Pages

2, డిసెంబర్ 2010, గురువారం

సవాళ్ల స్వాగతం


కొత్త సీఎంకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఒక్కరోజు గడవకుండానే, వచ్చే మూడేళ్ల పాలన ఎంత కష్టంగా ఉండబోతోందో కిరణ్‌కుమార్‌కు అర్థమైపోయింది. జూనియర్‌ను సీఎం చేయడంపై గుర్రుగా ఉన్న సీనియర్ మంత్రులు, పదవుల పంపకంపై భగ్గుమన్నారు. ఆదిలోనే అసమ్మతిని తెచ్చిపెట్టారు..
అధిష్టానం అండతో అకస్మాత్తుగా ముఖ్యమంత్రైన కిరణ్‌కుమార్‌ రెడ్డికి, సీనియర్ల సత్తా తెలిసొచ్చింది. ఇష్టారీతిన వ్యవహరిస్తే, తమ స్పందన ఎలా ఉంటుందో, మంత్రి మండలి ఏర్పాటైన కొన్ని గంటల్లోనే తెలిసొచ్చేలా చేశారు. పదవుల పంపంకంపై పూర్తి అసంతృప్తితో ఉన్న సీనియర్లు, రాజీనామా అస్త్రాలను ప్రయోగించారు. క్యాంప్ రాజకీయాలను మొదలుపెట్టారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చలు జరుపుతూ రాజకీయాలను వేడెక్కించారు. కిరణ్‌కుమార్‌కు తలనొప్పులు తెచ్చి పెట్టారు.
ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య సయోధ్య లేకపోవడం.. ఒకరికొకరు చెక్ చెప్పుకునే పద్దతులు ఒకప్పుడు కాంగ్రెస్‌లో సర్వసాధారణం. కానీ, వైఎస్ రాకతో ఆ సంస్కృతికి దాదాపుగా తెరపడింది. రాజశేఖరరెడ్డి ఏకఛత్రాధిపత్యానికి, మనస్పూర్తిగానో, తప్పనిసరి పరిస్థితుల్లోనో కాంగ్రెస్ నేతలంతా అంగీకరించాల్సి వచ్చింది. ఆయన ఎవరికి ఏ పదవి ఇచ్చినా, ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకున్నా, ఒక్కరు కూడా పెదవివిరవలేదు. కానీ, కిరణ్‌కుమార్ ఎంట్రీతో మళ్లీ సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో పాతగొడవలు మళ్లీ మొదలయ్యాయి. ముఖ్యమంత్రి నిర్ణయానికి బాహటంగానే మంత్రులు ఎదురుతిరిగారు. తమ ఫోర్ట్‌పోలియోలు మార్చాలంటూ క్యాంప్ రాజకీయాలు నిర్వహించారు. మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయడం, పదవుల కేటాయింపు విషయంలో ప్రతీ ఒక్కరినీ సంతృప్తి పరచడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. ప్రతీసారీ ఒకరో ఇద్దరో తమ పదవులపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉంటారు. కానీ, పదిమంది మంత్రులు ఎదురుతిరిగి, సీఎంకు వ్యతిరేకంగా సమావేశం కావడం అన్నది మాత్రం సంచలన విషయమే. కేబినెట్‌ పదవుల విషయంలోనే ఇంత రాద్దాంతం చేస్తున్న మంత్రులు, భవిష్యత్తులో సీఎం తీసుకునే నిర్ణయాల విషయంలో మరెంత హడావిడి చేస్తారో ఊహించవచ్చు..
మంత్రివర్గ ఏర్పాటులో మొదటినుంచీ ఎంతో రహస్యంగా కసరత్తు చేసిన కిరణ్‌కుమార్‌ రెడ్డికి ప్రస్తుత పరిస్థితులు మాత్రం షాక్‌ కొట్టాయనే చెప్పొచ్చు. హైకమాండ్ అండదండలతో మూడున్నరేళ్లు సాఫీగా రాష్ట్రాన్ని పాలించవచ్చన్న ఆశలు.. ఈ దెబ్బతో ఆవిరయ్యాయి. ఇక ప్రతీ రోజూ తనకు కత్తిమీద సాములానే ఉండొచ్చన్న విషయం సీఎంకు ఈ పాటికే అర్థమై ఉండొచ్చు. మంత్రుల ఎంపిక, శాఖల కేటాయింపులో చివరి వరకూ ఎంతో రహస్యంగా ఎవరికీ చిక్కకుండా వ్యవహరించిన కిరణ్‌కుమార్, చివరకు అసంతృప్తులకు చిక్కాల్సి వచ్చింది. ఇదేమీ పెద్ద సమస్య కాదంటూ కాంగ్రెస్ సీనియర్లు, హైకమాండ్ కొట్టి పడేస్తున్నా.. ముఖ్యమంత్రికి ముందున్నది ముసళ్లపండగేనన్న విషయాన్ని మాత్రం చాటిచెబుతోంది.

జగన్ తలనొప్పి

కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ కష్టాల జాబితా పెరుగుతూనే ఉంది. మంత్రుల తీరుతో ఇబ్బందుల్లో పడ్డ కిరణ్‌కుమార్‌కు జగన్‌ నుంచి పెద్ద ముప్పే పొంచి ఉంది. సోనియా తీరును తీవ్రంగా విమర్శిస్తూ, పార్టీ నుంచి బయటపడ్డ జగన్, తనదైన శైలిలో ముందడుగు వేస్తున్నారు. ఇడుపులపాయలో నేతలతో చర్చలు జరిపిన అనంతరం హైదరాబాద్‌కు మకాం మార్చారు. త్వరలోనే పార్టీ పెట్టడం ఖాయమంటూ వార్తలు వెలువడుతున్నాయి. పార్టీ పెట్టడం ఖాయమే అయినప్పటికీ, ఎప్పుడనేది ఇంకా నిర్ణయించుకోలేదని జగన్ వర్గం అధికారికంగా ప్రకటించింది.
ఇడుపులపాయ నుంచి రాగానే చర్చల్లో మునిగిపోయారు జగన్. తనకు మద్దతు ఇస్తున్న కొండా సురేఖ దంపతులు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, సినీనటి రోజా సహా ఇతర నేతలతో భేటి అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని అనౌన్స్ చేయాలా..? లేక కొంతకాలం ఆగడం మంచిదా అన్నదే ఇంకా తేల్చుకోలేదు. భూమానాగిరెడ్డి కూడా జగన్‌తో చర్చలు జరిపారు. పార్టీ పెట్టడానికే జగన్ మొగ్గు చూపుతుండడంతో, ఎప్పుడు ప్రకటిస్తారన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. రాష్ట్రం ప్రభుత్వంలో అసమ్మతి రాజుకున్న సమయంలో, జగన్ తన కార్యక్రమాల దూకుడును పెంచడం అందరినీ ఆలోచనలో పడేస్తోంది. కిరణ్ తీరుతో అసంతృప్తి చెందిన వారు జగన్‌వైపు ఎక్కడ మళ్లుతారో అన్న భయం కాంగ్రెస్ పార్టీది. పైగా, ముఖ్యమంత్రి బలహీనపడితే, జగన్‌ ఎదగడానికి అది మరింత మేలు చేస్తుందన్న ఆందోళనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. అందుకే, క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టిన మంత్రులను అదుపులో పెట్టడానికి స్వయంగా రంగంలోకిదిగింది. జగన్ పార్టీ పెడితే, అటువైపు వెళ్లే విషయంలో ఆలోచిస్తా నంటూ మంత్రి కాసు కృష్ణారెడ్డి చెప్పారన్న వార్తలూ కాంగ్రెస్‌లో కలకలం సృష్టించాయి. అయితే.. ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన లేదని సోనియాకు రాసిన లేఖలోనే జగన్ స్పష్టం చేశారు కాబట్టి, అలాంటి ప్రయత్నాలు చేయమని ఆయన అనుచరులు చెబుతున్నారు.
జగన్ పార్టీ పెడితే ఊరికే ఉండే అవకాశం లేదు. ప్రభుత్వాన్ని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు ఏదో ఒకపని చేస్తారు. కాంగ్రెస్‌ క్యాడర్‌ను తనవైపు లాక్కోవడానికి తీవ్రంగానే ప్రయత్నించవచ్చు. ఇప్పటికే చాలామంది సెకండరీ గ్రేడ్ లీడర్స్‌లో సాన్నిహిత్యాన్ని జగన్ పెంచుకున్నారు. కాంగ్రెస్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వీరంతా జగన్‌వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. పదవులు రాక అసంతృప్తితో ఉన్నవారు, పోర్ట్ ఫోలియోల విషయంలో నిరాశ చెందిన వారు జగన్‌కు లోపాయకారీ మద్దతు ప్రకటించినా ప్రకటించవచ్చు. ఇలా జగన్‌కు మద్దతు పెరగకుండా చూడడంతో పాటు, జగన్‌ ఇమేజ్‌ను తగ్గించడమే కిరణ్‌కుమార్ రెడ్డి ముందున్న అసలు సవాల్. చెప్పాలంటే దీనిపైనే కిరణ్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. జగన్‌ ప్రాబల్యాన్ని తగ్గించగలిగితే, కిరణ్‌కు కాంగ్రెస్‌లో ఎదురుండకపోవచ్చు. కానీ ఆ విషయంలో ఫెయిల్ అయితే మాత్రం, రాజకీయప్రస్థానానికే గండి పడవచ్చు.

నల్లేరుపై నడక కాదు


మరో నెలరోజుల్లో.. కిరణ్‌కుమార్‌ రెడ్డికి అసలైన అగ్ని పరీక్ష ఎదురుకాబోతోంది. అదే డిసెంబర్ 31. రాష్ట్ర విభజనపై ఏడాదికాలంగా సమాచారాన్ని, అభిప్రాయాలను వడబోస్తున్న శ్రీకృష్ణ కమిటీ తుదినివేదిక ఇచ్చే రోజు డిసెంబర్ 31. మరి ఆ నివేదికలో శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పబోతోంది..? రాష్ట్రాన్ని విభజించమంటుందా..? సమైక్యంగా ఉంచమంటుందా..? మధ్యామార్గమేమైనా చూపిస్తుందా..? దీనిపై ఇప్పటికిప్పుడు ఓ అంచనాకు రాలేము కానీ, ఎలా ఉన్నా రాష్ట్రంలో ఆందోళనలు వెల్లువెత్తడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ సమస్యను కిరణ్ కుమార్ ఎలా ఎదుర్కొంటారన్నదే ఇప్పుడు ఆసక్తికరం.
శాంతిభద్రతల విషయంలో చాలా కఠినంగా ఉంటానని ఇదివరకే కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, సీమాంధ్రలోనూ, తెలంగాణలోనూ ఏకకాలంలో ఆందోళనలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యమ సంఘాలు ఇప్పటినుంచే అందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా లేకపోతే, డిసెంబర్ 31 తర్వాత తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ విషయంలో టీఆర్ఎస్, తెలంగాణ జేఏసీలు ఏమాత్రం వెనుకడుగు వేయకపోవచ్చు.
ఇక ఉస్మానియా విద్యార్థులూ ఉద్యమంలో కీలకపాత్ర పోషించవచ్చు. నిరుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మొదలైనప్పటినుంచీ, ప్రధాన పాత్ర ఓయూ విద్యార్థులదే. ఆందోళనలు, బంద్‌లు, నిరసనలతో ఉద్యమాన్ని తారాస్థాయికి చేర్చారు. వీరిని ఎలా కంట్రోల్ చేయడమూ కిరణ్‌కుమార్‌కు సవాల్‌గానే మారింది. ఆందోళనలను అరికట్టడానికి పోలీసులను ప్రయోగించితే ఓ సమస్య, ప్రయోగించకపోతే మరో సమస్య.. ఏమైనా, విద్యార్థుల నుంచీ తిప్పలు తప్పకపోవచ్చు.
రాష్ట్ర విభజనకు అనుకూలంగా కమిటీ నివేదిక ఉంటే సీమాంధ్ర భగ్గుమనడం ఖాయం. రాజకీయ పక్షాలకు అతీతంగా ఉద్యమం సాగుతోంది కాబట్టి, వీటిని కంట్రోల్ చేయడం కష్టమే. కాంగ్రెస్ నేతలను కిరణ్‌కుమార్ నియంత్రించగలగినా, తెలుగుదేశం,పీఆర్పీ నేతలకు, విద్యార్థులను అదుపుచేయడం మాత్రం కష్టమైన పనే. డిసెంబర్ 31కి సమయం దగ్గర పడుతున్నా.. కిరణ్‌కుమార్ రెడ్డి పూర్తిస్థాయిలో పాలనపై దృష్టి పెట్టలేదు. మంత్రివర్గ సమస్యలతోనే సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో, డిసెంబర్ 31 తర్వాత వెల్లువెత్తవచ్చని భావిస్తున్న ఆందోళనలను కిరణ్ సమర్ధవంతగా నియంత్రించగలుగుతారా అన్నది అనుమానమే. వాస్తవానికి కిరణ్‌కుమార్‌ను ఇప్పటికిప్పుడు పదవిలోకి తీసుకొచ్చి పెట్టడానికి ప్రధాన కారణం కూడా డిసెంబర్ 31 డెడ్‌లైనే. చిన్న చిన్న సమస్యలనే రోశయ్య సమర్ధంగా ఎదుర్కోలేకపోవడంతో, డిసెంబర్ 31 వరకూ ఆయన్ను కొనసాగించే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ వెనక్కి తగ్గింది. చురుగ్గా నిర్ణయాలు తీసుకొని, కఠినంగా ఉండేవారిని ఎంపిక చేయాలని భావించింది. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి స్వభావంఉన్న నేతలు చాలా మంది ఉన్నా.. అంతా తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలతో ఏదో రకమైనసంబంధం ఉన్నవారే. అందుకే, ఈ ఆందోళనలకు దూరంగా ఉన్న కిరణ్‌కుమార్‌నే సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికి సోనిమా మొగ్గుచూపారు. దీనివల్ల ప్రాంతీయ విభేదాలు తలెత్తవన్నది కాంగ్రెస్ ఆలోచన. ఇంతవరకూ బాగానే ఉన్నా... ఇప్పుడు రాబోయే సమస్యను కిరణ్ ఎదుర్కోవడంపైనే, ఆయన సమర్థత తెలిసిపోనుంది. అందుకున్న సమయం నెలరోజులు మాత్రమే..


సమస్యల స్వాగతం

కొత్త ముఖ్యమంత్రికి ప్రభుత్వోద్యోగుల ఆందోళన స్వాగతం పలికింది. సమస్యల పరిష్కారానికి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మెకు సిద్ధమయ్యారు. ఉద్యోగులు సమ్మె చేస్తే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో ఊహించిన కిరణ్‌కుమార్ రెడ్డి వారిని చర్చలకు ఆహ్వానించారు. పరిష్కారం కోసం 15 రోజుల గడువు కావాలని కోరారు. ముఖ్యమంత్రి పరిస్థితిని చూసి ఉద్యోగ సంఘాలు కూడా సానుకూలంగానే స్పందించాయి. ప్రస్తుతానికి సమ్మెను వాయిదా వేసుకున్నాయి. కానీ, 15 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే మాత్రం ఉద్యమానికి సిద్ధం కావాలనుకుంటున్నాయి.
104 ఉద్యోగులు ఇప్పటికే తీవ్రస్థాయిలో ఉద్యమం సాగిస్తున్నారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపించకపోవడంతో ఆందోళన చేపట్టారు. గురువారం సెక్రటేరియెట్‌ను ముట్టడించడానికి చేసిన ప్రయత్నం ఉద్రిక్తతలను సృష్టించింది. పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టినా, సమస్యమాత్రం పరిష్కారం కాలేదు. ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని 104 ఉద్యోగులు భావిస్తున్నారు.
ఉద్యోగులకు మాత్రమే కాదు, రైతులకూ కష్టాలు తప్పడం లేదు. ధాన్యం కొనుగోళ్లలో గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఇటీవల వచ్చిన తుఫానుల తాకిడి నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫీజు రీఎంబర్స్‌మెంట్ గొడవ కొనసాగుతూనే ఉంది. ఇలా ఎన్నో సమస్యల సుడిగుండాలను కిరణ్ కుమార్ దాటాల్సి ఉంది.
ఆరోగ్యశ్రీకి ప్రాధాన్యత, బీసీ హాస్టళ్ల ఏర్పాటు వంటి కొత్త నిర్ణయాలు ఖజానాపై భారం పెంచవచ్చు. ఇప్పటికీ సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించలేక, రోశయ్య ఎక్కడికక్కడ కోతలు పెట్టుకుంటూ వచ్చారు. రోశయ్య హయాంలో సంక్షేమం పడకేసిందన్న ఆరోపణలు వినిపించాయి. ప్రజల్లో వీలైనంత తొందరగా ఆదరణను పొందాలంటే సంక్షేమ పథకాలను కిరణ్‌కుమార్‌ రెడ్డి పరుగులు పెట్టించాలి. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం అది సాధ్యమయ్యేలా కనిపించడంలేదు. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటే తప్ప, ఇవి పూర్తిస్థాయిలో పనిచేయకపోవచ్చు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభావం రాష్ట్ర పరిపాలనపై ఎంతగానే ఉంది. ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఆయన బాటలో పయనించాలనుకుంటున్నారు. ఇలా పాలన సాగించడం తప్పు కాకపోయినా, తనదైన ముద్రను వేయాల్సిన అవసరం కిరణ్‌కుమార్‌కు ఎంతో ఉంది. పైగా, మంత్రుల్లో ఎక్కువమంది కిరణ్‌కుమార్ కన్నా సీనియర్లు కాబట్టి, వారందరి అభిమానాన్ని సంపాదించుకోవాల్సిన అవసరమూ ఉంది. వైఎస్‌ను మరిపించే రీతిలో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటేనే అది సాధ్యమవుతుంది. మరి మంత్రిగా కూడా పనిచేయని కిరణ్‌కుమార్, వీటన్నింటినీ చక్కబెట్టగలరా అన్నదే సందేహం.

అసమ్మతి సెగ

కిరణ్‌కుమార్‌రెడ్డిని ముప్పుతిప్పలు పెట్టడానికి, అనుక్షణం ఇబ్బందులకు గురి చేయడానికి కాంగ్రెస్‌లో అసమ్మతి వర్గం సిద్ధమయ్యింది. వ్యక్తిగతంగా కిరణ్‌కుమార్‌తో విభేదించే మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో అసమ్మతి మొదలయ్యింది. తనను కావాలనే మంత్రి వర్గం నుంచి పక్కన పెట్టారని భావిస్తున్న పెద్దిరెడ్డి, ఇకపై అసమ్మతి కార్యకలాపాలు కొనసాగించడానికి సిద్ధమయ్యారు. సాధారణంగా ఇలాంటివన్నీ గుట్టుగా సాగించడం కాంగ్రెస్ నేతల అలవాటు. కానీ, పెద్దిరెడ్డి మాత్రం సీఎంకు వ్యతిరేకంగా పనిచేస్తానంటూ బహిరంగంగా ప్రకటించారు. ఆయన చేసే తప్పుల కోసం ఎదురు చూస్తుంటామని పెద్దిరెడ్డి అంటున్నారు.
మంత్రి పదవులు ఆశించి భంగపడ్డవారు, పదవులు కోల్పోయిన వారు పెద్దిరెడ్డితో చేతులు కలిపే అవకాశాలున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి పెద్దిరెడ్డితో కలిసి చర్చలు జరిపారు. సీఎంకు వ్యతిరేకంగా కార్యకలాపాలను ఉధృతం చేయాలని వీరు భావిస్తున్నారు. మరికొంతమంది కూడా తమకు మద్దతు ప్రకటించే అవకాశం ఉందన్నది పెద్దిరెడ్డి అంచనా. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, అధిష్టానానికి విధేయత చూపిస్తూనే, సీఎంకు వ్యతిరేకంగా పనిచేస్తామని ఈ అసమ్మతివాదులు చెబుతున్నారు. శిల్పామోహన్‌రెడ్డి నేరుగా అసమ్మతివాదినని చెప్పుకోకపోయినా, సీఎం పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు.
ఒక్కసారి కూడా మంత్రిగా పనిచేయకుండానే, కిరణ్‌కుమార్‌రెడ్డికి ముఖ్యమంత్రిగా ప్రమోషన్ దక్కడం కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లకు మింగుడపడడం లేదు. పైగా, మంత్రి పదవుల పంపకంలోనూ అందరికీ కిరణ్ కుమార్ సంతృప్తి పరచకపోవడమూ సమస్యలను సృష్టించవచ్చు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే, ఇంతకుముందున్న ముఖ్యమంత్రుల్లా క్లీన్ రోడ్ కిరణ్‌కుమార్ ముందు లేదు. ఎదురుగా అన్నీ కష్టాలే కనిపిస్తున్నాయి. సమస్యల తోరణాలు స్వాగతం పలుకుతున్నాయి. ఓ వైపు మంత్రుల తిరుగుబాటు, మరోవైపు సొంతపార్టీలో అసమ్మతి వీటిని ఎదుర్కొని ముందుకుసాగడమంటే మాటలు కాదు. ఈ వారం రోజుల్లోనూ, అందరికీ చేరువయ్యే ప్రయత్నాలను కిరణ్‌కుమార్ చేయలేదు. గుట్టుగా, రహస్యంగానే నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ఇదే పద్దతిలో ముందుకు వెళితే మాత్రం సహచరుల నుంచి సహాయనిరాకరణ తప్పకపోవచ్చు. అందరినీ కలుపుకొని వెళ్లినప్పుడే ఎలాంటి సమస్యనైనా కిరణ్ సులువుగా అధిగమించగలుగుతారు.

1 కామెంట్‌: