Pages

8, డిసెంబర్ 2010, బుధవారం

అమ్మా.. నాన్న.. ఓ చంటాడు


కుటుంబం కోసంఎవరు ఎవరు ఎక్కువగా శ్రమిస్తారు. ఎవరు ఎక్కువ సమయం కేటాయిస్తారు? భార్యా? భర్తా??  ఇలాంటి అంశాలు ఎప్పుడూ పెద్ద డిబేటే. నేనే ఎక్కువ కష్టపడుతున్నానంటే.... నేనే అని మొగడు పెళ్లాలు మళ్లీ గొడవకు దిగుతారు. కానీ రాత్రి పూట పిల్లలవల్ల కలిగే నిద్రాభంగం విషయంలో మాత్రం బాధితులు మహిళలేనట. చిన్నారి ఏడుస్తున్నా కాసేపు ఎత్తుకుని ఆడించే పురుష పుంగవుల సంఖ్య తక్కువేనని ఓ సర్వే తేల్చింది.
అన్నిట్లోనూ సగం...ఆకాశంలోనూ సగం అన్న నినాదంతో దూసుకుపోతున్న మహిళలకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది... ఇల్లు, పిల్లలు, జాబ్‌ అన్నీ చూసుకునేసరికి తల్లులు అలసిపోతున్నారు.. దానికితోడు చంటాడో.., చంటిదో మారాం చేస్తే కలత  నిద్రకు గురై ఆరోగ్యాలు పాడవుతున్నాయి...
మగాడ్ని అన్న అహంకారం... అధిక సంపాదనపై దృష్టిపెట్టే తండ్రులకు పిల్లల ఆలనాపాలనా పట్టదు సరికదా... ప్రేమగా లాలించడం కూడా చేతకాదు. ఆఫీస్‌ నుంచి రాగానే కాసేపు లాలిస్తాడేమో కానీ.., నిద్రపోయాక...పిల్లలు గుక్కపట్టి ఏడ్చినా పట్టించుకోడు. కుంభకర్ణుడిలా నిద్రపోతాడు.
కానీ అమ్మ అలా కాదు. నవమాసాలు మోసి కన్న మమకారం ఆమెను నిద్రపోనివ్వదు. పిల్లలకు నలతగా ఉన్నా, చిన్నపాటిగా ఏడ్చినా, పాలు పట్టించాల్సి వచ్చినా కలతనిద్రనే ఆశ్రయిస్తుంది. కలతనిద్ర వల్ల తల్లుల ఆరోగ్యం దెబ్బతింటోందని.., ఆఫీసులో విధుల్ని నిర్వర్తించలేరని ఓ సర్వే తేల్చి చెప్పింది.  జాబ్‌ చేస్తూ.., సంతానాన్ని కని పెంచే 20 నుంచి 30 ఏళ్లలోపు మహిళల్లో ఈ సమస్య మరీ వేధిస్తుందట.
సారా బగార్డ్‌ అధ్యక్షతన అమెరికాలోని మిచిగావ్‌ వర్శిటీ పరిశోధకులు చేసిన సర్వేలో ఇంకా అనేక నిజాలు వెలుగుచూశాయి. 2003 నుంచి 2007 మధ్యకాలంలో 20 వేల మంది వర్కింగ్‌ పేరెంట్స్‌ను ఈ సర్వేలో పరిశీలించారు. ఏడాది కన్నా తక్కువ వయస్సున పిల్లల వల్ల కేవలం 11 శాతం మంది నాన్నలకు మెలకువ వస్తే... అమ్మల్లో మాత్రం 32 శాతం మంది ... నిద్రకు దూరమవుతున్నారట. ఏడాదినుంచి రెండేళ్ల చిన్నారుల వల్ల 2 శాతం మంది డాడీస్‌ కలత నిద్రపోతుంటే.., మమ్మీస్‌లో ఐదు రెట్లు ఎక్కువ అంటే.. 10 శాతం మంది కలతనిద్రపోతున్నారట...
ఇక మూడేళ్ల నుంచి ఐదేళ్ల పిల్లల వల్ల కేవలం ఒక్క శాతం మంది వర్కింగ్‌ ఫాదర్స్‌కు మాత్రమే నిద్రాభంగం అవుతుంటే.., వర్కింగ్‌ మామ్స్‌లో 3 శాతం మంది ఉన్నారట. ఓవరాల్‌గా సంపాదించే తండ్రులు.., 4 శాతం మంది పిల్లల ఏడుపులకు, అనారోగ్యాలకు నిద్రలేస్తుండగా.., అమ్మల్లో మాత్రం ఈ సంఖ్య 28 శాతం ఉందట.

1 కామెంట్‌: