Pages

23, అక్టోబర్ 2013, బుధవారం

రాహుల్‌కు సోనియా వార్నింగ్

ఎక్కడికెళ్లినా సెంటిమెంట్ డైలాగ్‌లతో జనం గుండెల్ని పిండేస్తున్న రాహుల్‌ గాంధీకి కన్నతల్లి నుంచి ఊహించని షాక్ తగిలింది. ఏ సభలో మాట్లాడిన సోనియా గాంధీ అప్పుడు ఏడ్చింది.. ఇప్పుడు ఏడ్చిందంటూ నాలుగుగదులకే పరిమితమయ్యే విషయాన్ని ఎవరూ అడగకుండానే బయటపెట్టేస్తున్నాడు రాహుల్. దానివల్ల జనం హృదయాలు కరిగిపోతాయని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, పార్టీ పదవులు తీసుకునే సమయంలో తన తల్లి కన్నీరు కార్చిందని చెప్పుకొచ్చాడు.

ఇటీవలే మధ్యప్రదేశ్‌లోని సభలో మాట్లాడుతూ ఆహార భద్రతా బిల్లుపై ఓటింగ్‌లో పాల్గొనలేకపోవడంతో సోనియా కన్నీరుమున్నీరయ్యారని, హాస్పిటల్‌కు కూడా రానని మొండికేశారంటూ చెప్పుకొచ్చాడు యువరాజు. ఇదే పెద్ద వార్త అయిపోయింది. ఇలానే కొనసాగితే సానుభూతి సంగతేమో గానీ, తానో ఏడుపుగొట్టుదాన్నని అంతా అనుకుంటారని అనుకున్నారో ఏమో గానీ, సోనియా మాత్రం తనయుడికి తలంటేసినట్లున్నారు. ఇంకెప్పుడూ ప్రసంగాల్లో తన పేరు వాడొద్దంటూ ఆర్డర్ పాస్ చేశారు. అంత మాత్రాన రాహుల్ గాంధీ ఊరుకుంటారా.. ఆ విషయాన్ని కూడా రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో బయటపెట్టేశారు. అందుకే ఆమె గురించి మాట్లాడడం లేదని చెప్పేశారు. ఇదీ ఇప్పుడు పెద్ద వార్తైపోతుంది. సోనియా ఎందుకు తన పేరు ఎత్తొద్దని చెప్పారన్నదానిపై మీడియా కావల్సినంత వండుకుంటుంది. దీన్నిబట్టి చూస్తే రాహుల్ ఇంకా పూర్తిగా ఎదగలేదోమో అన్న అనుమానాలు కలగకమానవు.

ఇక తల్లి పేరును తప్పనిసరి పరిస్థితుల్లో పక్కన పెట్టిన రాహుల్, నాన్నమ్మ, నాన్నలపై భావోద్వేగ ప్రసంగాన్ని చేశారు. తన నాన్నమ్మ, తండ్రి ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారని, తన ప్రాణాన్ని కూడా ఏదో ఓ రోజు అలానే తీయవచ్చనీ చెప్పారు. అయితే, చావుకు భయపడేవాడిని కాదన్నారాయన.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి