4, జులై 2011, సోమవారం
దాగుడుమూతలు
కాంగ్రెస్ మంత్రులు దాగుడు మూతలు ఆడుతున్నారు. రాజీనామాల విషయంలో, పదవీ త్యాగాల విషయంలో మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు చెందిన 14 మంది మంత్రుల్లో 11 మంది రాజీనామాలను సమర్పించినా.. మంత్రి పదవులను మాత్రం వదులుకోలేదు. వాస్తవానికి మంత్రి పదవులకు రాజీనామా చేయాలంటే గవర్నరుకు లేఖలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన ఆమోదిస్తే మంత్రి పదవి ఊడిపోతుంది. ఈ విషయంలో తర్జనభర్జనలు పడ్డ మంత్రులు, చివరకు మహా ఎత్తుగడను వేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేయకుండా, శాసనసభ్యత్వానికే రాజీనామా ఇవ్వాలనుకున్నారు. దీనివల్ల వారికి రెండు లాభాలు చేకూరతాయి. మొదటిది స్పీకర్ ఆమోదించేదాకా, రాజీనామాలు అమల్లోకి రావు. అంటే, అప్పటివరకూ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఏ ఇబ్బందీ లేకుండా కొనసాగవచ్చు. స్పీకర్ కాంగ్రెస్ పార్టీ వాడే కాబట్టి, ఎన్ని రోజుల్లో ఆమోదిస్తారన్నది ప్రశ్నార్థకమే. ఇక రెండోది ఒకవేళ రాజీనామాలను స్పీకర్ ఆమోదించినా, ఆ తర్వాత ఆరు నెలల పాటు మంత్రి పదవిని అనుభవించవచ్చు. అందుకే, ఎమ్మెల్యేలతో పాటు, శాసనసభ్యత్వానికే రాజీనామా చేశారు తప్ప.. గవర్నరును కలుసుకోలేదు. పైగా, గవర్నర్ అపాయింట్ మెంట్ దొరకలేదంటూ కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. మంత్రులకు నిజంగానే పదవులు త్యజించాలన్న చిత్తశుద్ధి ఉంటే, గవర్నర్ అపాయింట్ మెంట్ దొరక్కుండా ఉంటుందా..? అంతేకాదు, రాజీనామాలు ఇవ్వడానికి మంత్రులంతా అసెంబ్లీకి రాలేదు. నలుగురు మాత్రమే వచ్చారు. అందరి రాజీనామా పత్రాలను మంత్రి బస్వరాజ్ సారయ్య తీసుకొచ్చారు. మిగిలినవారంతా ఆ సమయంలో సీఎం క్యాంప్ కార్యాలయంలో పడిగాపులు కాస్తున్నారు.
భిన్నాభిప్రాయాలు...
రాజీనామాల వ్యవహారం చివరి దశకు చేరుకుంటున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానంలో చలనం వచ్చింది. రాజీనామాలు చేయొద్దని, చర్చిద్దాం రమ్మంటూ ఆహ్వానం పలికింది. ముందు, ఢిల్లీకి వెళ్లాలనే నిర్ణయించుకున్న కాంగ్రెస్ నేతలు, జనంలో చులకనవుతామని భావించి వెనక్కితగ్గారు. రాజీనామాలను సమర్పించిన తర్వాతే, ఢిల్లీకి పయనమయ్యారు. ఈ విషయంలోనూ మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఢిల్లీకి వెళ్లే ప్రసక్తే లేదని, అక్కడ ఉన్న ఎంపీలతో చర్చలు జరపాలని మంత్రి కోమటిరెడ్డి ప్రకటిస్తే.. ఆ కాసేపట్లోనే జానా,పొన్నాల,సారయ్యల బృందం ఢిల్లీ విమానం ఎక్కేసింది. ఇలా తలోమాట, తలోతీరు వ్యవహరించి అందరిలోనూ అనుమానాలను మరింత పెంచారు కాంగ్రెస్ మంత్రులు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి