11, జనవరి 2011, మంగళవారం
మధ్యంతరం తప్పదా..?
రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వాన్ని రాజీనామాల సుడిగాలి వేగంగా చుట్టుముడుతోంది. ప్రభుత్వాన్ని పడగొట్టనంటూ వైఎస్ జగన్ పదేపదే చెబుతున్నా ఆయన చర్యలు మాత్రం సర్కార్‌ను కూల్చే దిశలోనే సాగుతున్నాయి. అటు తెలంగాణ కాంగ్రెస్ నేతలూ కత్తులు దూస్తుండడం ప్రమాద సంకేతాలను పంపుతోంది. మధ్యంతరం తప్పకపోవచ్చేమోననిపిస్తోంది. నిజంగానే మధ్యంతరం వస్తుందా..?
జగన్ దయాదాక్షిణ్యాలపైనే కిరణ్ సర్కార్ కొనసాగుతోందంట. ఇదే విషయాన్ని ఢిల్లీ దీక్షలో స్పష్టంగా ప్రకటించారు జగన్. తన వైపున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోతుందని, కానీ, తానే వద్దంటున్నానని చెప్పుకొచ్చారు వైఎస్ తనయుడు. ఓ రకంగా ప్రభుత్వాన్ని కూల్చేస్తానన్న సంకేతాలు ఇవ్వడంలో భాగంగానే ఈ ప్రకటన చేసి ఉండొచ్చు.
జలదీక్షా..? బలదీక్షా?
జలదీక్ష కాస్తా బలదీక్షగా మారిపోయింది. నీటిపోరాటం అంటూ జగన్ చెబుతున్నా.. ఢిల్లీ దీక్షంతా సోనియాపై బలపోరాటంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్‌కు సమస్యలు సృష్టించడానికే అన్న విషయం అర్థమవుతోంది. కేవలం రాష్ట్రంలో బలాన్ని చూపించుకుంటే లాభం లేదనుకుంటున్న జగన్.. నేరుగా దేశరాజధానినే తన కార్యసాధనకు ఎంచుకున్నారు. తనకున్న ప్రజాప్రతినిధుల బలాన్ని.. సోనియాకు అతి దగ్గరగా చూపించాలనుకున్నారు. అందుకే, ఢిల్లీలో భారీ దీక్షను చేపట్టారు. సోనియాగాంధీకి తలనొప్పిని సృష్టించారు.
తనకు మద్దతిస్తున్న వారందరినీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగమన్న జగన్.. క్రమంగా మనసు మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. వారిపై కాంగ్రెస్ అధిష్టానమే వేటు వేసేలా చేయాలన్న ప్రణాళికను అమలు చేస్తున్నారు. జగన్ అనుకున్నది జరిగితే, సెంటిమెంట్ అస్త్రం ఎన్నికల్లో మరింతగా కలిసివస్తుంది. విజయవాడ చేసిన లక్ష్యదీక్షలోనూ ఎక్కువమంది ఎమ్మెల్యేలను భాగస్వాములను చేసారు. అయితే.. దీక్షలో పాల్గొన్న వారి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకోవడంతో.. నేరుగా అధిష్టానం కళ్లముందరే బలప్రదర్శనకు దిగారు.
ఢిల్లీ దీక్షలో ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ హైకమాండ్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఎంతగా కట్టుదిట్టం చేస్తున్నా.. జగన్ బలం ఏమాత్రం తగ్గడం లేదు సరికదా.. ఇంకా పెరుగుతోంది. ఢిల్లీ దీక్షకు మొత్తం 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శ్రీనివాసులు, కమలమ్మ, అమరనాథ్‌రెడ్డి, సుచరిత, ఆదినారాయణరెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, గురునాథరెడ్డి, రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, కొండా సురేఖ, జయసుధ, ఆళ్లనాని, డి.బాబురావు, కె.రాంచంద్రారెడ్డి, నీరజారెడ్డి, కుంజా సత్యవతి, పి.బాలరాజు, రేగ కాంతారావు, ఎం.ప్రసాదరాజు, లబ్బి వెంకటస్వామి, ఎన్.శేషారెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎం. రాజేశ్‌లు ఢిల్లీలో జగన్‌తో పాటు దీక్షలో పాల్గొన్నారు. వీరిలో విజయవాడ దీక్షకు హాజరుకాని ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత, భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిలు కొత్తగా జగన్ శిబిరంలో చేరారు. లక్ష్యదీక్షకు హాజరైన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి, భీమవరం ఎమ్మెల్యే పి.అంజిబాబు, బందరు ఎమ్మెల్యే పేర్నినాని, పెడన ఎమ్మెల్యే జోగిరమేష్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిలు ఢిల్లీ దీక్షకు హాజరుకాలేదు. అయితే.. ఈ ఆరుగురి మద్దతూ జగన్‌కే ఉండే అవకాశాలున్నాయి. అంటే.. కాంగ్రెస్ శాసనసభ్యుల్లోనే జగన్‌కు మొత్తం 31 మంది సపోర్ట్ ఉన్నట్లు. ఇక పీఆర్‌పీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డి, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిలూ జగన్‌తో పాటే ఢిల్లీలో దీక్ష చేపట్టారు. మరో టీడీపీ రెబల్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఢిల్లీ దీక్షకు హాజరుకాకపోయినా, ఆయన గతంలోనే జగన్‌వైపు నిలబడ్డారు. కాంగ్రెస్ ఎంపీల్లో సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డిలు జగన్‌తోనే జోడీ కడతామంటున్నారు.
కాంగ్రెస్‌లో కలవరం
జగన్ వేసిన ఢిల్లీ ఎత్తుగడ కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలంటే సస్పెండ్ చేసి పారేయవచ్చు కానీ, ఏకంగా 31 మంది శాసనసభ్యులు పార్టీ వ్యతిరేక చర్యలకు ఒడిగట్టడంతో వీరందరినీ ఏం చేయాలో పాలుపోవడం లేదు. పోనీ ఢిల్లీ దీక్షకు హాజరైనవారిపైనే చర్యలు తీసుకుందామనుకున్నా.. వారి సంఖ్య ఇరవైఐదు. ఇంతమందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి.. సమస్యలను కాంగ్రెస్ కొని తెచ్చుకుంటుందా అన్నదే ఇప్పుడు సమాధానం కావాల్సిన ప్రశ్న.
మధ్యంతరం తప్పదా..?
బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు అంచనాల ప్రకారం మరో మూడు నెలల్లో ఎన్నికలు తప్పకపోవచ్చు. దానికి కారణం.. జగన్. కాంగ్రెస్‌ను, ఆ పార్టీ అధినేత్రి సోనియాను ముప్పుతిప్పలు పెట్టాలనుకున్న జగన్, ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలను తనవైపు ఆకర్షించుకుంటున్నారు. విజయవాడలో జరిగిన లక్ష్యదీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలపై చర్యలను కాంగ్రెస్ అధిష్టానం తీసుకోకపోవడంతో జగన్ బలం పెరిగింది. ఢిల్లీ దీక్షకు నలుగురు ఎమ్మెల్యేలు అదనంగా హాజరయ్యారు. ఇదే జగన్‌లో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. అందుకే.. తాను తలుచుకుంటే ప్రభుత్వం పడిపోవడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. జగన్ ఊపే ఆయన అనుచరుల్లోనూ కనిపిస్తోంది. జగన్‌తో పాటే ఉంటున్న కడప ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి గెలవాలంటూ.. రాష్ట్ర మంత్రి డీఎల్ చేసిన సవాల్‌కు వారు ప్రతిసవాల్ విసురుతున్నారు. ఎన్నికలకు సిద్ధమన్న సంకేతాలను ఇస్తున్నారు.
జగన్‌కు బలం పెరగడం.. కాంగ్రెస్‌ను టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలో సొంతగా ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్.. జగన్ తెగిస్తే ఇతర పార్టీలపై ఆధారపడక తప్పదు. అసెంబ్లీలో బలాబలాలను ఒక్కసారి పరిశీలిస్తే... 2009 ఎన్నికల్లో 156 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఇందులో పులివెందుల స్థానానికి వైఎస్ సతీమణి విజయమ్మ రాజీనామాతో 155కు మెజార్టీ తగ్గింది. జగన్‌కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ సభ్యుల సంఖ్య అధికారికంగానే 31. ఈ లెక్కన చూస్తే ఇప్పుడు కాంగ్రెస్‌కున్న బలం 124 మాత్రమే. 294 సీట్లున్న రాష్ట్రంలో ప్రభుత్వం నిలబడాలంటే... కనీసం 148 సభ్యుల బలం ఉండాలి. కానీ, జగన్ బలం పెరగడంతో కాంగ్రెస్‌కు సాధారణ మెజార్టీ కన్నా 24 మంది సభ్యులు తక్కువగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు బయటపడకపోయినా, అవకాశం వచ్చినప్పుడు మరికొంతమంది జగన్‌వైపే నిలబడే సూచనలు కనిపిస్తున్నాయి. తాను తలుచుకుంటే ప్రభుత్వం పడిపోతుందంటూ జగన్ హెచ్చరిస్తుండడం పొంచి ప్రమాదానికి ముందస్తు సంకేతంగానే భావించాలి. అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే పీఆర్పీ, ఎంఐఎంలపై కాంగ్రెస్ ఆధారపడక తప్పదు. అయితే.. ఇప్పటికే పీఆర్పీ నుంచి ఇద్దరు సభ్యులు జగన్‌వైపు వెళ్లిపోయారు. అంటే పూర్తి బలం కాంగ్రెస్‌కు అందదన్నమాటే. ఇలా ఏ రకంగా చూసుకున్నా కిరణ్ సర్కార్‌కు గండం తప్పేలా కనిపించడం లేదు. ఒకవేళ జగన్ వైపున్న ఎమ్మెల్యేలను ముందుగానే సస్పెండ్ చేసినా సమస్యలు తప్పవు. వారంతా జగన్ పార్టీ పేరునే పోటీ చేసి అసెంబ్లీకి రావచ్చు. అందరూ ఎన్నికైతే అది మరీ ప్రమాదం. అందుకే.. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తున్నదానిపైనే అందరి ఆసక్తి
కాంగ్రెస్ పార్టీపై టీఆర్‌ఎస్, తెలుగుదేశం, బీజేపీ కూడా అసంతృప్తితోనే ఉన్నాయి. ఒకవేళ జగన్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి రావచ్చు. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే కాంగ్రెస్ బలపరీక్షలో గెలవడం కష్టమే. జగన్ ఎమ్మెల్యేలపై వేటు వేస్తే ఓ సమస్య... వేటు వేయకపోతే మరో సమస్య. చెప్పాలంటే ఇరకాటంలో పడి ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతోంది కాంగ్రెస్ అధిష్టానం. అందుకే, పార్టీ నిర్ణయాన్ని యధేచ్చగా ఎమ్మెల్యేలు ధిక్కరిస్తున్నా చూస్తూనే ఉండిపోతోంది.
తెలంగాణ తలనొప్పి
కాంగ్రెస్ హైకమాండ్‌కు ఓ వైపు నుంచి జగన్ సెగ తగులుతుంటే .. మరో వైపు నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలు తలనొప్పిని తెచ్చిపెడుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో విబేధించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోరాటమే మార్గమనుకుంటున్నారు. అందుకే భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలతో తీవ్రంగా చర్చించారు. సమావేశంలో కాస్త గందరగోళం నెలకొన్నప్పటికీ, తెలంగాణ సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఎక్కువమంది మొగ్గు చూపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లును పెట్టకపోతే రాజీనామాలకు సిద్ధమంటూ మంత్రి జూపల్లి ఇప్పటికే ప్రకటించడం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది.
అయితే.. రాజీనామాల విషయంలో మాత్రం కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. త్యాగాలు వృధా కాకూడదంటే కనీసం 35 మంది ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందేనంటున్నారు. అంతమంది సిద్ధపడకపోతే ఎవరూ రాజీనామా చేయకపోవచ్చు. మరోవైపు కేకే అండ్ టీం.. జగన్ వర్గంతోనూ చర్చలు సాగిస్తుందన్న వార్తలు కాంగ్రెస్‌లో జోరుగా సాగుతున్నాయి. తెలంగాణలో పదిమంది ఎమ్మెల్యేల దాకా జగన్‌వైపు మొగ్గుచూపుతుండడంతో, ప్రభుత్వాన్ని పడగొట్టాల్సి వస్తే ఆయన సహాయాన్ని కూడా తీసుకోవచ్చు.
అటు జగన్ వైపు నుంచి చూసినా.. ఇటు తెలంగాణ నేతల నుంచి చూసినా రాజీనామాల ముప్పు కిరణ్ సర్కార్‌కు పొంచి ఉంది. రెండు వర్గాలు ఏకమైతే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమే. అందుకే రాజకీయంగా రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత క్లిష్టపరిస్థితి ఇప్పుడు ఉందంటున్నారు విశ్లేషకులు. అయితే.. తెలంగాణ నేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకొంటోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై బుధవారం తెలంగాణ ప్రాంత ఎంపీలతో ప్రత్యేకంగా చర్చించనుంది. ఇక జగన్ విషయంలో హాజరైన ఎమ్మెల్యేలపైనా ఓ కన్నేసింది.
ధైర్యం ఉంటే..
తాను జెంటిల్‌మెన్‌ను కావడం వల్లే ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు కిరణ్ సర్కార్‌కు ఇబ్బందికరంగా మారాయి. తాము ఎవరి దయాదాక్షిణ్యాలపైనా ఆధారపడి లేమంటూ మంత్రి డీఎల్ స్పష్టమైన ప్రకటన చేశారు. ధైర్యం ఉంటే రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ సవాల్ చేసారు. 2014 దాకా ఆగి తన వారికి టికెట్లు ఇచ్చేకన్నా, ఇప్పుడే ప్రభుత్వాన్ని పడగొట్టి ఎన్నికల్లో పోటీ చేయమని జగన్‌కు డీఎల్ సలహా ఇస్తున్నారు. మరి దీన్ని జగన్ వర్గం ఎలా తీసుకుంటుందన్నది ఆసక్తికరం. సోనియమ్మ ఆజ్ఞలకు లొంగేది లేదన్న విషయాన్ని ఢిల్లీ దీక్షకు హాజరవడం ద్వారా కుండబద్దలు కొట్టి చెప్పారు జగన్ వర్గం ఎమ్మెల్యేలు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం తొందరపడ్డా.. ఎవరిపై వేటు వేయాలనుకున్నా అది ప్రభుత్వానికి ముప్పు కొని తెచ్చుకోవడమే అవుతుంది. మరి ఆ సాహసాన్ని కాంగ్రెస్ చేయగలదా..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి