4, ఫిబ్రవరి 2011, శుక్రవారం
సంగీతానికే కాదు.. హాస్యానికి చక్రవర్తి
తెలుగు సినీ సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన మహానుభావుడు చక్రవర్తి. సంప్రదాయబద్ధంగా సాగుతున్న సంగీతానికి వెయ్యి వోల్టులు ఎనర్జీని అందించి పరుగులు పెట్టించిన సంగీత చక్రవర్తి. 18 ఏళ్ల పాటు తెలుగు చిత్రసీమలో తిరుగులేని సంగీత దర్శకుడిగా హవా చెలాయించిన చక్రవర్తి... 960 సినిమాలకు సంగీతం అందించారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇందులో కూడా 850 సినిమాలు తెలుగులోనే ఉన్నాయి. ఒక్క ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 66 సినిమాలకు సంగీతం అందిచిన దిట్ట చక్రవర్తి. ఆయన స్వరపరిచిన సినిమాల్లోని పాటలు ఇప్పటికీ కొత్తగానే ఉంటాయి. పాతవాసనలను మచ్చుకైనా వేయవు. సంగీతంలోనే కాదు.. హాస్యచతురతలోనూ ఆయన చక్రవర్తే. ఆయన వర్ధంతి (ఫిబ్రవరి3) సందర్భంగా చక్రవర్తిని తలచుకున్నప్పుడు నేను విన్న కొన్ని జోకులు మీకోసం..
ట్రెండ్ వస్తుంది..
ఓ సారి చక్రవర్తి అసిస్టెంట్ ఆదుర్దాగా ఫోన్ చేశాడట. సార్.. మనం రికార్డ్ చేసిన ట్యూన్ పాడైయ్యింది.. సరిగ్గా ప్లే కావడంలేదు. ఏం చేయమంటారు.. పాడేయమంటారా..? అని అడిగాడట.
" అంత పని చేయకు.. అది సెట్టయ్యే ట్రెండ్ త్వరలోనే వస్తుంది" అని అన్నారట చక్రవర్తి.
------------------
ఒకటా.. రెండా..?
ఓ సారి అప్పారావు గారు(చక్రవర్తి అసలుపేరు) రికార్డింగ్ థియేటర్ ముందు నిలబడి సిగరెట్ తాగుతున్నారట. ఓ నిర్మాత హడావిడిగా ఆయన దగ్గరకు వచ్చి, ఇక్కడ చక్రవర్తి గారెక్కడ ఉంటారండీ అని అడిగాడట.
"లోపలికి వెళ్లి అడంగండి" అన్నారు చక్రవర్తి.
ఆయన లోపల వెళ్లగానే, తన అసిస్టెంట్‌ను పిలిచి.. ఆయన లోపలికి వచ్చి అడిగితే బయట ఉన్నానని చెప్పు అన్నారట.
అసిస్టెంట్ అలాగే చెప్పేసరి, నిర్మాత మళ్లీ వెనక్కి వచ్చి.. చక్రవర్తిని మళ్లీ అడిగాడు. సార్.. చక్రవర్తిగారు బయటే ఉన్నారట.. ఎవరండి.. అని
ఆ.. నేనే... అన్నారట చక్రవర్తి
మరి ఇందాక చెప్పేలేంటండీ.. అని అడిగితే.. మీకు ఏ చక్రవర్తి కావాలో తెలియక అలా చెప్పా అన్నారట..
నిర్మాత షాక్..
సార్.. సినిమాకు మ్యూజిక్ కొట్టాలి అని అడిగాట సదరు నిర్మాత..
సిగరెట్ దమ్మ గట్టిగా పీల్చి.. వదిలి.. ఒకటా.. రెండా.. అన్నారట చక్రవర్తి..
నిర్మాతకు మళ్లీ షాక్..
ఈయనేదో కాస్త తేడా ఉన్నాడని.. అసిస్టెంట్ దగ్గరకు వెళ్లి అడిగాడట.. చక్రవర్తి ఇలా అంటున్నారేమిటా అని.. ఆయన అంతేనండీ.. నెలకు ఐదారు కొట్టేస్తారు అన్నాడా అసిస్టెంట్..
నేనడిగేది రీరికార్డింగ్ కాదండి.. సినిమాకు మ్యూజిక్ కాస్త ఆవేశంగా అడిగాడా నిర్మాత
నేనూ చెప్పేది అదే.. రీరికార్డింగ్ అయితే.. ఈజీగా 20-30 అయిపోతాయాన్నడు అసిస్టెంట్..
నిర్మాతకు.. ఈ సారి డబుల్ షాక్..
-----------------------
పాడేయ్ పర్వాలేదు..
ఎస్పీ బాలు, చక్రవర్తి మంచి ఫ్రెండ్స్. శంకరాభరణంలాంటి మంచి మంచి పాటలు పాడిన తర్వాత ఓ సారి చక్రవర్తి దగ్గరకు బాలు వచ్చాడట. ఆయన రాగానే బాలును.. మీరు గొప్పోళ్లు.. మహానుభావులంటూ పొగడడం మొదలుపెట్టారట చక్రవర్తి.
ఏంటి అప్పారావు... ఎగేస్తున్నావు ఏంటీ సంగతి అన్నారట బాలు..
ఏం లేదులే.. ఓ 32 పాటలు పాడాలి అన్నారట చక్రవర్తి..
బాలు షాక్.. 32 పాటలా.. అని..
సరే రికార్డింగ్ మొదలయ్యింది.. ఓ నాలుగు పాటలు రికార్డింగ్ అయిపోయిన తర్వాత బాలుకు డౌట్ వచ్చింది.. అన్నీ ఒకే టైప్‌లో ఉన్నాయేంటి అని..
అప్పుడు చక్రవర్తి అన్నారట..
"అవన్నీ ఒక్కో సంవత్సరంలో విడుదలవుతాయిలే.. అప్పటికి అన్నీ కొత్తగా ఉంటాయి. ఏంకాదు పాడేసేయ్"
బాలుకు డబుల్ షాక్
-------------
అటు నుంచి ఇటూ.. ఇటు నుంచి అటు..
చక్రవర్తి వరసగా సినిమాలు చేస్తుండడంతో ఓ సినీమనిషికి అనుమానం వచ్చింది. హిందీ,భోజ్‌పురి,తమిళం,తెలుగు, మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ ఇన్ని సినిమాలు ఎలా చేయగలుగుతున్నారు. పైగా ఒక ట్యూన్ మరో ట్యూన్లా ఉండదు అని చక్రవర్తిని అడిగాడా పెద్దమనిషి.
" ఆ ఏముంది.. హిందీ వాళ్లకు అటు నుంచి ఇటు కొడితే నచ్చుతుంది.. భోజ్‌పురి వాళ్లకు ఇటు నుంచి అటు కొడితే నచ్చుతుంది. మిగిలినవాళ్లూ అంతే.. అటూ ఇటూ మ్యానేజ్ చేసి కొట్టేస్తున్నా" అన్నారట చక్రవర్తి.
ఇంకా ఇలాంటి జోక్స్ విని నవ్వు ఆపుకేలేకపోయాం...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి