28, జనవరి 2010, గురువారం
అవతార దర్శకుడు
స్టోరీ పాతదే. కాకపోతే కాస్త మార్పు. భూమి మీద ఉండే అడవుల నుంచి ఇతర గ్రహాలకు వెళ్లింది. టాలీవుడ్‌కు బదులు అది హాలీవుడ్. కాకపోతే.. డైరెక్టర్ మాత్రం జేమ్స్ కేమరూన్. అంతే.. హాలీవుడ్ సినిమాల్లో అదో ట్రెండ్ సెట్టర్ అయ్యింది.. రికార్డులు తిరగరాస్తోంది. ఎప్పుడో పుష్కరకాలం క్రితం టైటానిక్ సినిమా నెలకొల్పిన అత్యధిక కలెక్షన్ల రికార్డును.. కేవలం నెలరోజుల్లోనే అధిగమించి.. చరిత్ర సృష్టించింది. హలీవుడ్లో ఎన్నో సంచలనాలు సృష్టించిన కేమరూన్.. అవతార్‌తో తన మార్కును మరోసారి చూపించాడు.
కలల్లో కూడా కనిపించని ఊహకు అద్భుత రూపమిచ్చి.. దృశ్యంగా అందరి ముందుకు తెస్తే.. అది కచ్చితంగా అవతార్ సినిమానే అవుతుంది. ఎవరూ ఊహించని పాత్రలు.. మరెవ్వరూ తీయలేని ఎఫెక్టులు.. భారీ టెక్నాలజీ.. భారీ బడ్జెట్లో సైన్స్ ఫిక్షన్ మూవీ అవతార్‌ను సిద్ధం చేశాడు.. డైరెక్టర్ జేమ్స్ కేమరూన్. విడుదలైన మొదటి రోజు నుంచే.. రికార్డులు సృష్టిస్తున్న.. కేమరూన్ అద్భుత సృష్టి.. ఇప్పుడు కలెక్షన్లలో ప్రపంచ చిత్రరాజంగా నిలిచింది. వల్డ్ వైడ్‌గా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు నెలకొల్పింది. 1997లో విడుదలైన టైటానిక్ సినిమా సాధించిన 1.843 బిలియన్ డాలర్ల వసూళ్లను.. రెండు నెలలు దాటకుండానే అధిగమిచింది అవతార్ మూవీ.
అత్యధిక కలెక్షన్ల రికార్డును సృష్టించడానికి టైటానిక్ సినిమాకు దాదాపు ఏడు నెలల సమయం పట్టింది. ట్వంటీయత్ ఫాక్స్ సెంచరీ నిర్మించిన అవతార్ మాత్రం కేవలం ఆరు వారాల్లోనే టైటానిక్ రికార్డులను ముంచేసింది. డిఫరెంట్ స్టోరీ.. అంతకన్నా డిఫరెంట్ పిక్చరైజేషన్ వెరసి.. ఆడియన్స్‌లో అవతార్‌కు విపరీతమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. విడుదలకు ముందే ఎంతో సెన్షేషన్ సృష్టించిన ఈ సినిమా.. తాజా రికార్డులతో తనకు తిరుగులేదని నిరూపించుకొంది. డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ ప్రతిభకు నిదర్శనం ఈ సినిమా విజయం.
ఈ సినిమా చిత్రీకరించిన విధానమే.. పబ్లిక్‌లో ఇంత హైప్ రావడానికి కారణమంటున్నారు సినీ పండితులు. త్రీడీ టెక్నాలజీ వాడడం.. హైటెక్ ఎఫెక్ట్స్‌ను ఉపయోగించడంతో.. ఈ సినిమా చూడాలన్న తపన అందరిలోనూ పెరిగిపోయింది. అయితే.. టికెట్ ధరలు ఎక్కువగా ఉండడంవల్లే ఈ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయని కొంతమంది వాదిస్తున్నారు. అయినా.. ఇటీవలికాలంలో మరే సినిమాకు ఈ స్థాయిలో దక్కకపోవడాన్ని చూస్తే... అవతార్ ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. దాదాపు 2 బిలియన్ డాలర్ల వసూళ్లను త్వరలోనే అవతార్ అధిగమించేసినా ఆశ్చర్యపోనక్కరలేదంటున్నారు హాలీవుడ్ పండితులు. అంటే దాదాపు.. 9600 కోట్ల రూపాయల వసూళ్లన్నమాట.
పూర్తిస్థాయి త్రీడీ టెక్నాలజీలో తీసిన అవతార్‌కు ఇప్పటికే ఉత్తమ దర్శకుడు, గ్రాఫిక్స్, ఆడియో మిక్సింగ్ విభాగాల్లో గ్రామీ అవార్డులు దక్కాయి. ఓ రకంగా టెక్నాలజీ పరంగా చూస్తే.. హాలీవుడ్లో ఇది ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. అవతార్ దెబ్బకు.. వార్నర్ బ్రదర్స్ సంస్థ.. తన చిత్రాలను కూడా పూర్తిగా త్రీడీ టెక్నాలజీలోనే తీయాలని డిసైడ్ అయ్యింది. మొత్తంమీద.. మరోసారి హాలీవుడ్‌ను తనదారిలోకి అవతార్ సినిమాతో తెచ్చుకుంటున్నాడు.. డైరెక్టర్ జేమ్స్ కేమరూన్.
ఎవరికైనా విజయం దక్కడం అంత సులువు కాదు. దాని వెనుక ఎంతో శ్రమ ఉండాలి. అదికూడా మంచి ఫలితాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అవతార్ విషయంలోనూ జరిగింది ఇదే. ప్రపంచంలోనే తొలిసారి సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. రూపుదిద్దుకొంది అవతార్. ఎవరైనా కథ రెడీ అవగానే సినిమా తీయడానికి రెడీ అయిపోతారు.. కానీ.. అవతార్ విషయంలో మాత్రం జేమ్స్ కేమరూన్ దాదాపు 13 ఏళ్లపాటు ఎదురుచూశాడు.. అదే ఇతర డైరెక్టర్లకు.. కేమరూన్‌కు ఉన్న తేడా...
అవతార్ సినిమా విజయం వెనుక.. కేమరూన్ ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంది. వాస్తవానికి 1994లోనే అంటే టైటానిక్ సినిమా షూటింగ్ సమయంలోనే అవతార్ సినిమా స్క్రిప్ట్ సిద్దం చేసుకున్నాడు. టైటానిక్ తర్వాత ఈ ప్రాజెక్టు చేపట్టాలని.. 1999 లో రిలీజ్ చేయాలని భావించాడు. కానీ.. తన ఊహలకు.. అంచనాలకు తగ్గట్లుగా సినిమా తీయడానికి అవసరమైన టెక్నాలజీ అప్పటికి అందుబాటులో లేదని భావించిన ఈ గ్రేట్ డైరెక్టర్... తన ప్రాజెక్టును పెండింగ్‌లో పెట్టాడు. గ్రాఫిక్స్ డిజైనింగ్‌లో అనూహ్యమార్పులు రావడంతో.. 2005లో ఈ సినిమా ప్రొడక్షన్‌కు శ్రీకారం చుట్టాడు. తాను అనుకున్నది సాధించుకోవడానికి ఇంత సుదీర్ఘకాలం వేచి ఉండగలిగాడు కాబట్టే.. అపూర్వ విజయం.. అవతార్‌కు దక్కిందని చెప్పొచ్చు.
స్పెషల్ టెక్నాలజీ
అందరూ వాడే టెక్నాలజీని.. గ్రాఫిక్స్‌ను ఉపయోగిస్తే.. తనకూ మిగిలిన వారికీ తేడా ఏముంటుందనుకున్నాడో ఏమో.. తన సినిమాకోసం ఏకంగా ఏ ప్రత్యేక టెక్నాలజీనే తయారు చేసేశాడు. హాలీవుడ్‌లోని గొప్పగొప్ప సినిమాలతో పోల్చినా.. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి భిన్నంగానే సాగింది. అంతేకాదు.. త్రీడీలో ఈ సినిమా షూటింగ్కోసం, రియాలిటీ కెమెరా సిస్టంను కేమరూనే స్వయంగా డెవలప్ చేశాడు. ఒకే కెమెరా బాడీలో రెండు హైడెఫినేషన్ కెమెరాలు ఇందులో ఉంటాయి. గ్రాఫిక్ ఎలిమెంట్స్‌ను ఉపయోగించుకుంటూ.. పూర్తిగా లైవ్ యాక్షన్‌లో సినిమాను షూట్ చేశారు. మనుషులకు సెన్సార్లను అమర్చడం ద్వారా.. కంప్యూటర్స్‌లోని గ్రాఫిక్ ఎలిమెంట్స్‌కు మూవ్మెంట్స్ ఇస్తూ.. షూటింగ్ జరిపాడు... కేమరూన్.
ఈ సినిమా కోసం దాదాపు వెయ్యిమంది గ్రాఫిక్ డిజైనర్లు పనిచేశారు. ప్రతీ ఫ్రేమ్ విషయంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకున్నాడు డైరెక్టర్ కేమరూన్. ఈ తరహాలో హాలీవుడ్‌లోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడా సినిమా తీయలేదు. అందుకే.. హాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లు స్టీవెన్ స్పీల్బర్గ్, పీటర్ జాక్సన్‌లు సైతం అవతార్ షూటింగ్ సమయంలో సెట్స్‌ను విజిట్ చేసి.. టెక్నాలజీపై అవగాహన తెచ్చుకున్నారు. అవతార్ సినిమాకు వాడిన టెక్నాలజీతో.. హైగ్రాఫికల్ సినిమాల షూటింగ్‌ను మరింత సులభతరం చేయనుంది. స్పాట్లోనే.. సినిమాలో ఓ విర్చువల్ క్యారెక్టర్ ఎలా కనిపిస్తుందన్నది డైరెక్టర్లు తెలుసుకోవచ్చు. అక్కడే మార్పులు చేర్పులూ చేసుకోవచ్చు. అంటే పోస్ట్ ప్రొడక్షన్ వరకూ ఆగనక్కరలేదన్నమాట. ఓ రకంగా.. ఫ్యూచర్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఎలా డైరెక్ట్ చేయాలో మార్గనిర్దేశం చేశాడు కేమరూన్.
ప్రతీ సినిమాకో టెక్నాలజీ
ప్రతీ సినిమానూ వెరైటీగా తీయాలి. అంతకు ముందు అలాంటి సినిమా ఉండకూడదు. టెక్నాలజీని ఎవరూ వాడకూడదు. ప్రతీది కొత్తగా ఉండాలి.. ఇదే హాలీవుడ్ అవతార దర్శకుడు.. జేమ్స్ కేమరూన్ లక్ష్యం. అందుకే.. తన సినిమాల విషయంలో ఏమాత్రం రాజీపడడు. షూటింగ్‌కు ఎంతకాలం పట్టినా.. ఎంత ఖర్చైనా .. ఏమాత్రం వెనుకడుగు వేయడు. అంతేకాదు.. ఎవరెన్ని విమర్శలు చేసినా లెక్కచేయడు. అందుకే.. తొలిసినిమా తీసిన 1981 నుంచి ఇప్పటివరకూ లెక్కపెడితే.. పూర్తిస్థాయిలో తీసిన సినిమాలు ఎనిమిది మాత్రమే. ఇందులో ఐదు సినిమాలు ఎన్నో రికార్డులను.. అవార్డులను అందిపుచ్చుకున్నాయి. ఈ సినిమాల్లో రెండు టెర్మినేటర్ సినిమాలే. 1984 కాలం నాటికే సైబోర్గ్లను సృష్టించి.. వాటికి మనిషి ఆకారాన్నిచ్చి కేమరూనే తీసిన ఈ సినిమా... ఆయనకు లైఫ్‌ను ఇవ్వడమే కాదు.. హీరో ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్‌ను హాలీవుడ్లో నిలబెట్టింది. దీని సీక్వెల్‌గా 1991లో వచ్చిన టెర్మినేటర్ 2 కూడా ఎన్నో రికార్డులను నెలకొల్పింది. టెర్నినేటర్ 2లో వాడిన ఎఫెక్ట్స్‌కి ప్రేక్షకులు హ్యాట్సాఫ్ చెప్పారు.
కేమరూన్‌కు విశ్వవ్యాప్త క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రం టైటానిక్. తన గత చిత్రాల తరహాలో ఫ్యూచర్లోకి కాకుండా.. చరిత్రలోకి వెళ్లి అపూర్వ విజయాన్ని దక్కించుకున్నాడు కేమరూన్. 16 వ శతాబ్ధంలో మునిగిపోయిన అతిపెద్ద నౌక... టైటానిక్‌ను.. అందులోని ఓ ప్రేమజంటను కథాంశంగా తీసుకొని అద్భుతమైన చిత్రంగా మలిచాడు. దీనికోసం.. రెండు రకాల షిప్స్‌ను డిజైన్ చేయించాడు. షిప్‌ను షూట్ చేసిన తర్వాత.. వాటర్, స్మోక్ ఎఫెక్ట్‌లను ప్రత్యేకంగా యాడ్ చేశారు. ఇక సినిమా అంతటికీ హైలెట్‌గా చెప్పుకోవాల్సింది... షిప్ విరిగిపోవడం గురించే. ఈ సీన్‌ను తీయడానికి ఎంతో కష్టపడ్డాడు కేమరూన్. ఎఫెక్ట్స్, మ్యూజిక్, ఎడిటింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతో.. పదకొండు ఆస్కార్ అవార్డులు.. టైటానిక్‌కు దాసోహం అన్నాయి. అవతార్ క్రాస్ చేసేవరకూ.. హయ్యెస్ట్ కలెక్షన్ల రికార్డునూ అందించాయి.
హాలీవుడ్ డైరెక్టర్లలో అందరికన్నా కేమరూన్ ముందున్నాడనడానికి నిదర్శనం.. ద అబీస్. 1989లో తీసిన ఈ సినిమాలో అప్పటివరకూ హాలీవుడ్ చరిత్రలో వాడని ఎఫెక్ట్‌లను, పిక్చరైజేషన్‌ను ఉపయోగించాడు. సముద్రగర్భంలో మునిగిపోయిన ఓ అణు జలాంతర్గామిని సురక్షితంగా తీసుకురావడానికి వెళ్లిన హీరో బృందానికి.. డీప్ సీలో ఏలియన్స్ ఎదురవుతారు. అక్కడినుంచి కథ అనూహ్య మలుపులు తిరుగుతుంది. అండర్ వాటర్ షూట్ కోసం.. ఓ భారీ సెట్‌నే డిజైన్ చేశాడు. ఇప్పుడు అవతార్‌లో వాడిన సీజీఐ టెక్నాలజీని.. అప్పట్లోనే అబీస్ సినిమాలో ఉపయోగించాడు. అయితే.. అనుకున్నంతగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది ఈ సినిమా. ఇలా సినిమా సినిమాకు.. తనకు తాను మారుతూ.. హాలీవుడ్ సినిమాల స్టైల్‌ను కూడా మార్చుతున్నాడు కేమరూన్.
సినిమాలంటే పిచ్చి
జేమ్స్ కేమరూన్ చిన్నతనంలోనే హాలీవుడ్ వైపు ఆకర్షితుడయ్యాడు. సినిమాలు చూస్తూనే పెరిగాడు. 1962లో వచ్చిన సూపర్‌హిట్ మూవీ.. కింగ్‌కాంగ్ వర్సెస్ గాడ్జిల్లాను తానైతే.. మరింత బాగా తీయగలనని అప్పట్లోనే కేమరూన్. అప్పటికతని వయస్సు తొమ్మిదేళ్లు మాత్రమే. ఆ తర్వాత సినిమాలంటే మరింత ఆసక్తి పెరిగింది. పెయింటింగ్‌లోనూ ప్రావీణ్యం ఉన్న కేమరూన్.. ఈ మధ్యలోనే పనికిరాని వస్తువులతో రాకెట్లు, విమానాలు తయారు చేసేవాడు.. విపరీతంగా ప్రయోగాలు చేసేవాడు.ఇవే తర్వాత తర్వాత.. వెరైటీ వెరైటీ సెట్లను రూపొందించడానికి కారణమయ్యాయి. అందుకే.. కేమరూన్ సినిమాల్లో సహజత్వంగానే కనిపించే సెట్లుంటాయి. ఇతర సినిమాలతో పోల్చితే.. తమ ప్రత్యేకతను చాటుకుంటాయి.
విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటున్న కేమరూన్.. వాటి నుంచే తన సినిమాలకు ఆధారమైనే అద్భుతమైన ప్రపంచాలను సృష్టించుకున్నాడు. అవే అతని ప్రత్యేకను చాటిచెబుతాయి. ఎలియన్స్, ద అబీస్, అవతార్లను చూస్తే కేమరూన్ సృజనాత్మకతను మనం అర్థం చేసుకోవచ్చు. 1977లో వచ్చిన స్టార్‌వార్స్ సినిమా.. ఈ ఫ్యూచర్ డైరెక్టర్‌ను ఎంతగానో ప్రభావితం చేసింది. అప్పటినుంచే హాలీవుడ్‌లోకి వెళ్లాలన్న తపన మరింతగా పెరిగింది. జీనోజెనిసిస్ పేరుతో ఓ 12 నిమిషాలు సైన్స్-ఫిక్షన్ షార్ట్ స్టోరీని .. 1978లో కేమరూన్ తీశాడు. ఇదే అతని తొలి ఫిల్మ్. దీనివల్లే రోజర్ కార్మన్ ప్రొడక్షన్ కంపెనీ.. న్యూ వరల్డ్ పిక్చర్స్‌లో పనిచేసే అవకాశం వచ్చింది. బాటిల్ బియాండ్ ద స్టార్‌కు 1980లో ఆర్ట్‌డైరెక్టర్‌గా పనిచేసిన కేమరూన్, ఆ మరుసటి ఏడాదికే గెలాక్సీ ఆఫ్ టెర్రర్‌కు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇదే ఏడాది పిరాన్హ టు సినిమాకు డైరెక్షన్ కూడా చేశాడు. ఇలా ఫీల్డ్‌లోకి వచ్చిన మూడేళ్లకే డైరెక్టర్ అయిపోయాడు కేమరూన్.
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు సృష్టించిన రాబో టు కి.. స్క్రిప్ట్ రైటర్ కేమరూనే. సినిమా తీయడానికి ముందే పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రాసుకోవడం.. దానికి అవసరమైన అన్ని ఎలిమెంట్లను సిద్ధం చేసుకోనే విషయంలో ఎంతో కేర్ తీసుకుంటాడు. అవతార్ సినిమాలో పాండారా అనే గ్రహాన్ని ఆవిష్కరించిన కామరూన్.. అక్కడ ఉండేవారి కోసం ఓ భాషను కూడా సృష్టించాడంటే ప్రతీ చిన్న విషయాన్ని ఎంత పెద్దదిగా ఊహిస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఇతర డైరెక్టర్లకు.. కామెరూన్ మధ్య వ్యత్యాసాన్ని చాటి చెబుతుంది.
హాలీవుడ్‌కు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్న కేమరూన్ పెద్దగా చదువుకున్నది కూడా లేదు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటిలో ఫిజిక్స్ చదవుతూ మధ్యలోనే మానేశాడు. మధ్యలో కొన్నేళ్లు ట్రక్కు డ్రైవర్‌గా కూడా పనిచేశాడు. అయితే.. న్యూవరల్డ్ పిక్చర్స్‌లో అవకాశం రావడంతో.. కేమరూన్ దశ తిరిగిపోయింది. ఇంత హిట్ డైరెక్టర్ అయినప్పటికీ.. కేమరూన్పై ఎన్నో విమర్శలున్నాయి. ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెంచేస్తాడని, సెట్లో నియంతలా వ్యవహరిస్తాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ.. సినిమా బాగా రావాలంటే.. ఆ మాత్రమన్నా అందరినీ కష్టపెట్టక తప్పదంటాడు.. కామరూన్.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Thank you so much for sharing this information. I did not know Most of the facts you mentioned here. Good work !
:)
Nice piece of information, but a small correction.Titanic sank in the first part of 20th century.