Pages

21, అక్టోబర్ 2013, సోమవారం

రివర్స్‌ గేర్‌లో గులాబీ కార్

తెలంగాణ ఇస్తే బేషరుతుగా టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్లో కలిపేస్తానంటూ చాలాకాలం క్రితమే ఓపెన్ ఆఫర్ ప్రకటించి, ఆపై ఢిల్లీకి వెళ్లి మంతనాలకూ ప్రయత్నించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఇప్పుడు విషయంలో కారును రివర్స్‌ గేర్‌లో నడుపుతున్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, తెలంగాణవాదులు, పోరాటంలో తమతో కలిసిన ఉద్యోగసంఘాలు విలీనానికి ఒప్పుకోవడం లేదంటూ కొత్త హారన్ మోగిస్తున్నారు. దీనికి తగ్గట్లే.. తెలంగాణ ఏర్పాటు తర్వాత పునర్నిర్మాణంలోనూ టీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందంటూ ఆ పార్టీ నేత ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్నిబట్టి కాంగ్రెస్‌లో విలీనానికి సిద్ధంగా లేమన్న సంకేతాలను ఆయన ఇచ్చారు. ఈ నెల 25న జరగనున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ విషయంపై పూర్తిస్థాయిలో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అయితే, విలీనం చేస్తామంటూ కాంగ్రెస్ హైకమాండ్‌ను ఊరించి, తెలంగాణ ప్రక్రియను ఇంతవరకూ తెచ్చినతర్వాత, ఇప్పుడు మాట మార్చితే, కేంద్రం తెలంగాణపై వెనకడుగు వేసే అనుమానాలూ ఉండొచ్చంటూ కొంతమంది గులాబీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. అన్నట్లు విలీనంపై పలుమార్లు ప్రస్తావించిన కేసీఆర్... " కేసీఆర్ మాటిస్తే తలతెగిపడ్డా తప్పడంటూ" వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు దీనికి ఏమని సమాధానం చెబుతారన్నదీ ఆసక్తికరంగా మారింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి