Pages

10, ఆగస్టు 2015, సోమవారం

పవన్.. నువ్వు మాట్లాడాల్సిన సమయం ఇదే!

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాలో ఆత్మహత్యాయత్నం చేసిన మునికామకోటి కన్నుమూశాడు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయంతో తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబాన్ని అన్యాయం చేసి వెళ్లిపోయాడు. ఆత్మహత్యలకు ప్రభుత్వాలు కదలవన్న సంగతిని గుర్తించలేకపోయాడు మునికోటి. చచ్చి కాదు.. బ్రతికి సాధించాలన్న నిజాన్నితెలుసుకోలేకపోయాడు. మునికోటి ఆత్మహత్యతో ఇప్పుడు హడావుడి చేస్తున్న నేతలు..వారం పదిరోజులవగానే.. అతన్ని, అతని కుటుంబాన్నిమర్చిపోతారు. వాళ్లను టీవీల తెరలపై చూపించడానికి రోజుకో కొత్త అంశం పుట్టుకొస్తూనే ఉంటుంది. ఇప్పుడు మునికోటి కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తామంటూ కొంతమంది ముందుకు వచ్చినా.. అది ఎంతవరకూ ఆకుటుంబానికి అందుతుందన్నది తెలుసుకోవడం కష్టమే. అయితే..ఇలాంటి సమయంలో కాస్త విభిన్నంగా స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మునికోటి మృతికి సానుభూతిని తెలియజేస్తూనే, ఇలాంటి పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా తనను తాను నియంత్రించుకుంటున్నట్లు ప్రకటించారు. బాగాన ఉంది. కానీ, ఇలాంటప్పుడే పవన్ లాంటి వ్యక్తులు స్పందించాలి. ఆత్మహత్యలకు ఎవరూ పాల్పడవద్దని.. స్పెషల్ స్టేటస్ కోసం మరో మార్గంలో పోరాడదామంటూ ప్రకటించాలి. అవసరమైతే జనంలోకి వెళ్లాలి. తాను ప్రచారం చేసి, ఓట్లు వేయించినందుకు ప్రధాని మోడీని నిలదీయాలి. ఇవేవీ చేయకుండా కేవలం తనను తాను నియంత్రించుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రజలు కూడా దాన్నికోరుకోవడం లేదు. పవన్.. ఇకనైనా నీ పవర్ చూపించు. స్పెషల్ స్టేటస్ పై మోడీని కదిలించు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి