7, అక్టోబర్ 2012, ఆదివారం
గేల్ జోస్యం ఫలించింది.. కరేబియన్ దీవుల్లో క్రికెట్ బతికింది
Categories :
CRICKET . news . sports . srilanka . t20 world cup . TOP . west indies
సారీ.. శ్రీలంక.. ఈ సారి కప్ మాదే... అన్న గేల్ మాటలు ఫలించాయి. లంకపై చిరస్మరణీయమైన విజయంతో... టీ20 వరల్డ్ కప్ టైటిల్ ను వెస్టిండీస్ అందుకుంది. 1979 వన్డే వరల్డ్ కప్ తర్వాత, 2004 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత.. ఓ ఇంటర్నేషనల్ టైటిల్ ను దక్కించుకోవడం విండీస్ కు ఇదే మొదటిసారి. కరేబియన్ దీవుల్లో క్రికెట్ క్రేజ్ ను మళ్లీ పెంచబోయే కప్ ఇది. అసలు సిసలు ఛాంపియన్లలా ఈ టోర్నీ మొత్తం ఆడిన వెస్టిండియన్లు.. తమ కృషికి తగ్గ ఫలాన్ని అందుకున్నారు.
అసలైన క్రికెట్ మజాను అందించిన ట్వంటీ 20 వరల్డ్ కప్ లో విజయం చేతులు మారుతూ.. చివరకు విండీస్ నే వరించింది. తిరుగులేని ఆటతో వెస్టిండీస్ ను ఫైనల్ కు చేర్చిన గేల్.. తుది సమరంలో మాత్రం చేతులెత్తేశాడు. గేల్ ఒక్కడిని ఔట్ చేస్తే కప్ తమదే అని స్కెచ్ గీసుకున్న లంక.. అనుకున్నట్లే చేసింది. కేవలం 3 పరుగులకే గేల్ ను పెవిలియన్ కు పంపించగలిగింది. విధ్వంసకర బ్యాట్స్ మెన్ ఉన్న కరేబియన్ టీమ్ తొలి ఆరు ఓవర్లలో సాధించింది కేవలం 14 పరుగులే. 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి స్కోరు 32. 12.2 ఓవర్లకు గానీ 50 రన్స్ ను దాటలేకపోయింది. అప్పటివరకూ ఆధిపత్యం పూర్తిగా లంకే. ఇక కప్పు కూడా లంకదే అని చాలామందిలో నమ్మకం కూడా పెరిగిపోయింది..
సరిగ్గా అక్కడే మ్యాజిక్ మొదలయ్యింది. బ్రావో కొట్టిన సిక్స్ తో విండీస్ కు అంతవరకూ పట్టుకున్న జఢత్వం ఒక్కసారిగా వదిలిపోయింది. టెస్ట్ మ్యాచ్ లా అంతవరకూ ఆడిన శామ్యూల్.. ఒక్కసారిగా రెచ్చిపోయాడు. సిక్స్ లు ఫోర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో సమీ కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో.. వందపరుగులైనా దాటదనుకున్న విండీస్.. 137 పరుగులు చేసింది. ఇందులో శామ్యూల్ చేసినవే.. 78 పరుగులు. మెండిస్ 4 వికెట్లు తీసి, విండీస్ ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన లంక.. రెండో ఓవర్ తొలి బంతికే కీలక వికెట్ ను దిల్షాన్ రూపంలో సమర్పించుకుంది. ఆ తర్వాత కాసేపు జయవర్ధనే, సంగర్కరలు చక్కదిద్దడానికి ప్రయత్నించినా.. లంక తలరాతను మాత్రం మార్చలేకపోయారు. వరసగా వికెట్లు కోల్పోవడంతో, 18.4 ఓవర్లలో కేవలం 101 పరుగులు మాత్రమే చేసి కప్ కు అడుగు దూరంలోనే నిలిచిపోయింది.
గంగమ్ డ్యాన్స్ తో ఈ టోర్నీలో అదరగొట్టిన వెస్టిండీస్ టీమ్.. చివరివికెట్ పడగానే గ్రూప్ డ్యాన్స్ చేసి.. అభిమానులను అలరించింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి