పదిహేనేళ్ల క్రితం మాట... కాంగ్రెస్ పని అయిపోయింది. ప్రాంతీయ పార్టీల స్థాయికి పడిపోయింది.. కానీ.. ఇప్పుడు మాత్రం.. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రాజకీయపార్టీ. లోక్‌సభలో ఎక్కువ స్థానాలున్న ఏకైక పార్టీ.. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీ. రోజురోజుకూ బలంపెంచుకొంటూ.. అన్ని రాజకీయపార్టీలకు సవాల్ విసురుతోంది కాంగ్రెస్ పార్టీ. 124 ఏళ్లు పూర్తి చేసుకొని.. 125 పడిలోకి ప్రవేశించింది.. అందుకే దేశవ్యాప్తంగా ఘనంగా సంబరాలు చేసుకొంటోంది. కాంగ్రెస్ చరిత్రలోకి ఒక్కసారి తొంగిచూస్తే...
పురాతన పార్టీ
భారతదేశంలో ఉన్న రాజకీయపార్టీల్లో.. అత్యంత పురాతన పార్టీ కాంగ్రెస్ పార్టీనే. భారతీయలను ఏకం చేయడానికి.. బ్రిటిష్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి.. సమస్యల పరిష్కరించుకోవడం కోసం.. తొలిసారిగా.. భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ ఏర్పడింది. 1885లో బొంబాయిలో తొలి సమావేశం జరిగింది. ఎ.ఓ.హ్యూమ్, దాదాబాయ్ నౌరోజి, ఉమేష్‌చంద్ర బెనర్జీతో పాటు మరికొంతమంది కలిసి.. ఈ సంస్థను ఏర్పాటు చేశారు. బ్రిటీష్ ప్రభుత్వానికి అనుకూలంగానే కార్యకలాపాలు మొదలైనప్పటికీ.. కొంతకాలానికే.. పరిస్థితిలో మార్పు వచ్చింది. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం ఉధృతమయ్యింది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాటం సాగించడంలోనూ.. ఆ తర్వాత స్వాతంత్ర్యసంగ్రామంలోనూ.. కీలక భూమిక పోషించింది.. కాంగ్రెస్. ముఖ్యంగా దేశంలోని ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే. జాతిపిత మహాత్మాగాంధీ కూడా కాంగ్రెస్ నేతృత్వంలోనే.. తన సత్యాగ్రహాన్ని కొనసాగించారు. బ్రిటీష్ పాలకులపై తిరగబడ్డారు. కేవలం నాయకులు మాత్రమే కాక.. ప్రజలను కూడా భాగస్వామ్యులను చేస్తూ.. ఎన్నో ఉద్యమాలను నిర్మించింది కాంగ్రెస్. అన్నీ అహింసా ఉద్యమాలే. ఎన్నో సంస్థలు.. మరెన్నో పార్టీలు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించింది కాంగ్రెస్ మాత్రమే. అందుకే.. తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా దక్కించుకొంది. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా.. స్వతంత్ర పాలన మొదలయ్యింది. ఉద్యమ పార్టీ నేపథ్యం నుంచి పూర్తిస్థాయి రాజకీయపార్టీగా మారిన కాంగ్రెస్‌కు దేశంలో.. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎక్కడా ఎదురులేదు. కానీ ఆ తర్వాతే సమస్యలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అధిపత్యానికి బీటలు వారడం మొదలయ్యింది.
విజయ రహస్యం
భారతదేశ ప్రజలను దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని.. చాలామంది నమ్మకం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా కాలం పాటు.. ఈ ప్రభావం ప్రజల్లో ఉండిపోయింది. అందుకే.. దేశంలో అన్నిచోట్లా కాంగ్రెస్ పార్టీకి నీరాజనం పట్టారు. ఒకటి రెండు చోట్ల లెఫ్ట్ పార్టీల ప్రభావం ఉన్నప్పటికీ.. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం.. కాంగ్రెస్‌దే హవా. రాజకీయపార్టీలు కూడా ఎన్నో ఉన్నా.. పూర్తిస్థాయిలో ప్రభావాన్ని మాత్రం చూపించలేకపోయాయి. ఇలా దేశరాజకీయాల్లో ఏకఛత్రాధిపత్యం వహించడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో మొదటిది మాత్రం.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రభావమే. మేధావిగా.. సామ్యవాదభావాలున్న నేతగా అప్పటికే పేరున్న నెహ్రూ నాయకత్వం వల్లే కాంగ్రెస్‌కు ఎక్కువగా విజయాలు దక్కాయి. ఇక ఢిల్లీ నుంచి గల్లీ దాకా... కాంగ్రెస్ పార్టీకి ఉన్న పటిష్టమైన క్యాడర్ కూడా ఈ విజయాలు దక్కడానికి కారణమే. పార్టీలో నేతలను ఎన్నుకోవడానికి అంతర్గతంగా జరిగే ఎన్నికలతో.. ప్రజల్లో కాంగ్రెస్‌పై అనంతమైన విశ్వాసాన్ని కలిగించాయి. అందుకే.. నెహ్రూ 17 ఏళ్లపాటు తిరుగులేకుండా పరిపాలించగలిగారు.
పతనానికి నాంది
నెహ్రూ మరణం తర్వాత లాల్‌బహదూర్‌శాస్త్రి ఏడాదిన్నరపాటు పదవిలో కొనసాగారు. ఆయన కూడా పదవిలో ఉండగానే.. చనిపోవడంతో.. 1966లో ఇందిరకు ప్రధాని పదవి దక్కింది. అప్పటి నుంచే కాంగ్రెస్‌పార్టీకి సమస్యలు మొదలయ్యాయి. ఇందిర ఎంపిక విషయంలోనే.. పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఇందిరతోనే.. కాంగ్రెస్‌పార్టీలో మరోశకం ప్రారంభమయ్యిందని కూడా చెప్పొచ్చు. 1967లో జరిగిన సాధారణ ఎన్నికల్లో .. కాంగ్రెస్ పార్టీ బొటాబొటీ మెజార్టీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాదాపు 78 సిట్టింగ్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోవాల్సి వచ్చింది. దేశంలో అప్పటికి ఉన్న 16 రాష్ట్రాల్లో.. ఆరింట అధికారం కూడా దూరమయ్యింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. కాంగ్రెస్‌కి తొలి దెబ్బ ఇది. 1969లో ఇందిర విధానాలు నచ్చక.. కాంగ్రెస్ తొలిసారిగా చీలిపోయింది. ఇందిరను ప్రధాని పదవినుంచి తప్పించడానికి ప్రయత్నించినా.. ఎక్కువమంది ఎంపీలు ఆమెకే మద్దతు పలకడంతో.. అది సాధ్యం కాలేదు. 1971లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన.. ఇందిరాగాంధీ.. గరీభీ హటావో నినాదాన్ని ఇచ్చి.. ప్రజలకు దగ్గరయ్యింది. ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ ఆర్... 352 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే.. ఈ విజయం తర్వాత.. ఇందిర తీరులో మరింత మార్పు వచ్చింది. పార్టీలో అంతర్గత ఎన్నికలకు స్వస్తి పలికి.. కీలకమైన పదవుల్లో.. తనకు ఇష్టమైన వారిని నియమించడం మొదలుపెట్టింది. ఇది పార్టీలో విభేదాలకు దారి తీసింది. పరిపాలనలోనూ.. ఆమె విధానాలు నచ్చక.. జయప్రకాశ్ నారాయణ్.. దేశవ్యాప్త పోరాటం మొదలుపెట్టారు. దీనికి తోడు.. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ.. ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో.. దేశంలో ఎమర్జెన్సీ విధించారు.. ఇందిరగాంధీ. కాంగ్రెస్ చరిత్రలో ఇదో మాయని మచ్చ. దాని ప్రభావంతో.. 1977లో జరిగిన ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు 30 ఏళ్లపాటు ఎదురులేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. జాతీయ ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయింది. మెరార్జీదేశాయ్ ప్రధానిగా.. జనతాపార్టీ.. కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కాంగ్రెస్ పార్టీలో మరో చీలిక వచ్చింది. ఇందిర నేతృత్వంలో.. కాంగ్రెస్ ఐ ఏర్పడింది. అయితే.. జనతా ప్రభుత్వంలో అస్థిరత కారణంగా.. మూడేళ్లకే మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి 353 సీట్లను గెలుచుకొని.. ఇందిర తన స్థానాన్ని సుస్థిరం చేసుకొంది. అయితే.. కాంగ్రెస్ కష్టాలు ఇక్కడితో అయిపోలేదు.. ఆ తర్వాత వెంటాడాయి. ఇందిర హత్యతో రాజీవ్‌గాంధీ.. బాధ్యతలను తీసుకున్నారు. రాజీవ్ ఐదేళ్లపాటు ప్రధానిగా పనిచేసిన తర్వాత.. మళ్లీ అధికారం దూరమయ్యింది. లోక్‌సభలో సంపూర్ణ మెజార్టీ లేకపోవడంతో.. ప్రతిపక్షానికే కాంగ్రెస్ పరిమితమయ్యింది. జనతాదళ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. 1991 ఎన్నికల సమయంలో రాజీవ్‌గాంధీ చనిపోవడంతో.. ఆ సింపతీ పనిచేసింది. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పీవీ నర్సింహారావు ప్రధాని కాగలిగారు. అప్పుడే.. దేశంలో సంస్కరణలు అమలు చేయడం మొదలయ్యింది. పూర్తిస్థాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం అదే చివరి సారి.
రాష్ట్రాల్లో తగ్గిన హవా..
పీవీ సర్కార్ కాలపరిమితి ముగిసే నాటికి దేశరాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా తగ్గిపోయింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో.. 1989 తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. పైగా బాబ్రీ విధ్వంసం పాపాన్ని పీవీసర్కార్ మూటగట్టుకోవాల్సి వచ్చింది. రాష్ట్రాల్లో చాలావరకూ అధికారాన్ని ఈ సమయంలోనే.. కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. 1994లో కర్నాటకలో జనతాదళ్, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగాయి. 1995లో మహారాష్ట్రలో తొలిసారి బిజేపీ,శివసేన ప్రభుత్వం ఏర్పడగా.. కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితమయ్యింది. ఇదే ఏడాది గుజరాత్‌లోనూ బిజేపీ సర్కార్ కొలువుతీరింది. 1993లో రాష్ట్రస్థాయిని పొందిన ఢిల్లీలో తొలి ప్రభుత్వాన్ని బిజేపీ ఏర్పాటు చేయగలిగింది. 1996 ఎన్నికల్లో అస్సాంలో కాంగ్రెస్ పార్టీ పరాజయం చవిచూసింది. 1967 తర్వాత తమిళనాడులోను, 1977 తర్వాత పశ్చిమబెంగాల్‌లో, 1990 తర్వాత బీహార్‌లోనూ.. కాంగ్రెస్ పార్టీ మళ్లీ విజయాన్ని దక్కించుకోలేకపోయింది.. దీనికితోడు.. 1996 సాధారణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సోనియా గాంధీ పగ్గాలు చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ దయనీయ పరిస్థితి ఇది. రాజీవ్‌గాంధీ మరణం తర్వాత.. గ్రూపులు, కుమ్ములాటలతో పార్టీ రోజురోజుకూ దిగజారిపోయింది. పార్టీని బతికించడానికి.. పగ్గాలు చేపట్టాలంటూ సోనియాగాంధీపై ఒత్తిడి పెరగడంతో.. ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. సోనియా రాకతోనే పార్టీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోలేదు. చాలాకాలం కష్టపడాల్సి వచ్చింది.
మార్పు మొదలు
సంకీర్ణ రాజకీయాలను బాగా అర్థం చేసుకున్న సోనియా.. ఆ దిశలోనే పావులు కదిపారు. అయినా.. 1998,99 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ విజయాన్ని దక్కించుకోలేకపోయింది. అయితే.. 2004 ఎన్నికల సమయానికి మాత్రం పరిస్థితి మారింది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలతో జట్టుకట్టిన సోనియా.. కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించగలిగారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. పదేళ్లపాటు ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్.. సంకీర్ణ శకంలో పద్దతి మార్చుకొని.. ప్రధాని పీఠాన్ని 2004 నుంచి వరసగా రెండుసార్లు దక్కించుకోలగింది.
రాష్ట్రాల్లోనూ ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రాభవం మళ్లీ పెరగడం మొదలయ్యింది. బిజేపీ చేతి నుంచి రాజస్థాన్‌ను కాంగ్రెస్ మళ్లీ సాధించింది. 2005లో హర్యానాను దక్కించుకున్న కాంగ్రెస్.. 2009లోనూ అధికారాన్ని నిలబెట్టుకొంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. కాంగ్రెస్ హవా కొనసాగింది. గోవా, మణిపూర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కూడా.. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ.. పార్టీని బలోపేతం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఎలాగైనా పునర్వైభవాన్ని తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాహుల్ శ్రమ ఫలితంగానే.. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో.. 21 స్థానాలను కాంగ్రెస్ దక్కించుకోగలిగింది. కాంగ్రెస్‌కు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న మధ్యప్రదేశ్‌ను మళ్లీ దక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకే.. బుందేల్‌ఖండ్‌ను తెరపైకి తెస్తోంది. యువరాజు రాహుల్‌ద్వారా.. ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ అందేలా చేసి.. పేదప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాలనుకొంటోంది. ముఖ్యంగా.. రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలన్నది సోనియా ప్లాన్. ఈ విషయంలో ఇప్పటివరకూ సక్సెస్ అయ్యారనడానికి.. ఇంతవరకూ సాధించిన విజయాలో కారణం. అయితే.. గతంతో పోల్చితే... కాస్త మెరుగే అయినా.. పూర్తిస్థాయిలో పునర్వైభవాన్ని మాత్రం కాంగ్రెస్ ఇంకా దక్కించుకోలేదు.
టార్గెట్స్..
కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ టార్గెట్.. పశ్చిమబెంగాల్. అక్కడి లెఫ్ట్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని క్యాష్ చేసుకోవడానికి తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి.. ప్రణాళికలను రచిస్తోంది. తమిళనాడులో డీఎంకేతో స్నేహబంధం కొనసాగిస్తూనే.. సొంతగా బలం పెంచుకునే యత్నాలు మొదలుపెట్టింది. ఇక్కడ కూడా అంచనాలు ఫలిస్తే.. మళ్లీ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓ వెలుగు వెలగడం ఖాయం. ప్రస్తుతం నాయకత్వం విషయంలో కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలు లేవు కాబట్టి.. కాంగ్రెస్ బలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
28, డిసెంబర్ 2009, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
The present congress doesn't deserve any credit.
Everybody including Gandhi, Patel and all the leaders suggested to dissolve the congress after independence to keep the "congress" name in history.
Some of the shrued politicians with a far sight fought and retained the name to cash on the popularity of "congress" and they proved themselves right.
A national Shame