1, ఆగస్టు 2009, శనివారం
మగధీరా..
Categories :
టేకింగ్, టెక్నికల్ వాల్యూస్‌తో పాటు కథలు కూడా పాశ్చాత్యబాట పడుతున్న తరుణంలో మన దేశానికి సంబంధించిన రాచరిక చరిత్రను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం గొప్ప విషయం. స్టూడెంట్ నెం.1, యమదొంగ చిత్రాలతో ఎన్టీఆర్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళి ఈసారి చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌ను ఆ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
పరువు ప్రతిష్టల కోసం తలకాయలు నరుక్కోవడం ఫ్యాక్షనిజం అయితే, దేశాన్ని, రాజును, యువరాణిని కాపాడుకోవడం కోసం కరవాలంతో తలలు లేపేయడం వంటి రాచరిక చరిత్రతో "మగధీర" తెరకెక్కాడు.
"ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.. పులి చంపిన లేడి నెత్తురు. ఎగరేసిన ఎర్రజెండా.." అని శ్రీశ్రీ అభివర్ణించాడు. రాచరిక వ్యవస్థలో వీరోచిత పోరాటాలు, గగుర్పాటు కలిగించే విన్యాసాలు చాలా ఉంటాయి. రాజ్యం కోసం సర్వసైన్యాధ్యక్షుడు పణం అడ్డుగా పెడతాడు.
అలా తరతరాలుగా రాజ్యం కోసం ప్రాణాలు అర్పించే శతధృవవంశీయునికి చెందిన కాలభైరవుడు (రామ్‌చరణ్). క్రీ.శ. 1609లో ఉదయ్‌ఘడ్ రాజ్యాన్ని ఎలా కాపాడి, చివరికి కాలాన్ని కూడా జయించి, 400 ఏళ్ళనాటి ప్రేమను ఈ జన్మలో ఎలా దక్కించుకున్నాడన్నదే "మగధీర" చిత్ర కథాంశం.
"చావులోనైనా తోడు ఇవ్వవా..?" అంటూ యువరాణి మిత్రబృంద (కాజల్ అగర్వాల్) భైరవుడిని తన చేతిలోకి తీసుకుంటూ ఆరావళి పర్వాతాల్లో పడి చనిపోవడం, ఆమెనే భైరవుడు అనుసరించడంతో కథ ప్రారంభమౌతుంది.
మరోవైపు హైదరాబాదులో హర్ష (రామ్‌చరణ్ తేజ) బైక్ రేసుల్లో పాల్గొని డబ్బులు సంపాదిస్తుంటాడు. అతని తల్లిదండ్రులు ఎవరనే అంశాన్ని దర్శకుడు టచ్ చేయలేదు. రేసు పనిమీదే ఎయిర్‌పోర్టుకు వెళుతుండగా.. బస్టాప్‌లో ఉన్న ఓ అమ్మాయి చేతి వేళ్ళు అనుకోకుండా హర్షకు తగిలి హృదయంలో ఏదో తెలీని అనుభూతి కలిగి అతనికి పూర్వజన్మ స్ఫురిస్తుంది.
చివరికి ఆమెను పట్టుకుని ఆమె ఇందిర అని, గత జన్మలో యువరాణి మిత్రబృంద (కాజల్ అగర్వాల్)గా హర్ష ఓ నిర్ణయానికి వస్తాడు. ఈ విషయం మిత్రబృందకు తెలియదు. మరోవైపు అలనాటి ఉదయ్‌ఘడ్ కోటను ఇందిర కుటుంబానికి దక్కకుండా చేస్తుంటాడు మేనమామ రణదీప్ (దేవ్‌గిల్). తనకు దక్కనిది మరొకడికి దక్కనీయకుండా చేసే తత్త్వం రణదీప్‌ది.
అలా ఇందిర తనది కావాలంటే హర్షను చంపాలి. ఇలా ఇందిరను దక్కించుకునే సమయంలో ఏదో తెలియని శక్తి రణదీప్‌ను అడ్డుకుంటుంది. వెంటనే రణదీప్ అఘోరాను సంప్రదిస్తే ఇది పూర్వజన్మ వాసన అంటూ 400 ఏళ్ళనాటి చరిత్రను కళ్ళముందుంచుతాడు. (ఇక్కడంతా అరుంథతి సినిమా గుర్తుకువస్తుంది. అందులోనూ అరుంధతిని అనుభవించాలని కామవాంఛతో రగిలిపోయే పశుపతి పాత్రకు రణదీప్ పాత్రకు పోలిక కన్పిస్తుంది). ఇక ఫ్లాష్‌బ్యాక్.. ఉదయ్‌ఘడ్‌కు రాజు శరత్‌బాబు. శరత్‌బాబు కుమార్తె మిత్రబృంద (కాజల్ అగర్వాల్). 400 ఏళ్లకు కనబడే అష్టగ్రహకూటమి (8 ఉల్కలు) ఆకాశంలో కన్పిస్తుంది. ఇది అరిష్టమని రాజగురువు చెబుతాడు. అనుకున్నట్లుగానే భారతదేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే ముస్లిం నవాబ్ షేర్‌ఖాన్ (శ్రీహరి) ఉదయ్‌ఘడ్‌పైకి దండెత్తుతాడు.
అదే సమయంలో రాజ్యవారసుడిగా రాజ్యాన్ని కాపాడే వీరయోధుడి కోసం పోటీ జరుగుతుంది. ఈ పోటీలో నెగ్గితే యువరాణి కూడా దక్కుతుంది. ఓడిపోతే దేశబహిష్కరణ అనే నియమాలను రాజు నిర్దేశిస్తాడు. దీనికి రణధీర్, భైరవ్‌లు పోటీపడతారు. భైరవుడే నెగ్గుతాడని తెలిసినా రాజు దిగులు చెందుతాడు.
అనాదిగా వస్తున్న శతధృవవంశీయుడైన భైరవునికి ఆయుష్షు తక్కువ గనుక తన కుమార్తెను ఇవ్వనని భైరవుడితో రాజు చెబుతాడు. కానీ మిత్రబృంద భైరవుడ్నే పెళ్లిచేసుకోవాలనుకుంటుంది. రణదీప్, భైరవుడిల మధ్య జరిగిన పోటీల్లో భైరవుడు నెగ్గడంతో రణదీప్ దేశబహిష్కరణకు గురవుతాడు.
దీంతో రణదీప్ అవమానంతో శత్రుసేనలతో చేతులు కలిపి కోటపై దాడి చేస్తాడు. అడ్డువచ్చిన వారినంతా చంపేస్తాడు. అప్పటికే భైరవుని వీరోచితపోరాటాన్ని చూసి శతధృవ వంశం పేరు ఏ పాటిదో? నిరూపిస్తే.. కోటను, యువరాణిని ఇస్తానని శత్రురాజు హామీ ఇస్తాడు. అలా శత్రువులలోని వందమందిని నరికి నిజమైన శతధృవ వంశీయుడని భైరవుడు నిరూపిస్తాడు.
మళ్లీ ఇక్కడ అవమానం జరగడంతో.. ఇక తనకుదక్కదనుకున్న యువరాణిని రణదీప్ చంపేస్తాడు. స్వచ్ఛమైన ప్రేమకు చావులేదని భైరవుడూ చనిపోతాడు. మళ్ళీ 400 ఏళ్ళనాటికి భైరవుడు జన్మిస్తాడు.
మరి ఈ జన్మలో కూడా రణధీర్‌కు ఇందిరపై వాంఛతో ఆమె తండ్రిని చంపి ఆమెను ఎత్తుకుపోతాడు. హత్యను హర్షను వేస్తాడు. మరి హర్ష ఆ అపవాదును ఎలా ఎదుర్కొన్నాడు? ఇందు ప్రేమను హర్ష పొందాడా? లేదా? మరి షేర్‌ఖాన్ ఈ జన్మలో ఎక్కడ జన్మించాడు? ఆయన పాత్ర ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ: దర్శకునిగా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న రాజమౌళి ఈ చిత్రంలో తన సత్తా ఏమిటో చూపాడు. తెలుగు చిత్రాన్ని టెక్నాలజీపరంగా ఎంతరేంజ్‌లో తీసుకెళ్లొచ్చో నిరూపించాడు. టేకింగ్‌లో కొన్నిచోట్ల ఆంగ్ల చిత్రాన్ని తలపించినా సీరియస్ కథతో దాన్ని మరిపిస్తాడు.
లవ్‌స్టోరీని 400 ఏళ్ళనాటి చరిత్రలో జతచేసి భారీగా ఆనాటి కట్టడాలు, వస్త్రధారణ, కేశాలంకరణ బాగా చూపించాడు. కానీ ఆనాటి షేర్‌ఖాన్ మాటతీరును మరచినట్లున్నాడు దర్శకుడు. తెలుగు స్పష్టంగా మాట్లాడేలా చూపించడం చిన్నపాటి మచ్చ.
నటునిగా రామ్‌చరణ్ రెండవ చిత్రానికి పెద్ద హీరోగా నిలబడాలని ప్రయత్నించాడు. "చిరుత"తో కంపేర్‌చేస్తే కాస్త మెరుగ్గా ఉన్నా.. కొన్ని సందర్భాల్లో మాటలు ముద్దగా పలుకుతాడు. గుర్రపు స్వారీ.. డాన్స్‌లపై బాగా శ్రద్ధపెట్టాడు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో భైరవునిగా చరణ్ ఫిజిక్ సరిపోయింది.
మోడ్రన్‌గానూ పిలకతో విచిత్రంగా ఉన్నా.. ఇది ఫ్యాషన్ అంటూ చిరంజీవికే చెబుతాడు రామ్‌చరణ్. చిరంజీవి, చరణ్ సన్నివేశం చిత్రానికి అతికినట్లుంది. కాజల్ అగర్వాల్ రెండు పాత్రల్ని బాగా పండించింది. ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు దేవ్‌గిల్ సమర్థవంతంగా చేశాడు. ఇక షేర్‌ఖాన్ పాత్ర రెండో జన్మలో జాలరిగా నటిస్తాడు. శ్రీకాకుళం మాడ్యులేషన్ నవ్వు తెప్పిస్తుంది.
ఇంకా అఘోరాగా రావురమేష్ పాత్ర బాగుంది. హాస్యపాత్రలో హీరోకు వెన్నంటి ఉండే సునీల్ అలరిస్తాడు. అమ్మాయి వేషంలో అభినయం బాగుంది. అలాగే బ్రహ్మానందం, హేమ జంట చిన్నపాటి కాలక్షేపం.
ఇకపోతే.. సంగీతపరంగా కీరవాణి బాగానే చేశాడు. "బంగారుకోడిపెట్ట.." సందర్భానుసారంగా ఉంది. హీరో డాన్స్ తనకంటే బాగా చేశాడనుకునేందుకు చివర్లో మెగాస్టార్ కనిపించి ప్రశంస కురిపిస్తాడు. "నిన్ను పొందడానికే పుట్టానే.. అందకపోతే ఈ జన్మ వృధా.." అనే పాట చక్కని మెలోడితో హృదయాన్ని టచ్ చేస్తుంది. మగధీర టైటిల్ సాంగ్ చిత్రానికి హైలైట్. పాటను తెరకెక్కింటే తీరు ప్లెజెంట్‌గా ఉంది.
కీరవాణి పనితనం, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్రాణం పోశాయి. 3డి టెక్నికల్ విజువల్స్ ఈ చిత్రానికి కీలకం. ఎడారి ఊబి గ్రాఫిక్స్ థ్రిల్ కల్గిస్తుంది. సౌండ్ ఎఫెక్ట్స్ కథను నడిపిస్తాయి. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కు ఆర్ట్ రవీందర్ పనితనం ఆయువుపట్టుగా నిలిచింది. అలాగే రమారాజమౌళి స్టైలింగ్, కాస్ట్యూమ్స్ డిజైన్స్ నప్పాయి. దీనిపై భార్యాభర్తలు ఇద్దరూ కృషి చేసినట్లు కన్పిస్తుంది.
ఇకపోతే.. విజయేంద్రప్రసాద్ కథకు ఎం. రత్నం మాటలు పొందికగా ఉన్నాయి. పీటర్ హేన్స్, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బోర్ అనిపించవు. మాస్‌ను బాగా ఆకట్టుకుంటాయి. క్లాస్‌కు పర్వాలేదనిపిస్తుంది. మగధీరకు పెట్టిన ఖర్చు తెరపై కన్పిస్తుంది. మరి "మగధీర" ఎంతమేరకు ప్రేక్షకుల కాల భైరవుడు అనిపించుకుంటాడో? వేచి చూడాల్సిందే..!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మీ రివ్యూ విపులం గా ఉంది. అయితే సినిమా అంతా ఇక్కడే చూపించేస్తారేమో అని పూర్తి గా చదవలేదు :). ఐతే, భావం అర్ధం అయింది. సినిమా హాల్ కి వెళ్లి చూడాల్సిన సినిమా గా అనిపిస్తోంది.
hellow guru..
review ani ceppi cinema story mottam ceppeste ela sir...