కియానీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండడంతోనే ఈ వేటు పడిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంతో మరింత ఆగ్రహం చెందిన సైన్యాధ్యక్షుడు, తిరుగుబాటుకు సిద్ధమైనట్లు వదంతులు వ్యాపించాయి. ముందుగా ఎన్నికలకు వెళ్లడమా లేక, పాక్ సైన్యానికి అధికారం అప్పగించడమా అన్న సందిగ్ధస్థితిలో గిలానీ సర్కార్ కొట్టుమిట్టాడుతోంది. ముందుగా ఎన్నికలకు వెళ్లాలంటూ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ దేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. దేశంలో ఇంత అలజడి నెలకొన్న తరుణంలో పరిస్థితులను చక్కదిద్ది, పాలనను గాడిలో పెట్టాల్సిన దేశాధ్యక్షుడు జర్ధారీ చక్కగా దుబాయ్ చెక్కేశారు. అకస్మాత్తుగా ఆయన వెళ్లడంపై భారీగానే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. సైన్యం ఇచ్చిన అల్టిమేటంతోనే ప్రవాసంలోకి వెళ్లిపోయాడని కొంతమంది భావిస్తుండగా, పెళ్లికి హాజరు కావడానికి వెళ్లాడని మరికొందరు, చికిత్సకోసం వెళ్లాడని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, జర్దారీ దేశం దాటడంతో సర్కార్కు కష్టకాలం వచ్చినట్లే కనిపిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి