20, ఏప్రిల్ 2010, మంగళవారం
తెలుగు సినిమా బడ్జెట్ కట్...
Categories :
అవును, తెలుగుసినిమా బడ్జెట్ తగ్గించుకోవడానికి నిర్మాతలు కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా మంగళవారం రోజు సమావేశమయ్యారు. హీరోల రెమ్యునరేషన్ తగ్గించడం దగ్గర నుంచి.. ప్రతీదానిపైనా సమాలోచనలు జరిపారు. అసలు ఈ బడ్జెట్ ఎందుకు పెరుగుతోంది.. బడ్జెట్ తగ్గించడం సాధ్యమా.. సినిమాకు హీరోలు వసూలు చేసేదెంత? విశ్లేషణాత్మక కథనం..
దక్షిణాదిన విపరీతమైన క్రేజ్ ఉంది తెలుగు సినిమాలకే. ఇతర భాషలతో పోల్చితే.. ఎక్కువ సినిమాలు ప్రతీఏటా రూపుదిద్దుకునేది మన తెలుగు ఇండస్ట్రీలోనే. లైట్ బాయ్‌ల దగ్గర నుంచి ల్యాబ్ ప్రొడ్యూసర్ల దాకా.. వేలాది మంది మన ఇండస్ట్రీని ఆధారం చేసుకుని జీవితాలు గడుపుతున్నారు. అయితే.. ఈ సినిమా వ్యాపారం మాత్రం ఇటీవల కాలంలో జూదంగా మారిపోయింది. ప్రతీఏటా చిన్న చిన్న వాటి నుంచి పెద్ద సినిమాల వరకూ ఎన్నో విడుదలవుతున్నా.. అందులో సక్సెస్ చవిచూస్తున్నవి మాత్రం ఒకటో రెండో.. . సినిమాలు తీస్తున్న వంద మంది నిర్మాతల్లో ఇద్దరికి మాత్రమే నిజంగా లాభాలు దక్కుతున్నాయి. మిగిలిన 98 మందీ సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటూనే ఉన్నారు. సినిమా స్టోరీ బాలేదనో... సరిగ్గా తీయలేదనో.. స్క్రీన్‌ప్లే పండలేదనో.. ఇలా ఎన్నో కారణాలు సినిమా ఫ్లాప్ అవ్వడానికి చెప్పుకోవచ్చు. కానీ.. నష్టం ఎక్కువగా రావడానికి మాత్రం ఒకే ఒక్క కారణం ఉంది. అదే ప్రొడక్షన్ కాస్ట్. కోటి రూపాయలతో అవ్వాల్సిన దానికి పదికోట్లు ఖర్చు పెట్టడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతోంది.
ఖర్చెందుకు పెరుగుతోంది?
సినిమా నిర్మాణంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫుటేజ్ గురించే. సినిమా తీయడానికి ఎంత రీల్‌ను వాడుతున్నారన్నదానిపైనే సినిమా బడ్జెట్ ఆధారపడి ఉంటుంది. రెండు నుంచి రెండున్నర గంటల సినిమాకు గరిష్టంగా 14 వేల అడుగుల ఫిల్మ్ ఉంటుంది. ఒకటికి రెండు మూడు టేక్‌లు తీసుకోవడం.. రిపీటెడ్ షాట్లు తీయాల్సి రావడం వల్ల.. దీనికి కనీసం 4 రెట్లు ఎక్కువ ఫిల్మ్‌ను వాడాల్సి ఉంటుంది. అంటే.. 56 వేల అడుగుల ఫూటేజ్ అన్నమాట. సినిమా రీల్ క్యాన్‌లో 400 అడుగుల ఫిల్మ్ ఉంటుంది. దీనిధర 11 వేల రూపాయలు. 56 వేల అడుగుల చొప్పున లెక్కిస్తే.. ఒక్కో సినిమాకు 140 క్యాన్లు అవసరమవుతుంది. దీనికోసం నిర్మాత.. 15 లక్షల 40 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంకా సినిమా అవసరాన్ని బట్టి.. ఈ క్యాన్లు మరో పదీ ఇరవై వరకూ పెరగవచ్చు. కానీ.. మన టాలీవుడ్లో పేరుమోసిన దర్శకులకు.. ఈ 60 వేల ఫుటేజ్ ఒక లెక్కే కాదు. ఇంత ఇచ్చినా.. కనీసం గంట సినిమా కూడా తీయలేరు. ఒక్కో సినిమా పూర్తి కావడానికి వీరికి ఎంతలేదన్నా.. 400 నుంచి 500 క్యాన్లు కావాల్సిందే. అంటే ఒక్క రీల్ కోసమే 55 లక్షల రూపాయలను ఖర్చు చేస్తారన్నమాట. ఇలా ఫుటేజ్ మీదే.. దాదాపు 40 లక్షల రూపాయలను అదనంగా నిర్మాతల చేత దర్శకులు ఖర్చు పెట్టిస్తున్నారు.
అయితే.. దీన్ని ఫుటేజ్ వరకే చూడడానికి లేదు. ఈ ఫుటేజ్ ఎఫెక్ట్ ప్రతీదానిపైనా పడుతుంది. ఫుటేజ్ ఎక్కువయ్యే కొద్దీ.. షూటింగ్ షెడ్యూల్ పెరిగిపోతుంది. రెండు మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకోవాల్సిన సినిమా కాస్తా.. రెండేళ్ల సమయం తీసుకుంటుంది. దీనికి తగ్గట్లుగా స్టార్స్ డేట్స్‌నూ పెంచుకోవాల్సి ఉంటుంది. స్టార్ హీరోలకు, హీరోయిన్లకూ ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కామెడీ యాక్టర్ల సంగతైతే చెప్పక్కరలేదు. సినిమా మొత్తానికి ఇంతంటూ నిర్దిష్టంగా వారికి చెల్లింపులు ఉండవు. రోజుకు లక్ష నుంచి మూడు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. సినిమా షూటింగ్ ఎన్నిరోజులు జరిగితే దానికి తగ్గట్లుగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక షూటింగ్ పనిచేసే బాయ్ దగ్గర నుంచి దర్శకుల దగ్గర దాకా మ్యాన్‌పవర్ వినియోగం ఎక్కువవుతుంది. సినిమా ఎక్విప్‌మెంట్‌నూ ఎక్కువ రోజులు వాడుకోవాల్సి ఉంటుంది. అంటే..వీటన్నింటికీ అద్దెలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు... ఫుటేజ్ ఎంత ఎక్కువైతే.. ఎడిటింగ్ అంత ఆలస్యమవుతుంది. స్టూడియో ఖర్చులూ పెరిగిపోతాయి. సినిమాలో ఇరికించలేక ఎన్నో సీన్లను దర్శకులు పక్కన పెట్టాయాల్సి వస్తుంది. దీన్ని మన డైరెక్టర్లు గొప్ప విషయం అనుకుంటారు కానీ... దానివల్ల.. ఎంత డబ్బు వృథానో అర్థం చేసుకోలేకపోతున్నారు. చిన్న నిర్మాతలకే కాదు.. పెద్ద పెద్ద నిర్మాతలకూ ఈ ఫూటేజ్‌ను ఎక్కువగా వాడడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. పైగా.. సినిమాలో క్వాలిటీ కూడా లాస్ అవుతోంది. అంతిమంగా నిర్మాత జేబుకు పడేది చిల్లే.
హీరోల వసూళ్లెంత?
సినిమా బాగా రావాలంటే ఏం చేయాలి..? మన తెలుగు నిర్మాతలకు తెలిసిన మంత్రం ఒక్కటే ... ఖర్చు పెట్టాలి. కోట్లు కుమ్మరించాలి. స్టార్ హీరోలను యాక్ట్ చేయించాలి. మరి మన స్టార్ల విషయానికి వస్తే.. ఒక్క సినిమాలో నటించాలంటే.. కోట్లల్లోనే చెల్లించాలి. యంగ్‌స్టార్స్‌లో అల్లు అర్జున్ 3 నుంచి 4 కోట్లు.. మగధీరతో బంపర్ హిట్ కొట్టిన రామ్‌చరణ్‌తేజ కాల్షీట్లు కావాలంటే.. కనీసం 4 కోట్లు చెల్లించాలి. అదే మహేశ్‌బాబు నటించాలంటే 5 కోట్లు ఇవ్వాల్సిందే. నందమూరి హీరో ఎన్టీఆర్ కూడా ప్రతీ సినిమాకు 5 కోట్లు తీసుకుంటున్నాడు. ప్రభాస్ రేటు ప్రస్తుతం 3 కోట్లకు అటూ ఇటూగా ఉంది. ఇక బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జునల రెమ్యునరేషన్ .. మూడు నుంచి 5 కోట్ల మధ్య పలుకుతోంది. ఇక డైరెక్టర్ల విషయానికి వస్తే.. దాదాపు పేరున్నవారంతా.. రెండు నుంచి రెండున్నర కోట్లు ఒక్కో సినిమాకు తీసుకుంటున్నారు. వీరుకాక.. హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు.. ఇలా ఎంతోమంది నిర్మాతల డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇలా పెరుగుతున్న బడ్జెట్‌ను కట్ చేయడానికి తెలుగు సినీ ఇండస్ట్రీ తొలిసారిగా కదిలింది. నిర్మాణ ఖర్చులను ఎలా తగ్గించుకోవాలనేదానిపై చర్చించింది. సినిమా బడ్జెట్‌ను ప్రభావితం చేస్తున్న హీరోల రెమ్యునరేషన్ తగ్గించాలని అభిప్రాయపడింది. దీంతో పాటు.. అనవసర ఖర్చును తగ్గించే కీలక నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకున్నారు. అందులో.. స్టూడియోల్లోకి మేకప్కోసం వాడే కార్‌వ్యాన్‌లను అనుమతించకపోవడం, ఆర్టిస్టులకు పర్సనల్ అసిస్టెంట్లపై పరిమితి విధించడం, ఆర్టిస్టులకు ఉపయోగించే వాహనాల సంఖ్యను కుదించడం, షూటింగ్ చేసే రోజుల సంఖ్యను తగ్గించడంపై దృష్టిపెట్టాలనుకొంటోంది. నెగిటివ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని నిర్మాతల మండలి భావిస్తోంది. చిన్న సినిమాలకైతే.. 60 వేల అడుగులు, పెద్ద సినిమాలైతే.. లక్షన్నర అడుగులకు మించి నెగిటివ్‌ను వాడకూడదని భావిస్తున్నారు. సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాతలు చాలా ఆలస్యంగా మేల్కొన్నారన్న అభిప్రాయమే చాలామందిలో వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా సినిమా ఖర్చు తగ్గించుకోకపోతే.. తెలుగు ఇండస్ట్రీకి కష్టకాలమే ఎదురయ్యే ప్రమాదం ఉంది.
అయితే.. ఖర్చు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టిన నిర్మాతలే భారీబడ్జెట్ సినిమాలకు ప్లాన్ వేస్తున్నారు. అల్లు అర్జున్న హీరోగా.. ఆయన తండ్రి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. బద్రీనాథ్ సినిమా తీయడానికి రెడీ అయ్యారు. దీనిఖర్చు మగధీర సినిమాకు పెట్టిన దానికన్నా ఎక్కువ.. అంటే.. దాదాపు 45 కోట్ల పైమాటే. మరి ఇలా పెంచుకుంటూ పోతూనే.. బడ్జెట్ తగ్గించుకోవాలనుకోవడం ఆచరణలో సాధ్యమవుతుందా.. ఇదే ఇప్పుడు అసలు డౌట్.
మనవాళ్లకు ఆదర్శం
మన నిర్మాతలకు ఆదర్శం మలయాళ సినిమానే. మలయాళ చిత్ర సీమ నుంచి ఎన్నో జాతీయ ఉత్తమ చిత్రాలు ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. గొప్పగొప్ప నటులు మలయాళ సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం అయ్యారు. అయితే.. ఇటీవలి కాలంలో సినిమాల ప్రొడక్షన్ ఖర్చు ఎక్కువగా పెరిగిపోయింది. మోహన్‌లాల్ లాంటి స్టార్ హీరోల నటిస్తున్నసినిమాకు అక్కడవుతున్న ఖర్చు మూడున్నర కోట్ల రూపాయలే. ఇందులో దాదాపు కోటి రూపాయలు హీరోగారి రెమ్యునరేషనే ఉంటుంది. ఇదీ చాలా ఎక్కువే అంటున్నారు మలయాళ నిర్మాతలు. దీన్ని తగ్గించుకోవాలంటూ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఆర్టిస్ట్ అసోయేషన్ ఇందుకు అంగీకరించకపోవడంతో.. ఏప్రిల్ 16 నుంచి కొత్త సినిమాల నిర్మాణాన్నే ఆపేశారు.
అనవసర ఖర్చును వీలైనంత తగ్గించుకోవడంలో మలయాళ చిత్రసీమది ముందునుంచి మొదటిస్థానమే. అయినా.. ఇటీవలే.. మమ్ముట్టి హీరోగా 32 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పళసిరాజా సినిమా నిర్మించారు. ఈ సినిమా దెబ్బకు.. అక్కడి ప్రొడ్యూసర్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమా కాస్ట్ మూడున్నర కోట్లు దాటకూడదని నిబంధన విధించారు. వీలైతే కోటి రూపాయల్లోనే సినిమా పూర్తి చేయాలన్నది వారి ప్లాన్. ఆర్టిస్టుల సంఖ్యను కూడా 150 నుంచి 80కి తగ్గించారు. షూటింగ్ కూడా 45 రోజులకు మించకూడదని తీర్మానించారు. 60 వేల అడుగుల కన్నా ఎక్కువ ఫిల్మ్నూ డైరెక్టర్లు వాడకూడదు. ఇలా ఎన్నో కండిషన్స్ పెట్టుకున్నారు. పరిశ్రమలోని అన్ని వర్గాలు సహకరిస్తే.. ఎవరూ నష్టపోరన్నది మలయాళ నిర్మాతల ఆశ. అందుకే.. సినిమా నిర్మాణాన్ని ఆపేయడానికీ వెనుకాడడం లేదు. మలయాళ సినీ నిర్మాతలను చూసి పాఠం నేర్చుకున్నారు మన తెలుగు ప్రొడ్యూసర్లు. అందుకే.. ఆలస్యమైనా ముందుకు కదులుతున్నారు. అయితే.. సినిమా బడ్జెట్‌కు లిమిట్ ఎంత పెడతారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మంచి లోతైన వ్యాసం. అభినందనలు.