19, మార్చి 2013, మంగళవారం
పదహారేళ్ల మీద అంత మోజెందుకు..?
కేంద్ర ప్రభుత్వాన్ని కొంతకాలంగా పదహారేళ్ల వయస్సు కుదిపేస్తోంది. యూపీఏ సర్కార్, లెఫ్ట్ పార్టీలు పరస్పర శృంగార ఆమోదానికి వయస్సును పదహారేళ్లకు తగ్గించి, అత్యాచార నిరోధక బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని భావించాయి. కానీ, బీజేపీ, సమాజ్ వాదీ ఇతర పార్టీలు మాత్రం పద్దెనిమిదేళ్ల వయస్సును తగ్గించడానికి వీల్లేదంటున్నాయి. అఖిలపక్షంలో ఏకాభిప్రాయానికి ఎంతో ప్రయత్నించి విఫలమైన కాంగ్రెస్, ఇక పద్దెనిమిదేళ్లకే పరిమితం అయిపోయింది. ఆమేరకే బిల్లును పార్లమెంట్ లో పెట్టి, దానికి ఆమోదం సంపాదించింది. అయితే, యాసిడ్ దాడి చేసినవాళ్లకు, పిల్లలను అక్రమ రవాణా చేసేవాళ్లకు జీవిత ఖైదు విధించాలన్న సవరణలు మాత్రం వీగిపోయాయి.
పదహారేళ్లైతే తప్పా..?
శృంగారానికి పరస్పర ఆమోదం తెలపడానికి పదహారేళ్ల వయస్సుపై ఇప్పుడు దేశవ్యాప్త దుమారం చెలరేగుతోంది. అసలు పదహారేళ్ల వయస్సు చేయడం తప్పా..? దీనిపై ఇతర రాష్ట్రాల వాళ్లు ఏమనుకుంటారో తెలియదు కాదు.. కానీ, అనధికారికంగా తరతరాలుగా మనవాళ్లు మాత్రం పదహారేళ్ల ప్రాయం వచ్చిందంటే మోహానికి లైసెన్స్ వచ్చినట్లేనని భావిస్తున్నారు. అందుకు మన సినిమాలే ఓ ఉదాహరణ. సిరిమల్లెపువ్వా..సిరిమల్లెపువ్వా అంటూ రాఘవేంద్రరావు తీసిన పదహారేళ్ల వయస్సు సినిమాతోనే, తెలుగులో శ్రీదేవికి క్రేజ్ పెరిగింది. ఈ సినిమా నాటికి ఆమె వయస్సు పదహారేళ్లే. పదహారేళ్ల గొడవ అక్కడితో అయిపోలేదు. అప్పటి నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏదో రకంగా వెంటాడుతూనే ఉంది. పాటల రచయతలు, డైరెక్టర్ల మదిలో దూరి ఏదోలా తెరపై ప్రత్యకక్షమవుతోంది. పదహారేళ్ల వయస్సు తర్వాత తెలుగు వాళ్లకు పిచ్చెక్కించింది ఓ పాట. అదే.. పదహారేళ్ళ వయసుకు, నీలో నాలో చేసే చిలిపి పనులకు కోటి దండాలు శతకోటి దండాలు. మరో చరిత్రలో జానకి పాడిన ఈ పాట, ఇప్పటికీ తెలుగు నేలపై ఏదో ఓ చోట నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. పదహారేళ్ల వయస్సు పడిపడి లేచె మనస్సంటూ.. పదహారేళ్ల ప్రాయంలో మనస్సు ఎలా పరుగులు పెడుతుందో, కొత్త దనాన్ని ఎలా కోరుకుంటుందో మనవాళ్లు వెండితెరపై బాగానే చూపించారు. ఇక సిక్స్ టీన్స్ అంటూ పూర్తిగా కుర్రకారు సినిమా కూడా, కాలేజీ కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసింది. ఇక శంకర్ లాంటి డైరెక్టర్ తీసిన బాయ్స్ లోనూ 16 ప్రత్యక్షమయ్యింది. పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలంటాడు హీరో. ఇలా పదహారేళ్లు ఒంటిపైకి రాగానే, పిల్లాడు కాస్తా కుర్రాడై, కొత్తదనం కోరుకోవాలని చెబుతుంది తెలుగు సినిమా.
ఆ వయస్సులో తప్పటడుగువేస్తే..!
టెన్త్ క్లాస్ దాటి, ఇంటర్ లోకి వచ్చే సమయం ఈ పదహారేళ్ల ప్రాయం. అప్పుడప్పుడే లోకం పోకడ తెలుస్తుంటోంది. యవ్వనం శరీరంలో కొత్త మార్పులు తెస్తుంది. మనసు కొత్త దనాన్ని కోరుకుంటుంది. తల్లిదండ్రుల నిర్భంధాన్ని దాటుకొని, తమ చుట్టూ ఉన్న లోకాన్ని పూర్తిగా చూడాలని హృదయం ఆరాటపడుతుంది. అప్పుడు గనుక తప్పటడుగు పడితే, అది జీవితాన్నే మార్చేస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలుసు. పదహారేళ్ల వయస్సుకు ఎంత ఆకర్షణ శక్తి ఉందో తెలుసుకాబట్టే, తెలుగు సినిమా దాన్నో కమర్షియల్ ఫార్ములాగా మార్చేసుకుంది. ప్రస్తుతం చట్టంలో ఉన్న నిబంధనల కారణంగా, పదహారేళ్ల వయస్సున్న అమ్మాయి గానీ, అబ్బాయి గానీ పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నా, అది అత్యాచారం కిందకే వస్తుంది. అయితే, ప్రస్తుతం సమాజంలో వచ్చిన మార్పుల కారణంగా, పద్దెనిమిదేళ్ల వయస్సును కాస్తా, పదహారేళ్లకు తగ్గించాలన్న పిచ్చిడిమాండ్ ను చాలామంది చేస్తున్నారు. తాత్కాలిక ఆకర్షణ తప్ప, ఏది తప్పో ఏది ఒప్పో తెలియని సమయంలో శృంగారంలో పాల్గొనడం తప్పుకాదని కేంద్రమే సర్టిఫికెట్ ఇస్తే, ఈ గడ్డపై జరిగే అన్యాయాలకు అంతన్నదే ఉండదు. మూటలకొద్దీ డబ్బును మూటకట్టుకుని, మదమెక్కి అమ్మాయిలపై అత్యాచారాలకు ఒడిగట్టే బడాబాబుల అరాచకాలకు అడ్డన్నదే ఉండదు.
అసలు 20 ఏళ్లు వస్తే గానీ, ఆకర్షణను జయించగలిగే ఆలోచన రాదన్నది సత్యం. శృంగారంలో పాల్గొనడానికి వీల్లేదంటూ చట్టంలో ఆ మేరకు మార్పు తెస్తే గానీ, అమ్మాయిలకు రక్షణ అన్నదే ఉండదు. అంతేకానీ, వయస్సు తగ్గించడం ద్వారా కేసులు తగ్గించుకుని, అత్యాచారాలు తగ్గించామని గొప్పలు పోదామనుకొంటోంది. నిజంగా ఇది సిగ్గు పడే పరిణామే. అన్ని పార్టీలు ఒప్పుకోలేదు కాబట్టి సరిపోయింది కానీ, లేదంటే, ఈ పాటికి పదహారేళ్లకే.. పదపద అంటూ యూపీఏ సర్కార్ సెక్స్ లో పాల్గొనడానికి సిగ్నల్ ఇచ్చేసి ఉండేది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి