Pages

3, నవంబర్ 2013, ఆదివారం

క్లిక్ కొడితే ఇక కిక్కే

ఇది ఆన్‌లైన్ యుగం. ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లో దొరికేస్తోంది. పప్పులు, ఉప్పులు అమ్మడానికి కూడా బిగ్ బాస్కెట్ లాంటి సైట్లు పుట్టుకొచ్చాయి. అయితే, ఒకే ఒక్కటి మాత్రం ఇప్పటికీ నెట్‌లో అమ్మకానికి దొరకడం లేదు. అదే మద్యం. అన్నీ దొరికినప్పుడు ఇది మాత్రం ఎందుకు దొరకకూడదన్న ఆలోచన మన  అధికారులకు వచ్చేసింది. అందుకే, మద్యాన్ని ఆన్‌లైన్‌లో అమ్మడానికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి ముఖ్యమంత్రికి పంపించారు. ఆ ఫైల్‌పై ఆయన సంతకం పెట్టేస్తే, ఇక రాష్ట్రవ్యాప్తంగా మద్యం ఆన్‌లైన్‌లోనే కొనుక్కునే అవకాశం లభిస్తుంది.

పెద్దగా రాబడి లేకపోవడం, భారీగా లంచాలను ఇవ్వాల్సిన రావడంతో, ఈ సారి 1200కు పైగా మద్యం దుకాణాలను లైసెన్సులను రెన్యువల్ చేయించుకోవడానికి ముందుకు రాలేదు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోయామని భావిస్తున్న అబ్కారీ శాఖ, ఇలా ఆన్‌లైన్ ఎత్తుగడ వేసింది. సైట్‌లోకి లాగిన్ అయ్యి, కావల్సిన మద్యాన్ని ఎంచుకుని, నెట్‌బ్యాంకింగ్ లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయాల్సి ఉంటుంది. పేమెంట్ పూర్తైన తర్వాత, ఎక్సైజ్ శాఖకు చెందినవాళ్లే ఇంటికి తీసుకువచ్చి మద్యం బాటిళ్లను అప్పగించి వెళ్తారు. ఓ రకంగా ఇది ఇంటింటికీ మద్యం పథకం లాంటిదన్నమాట. దీనివల్ల భారీగా ఆదాయం వస్తుందన్న అంచనాలో ఉన్నారు అధికారులు. సీఎం కిరణ్ కుమార్ దీనికి అంగీకరిస్తే, ఒకటి రెండు నెలల్లోనే ఇది ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చేసే అవకాశం ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి