11, జనవరి 2011, మంగళవారం
పార్టీ కావాలి.. చంద్రబాబే వద్దు
తెలంగాణ చిచ్చు రగిలింది. పార్టీలను చుట్టుముట్టుతోంది. శ్రీకృష్ణ కమిటీ ముందున్న పరిస్థితుల కన్నా తీవ్రంగా చుట్టుముడుతున్నాయి. అయితే.. ముందుగా కమిటీ రిపోర్ట్ ఎఫెక్ట పడింది తెలుగుదేశంపైనే.. ఇంతవరకూ పార్టీలోనే ఉండి పోరాడిన తెలంగాణ టీడీపీ నేతలు.. ఇప్పుడు తమకు ప్రత్యేకశాఖ కావాలనుకుంటున్నారు.. టీడీపీ నేతలు వేరు పడాలనుకోవడానికి కారణం ఏమిటి?
టీడీపీలో తెలంగాణ శాఖ ఏర్పడుతుందా..? రాష్ట్రం విడిపోకముందే తెలుగుదేశం పార్టీ చీలిపోతుందా..? అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఈ వివాదం ఎందుకువచ్చిందన్నది మాత్రం ఆసక్తికరమే. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి అందిన తర్వాత, తెలంగాణ ప్రత్యేక శాఖను డిమాండ్ చేశారు నాగం జనార్దనరెడ్డి సహా మరికొంతమంది నేతలు. ఇప్పటికే టీడీపీ తెలంగాణ ఫోరం ఉన్నప్పటికీ.. ప్రత్యేక శాఖ ఏర్పాటుతోనే తెలంగాణ ప్రాంతంలో పార్టీకి మేలు జరుగుతుందన్న అంచనా వారిది. అందుకే, చంద్రబాబుపై ఒత్తిడి తేవడానికి సిద్ధమయ్యారు. అయితే.. తాము పార్టీని వీడుతున్నామనో.. పార్టీని చీల్చబోతున్నామనో అనుకోవద్దంటున్నారు..
తెలంగాణ ప్రత్యేక శాఖను ఎందుకు డిమాండ్ చేస్తున్నారు..? చంద్రబాబు వైఖరి వల్లేనా? చంద్రబాబు ఇమేజ్ నుంచి తప్పించుకోవడానికేనా?అన్న ప్రశ్నలు తెలంగాణ నేతల వాదనతో అందరిలోనూ తలెత్తవచ్చు. చంద్రబాబు నేతృత్వంలోనే పనిచేస్తామంటూ తెలంగాణ టీడీపీ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నా... లోలోపల మాత్రం ఆయన నాయకత్వాన్ని అంగీకరించే స్థితిలో లేరు. తెలంగాణ వాదులంతా చంద్రబాబును టార్గెట్ చేసుకుంటుండడంతో టీడీపీ నేతలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. తెలంగాణ ఎజెండాతో టీఆర్‌ఎస్ దూసుకువెళుతుండగా.. తెలంగాణ ఇచ్చేది.. తెచ్చేది మేమేనంటూ కాంగ్రెస్ నేతలూ జోరుమీదున్నారు. సొంత ప్రభుత్వంపైనే పోరాటాలు చేస్తూ, జనంలో పేరు తెచ్చుకునే పనిలో పడ్డారు. ఓరకంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మొదటిస్థానంలో టిఆర్‌ఎస్ ఉండగా, రెండోస్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకొంది. మరి టీడీపీ ఏ స్థానంలో ఉందంటే.. ఎవరూ చెప్పలేని పరిస్థితి. చంద్రబాబు స్పష్టమైన వైఖరితో లేకపోవడంతో టీడీపీ నేతల ఉద్యమాన్ని ఎవరూ విశ్వసించే స్థితిలో లేరు. పైగా, ఏం చేస్తే అధినేత ఏమనుకుంటారో అన్న భయమూ తెలంగాణ టీడీపీ నేతలను వెంటాడుతోంది. టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవలే పార్టీకి రిజైన్ చేసి, టీఆర్‌ఎస్‌లో చేరడానికి కారణం కూడా ఇదే. తెలంగాణ విషయంలో చంద్రబాబు వైఖరికి నిరసనగానే పార్టీ మారుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పోచారంలా వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన టీడీపీ సీనియర్లకు లేకపోయినా, తెలంగాణ విషయంలో మాత్రం తీవ్రంగా పోరాడాలనుకుంటున్నారు. అందుకే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలంటున్నారు. టిఆర్‌ఎస్, జేఏసీ నేతలు తరచుగా టీడీపీనే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నా సమాధానం ఇవ్వలేకపోతున్నామని, అదే ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తే తమ చిత్తశుద్ధిని నిరూపించుకునే అవకాశం ఉంటుందన్నది తెలంగాణ టీడీపీ నేతల అంచనా.
మొత్తంమీద చూస్తే.. చంద్రబాబు ఇమేజ్‌నుంచి బయటపడడానికే, తెలంగాణ నేతలు ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. మరి వీరి ప్రయత్నాలు ఫలిస్తాయా..? అంటే చాలా కష్టమనే చెప్పొచ్చు. సీమాంధ్ర నేతలు ఈ ప్రతిపాదనకు పూర్తి వ్యతిరేకం. నాగం అంటే పడని దేవేందర్‌గౌడ్, మోత్కుపల్లి నర్సింహులు వంటి తెలంగాణ నేతలూ చంద్రబాబు పక్షమే. అందుకే.. సమన్వయకమిటీ ఏర్పాటుకే రంగం సిద్ధమవుతుంది. ఈనెల 13న జరిగే సమావేశంలోనూ అధికారంగా కమిటీ ఏర్పాటునే ఖరారు చేయబోతున్నారు. ప్రత్యేక శాఖతో తెలంగాణలో హవా చెలాయించవచ్చనుకున్న నాగం ఆశలపై నీళ్లు చల్లబోతున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి