Pages

17, ఆగస్టు 2010, మంగళవారం

సూపర్‌కాదు.. చెత్త బగ్


వైద్యానికి లొంగని వైరస్ దాడి చేస్తోందా..?
మనుషుల్లో వేగంగా వ్యాపిస్తోందా..?
ప్రపంచమంతా విస్తరిస్తోందా?
ఒక్కొక్కరినే బలితీసుకోబోతోందా..?
సూపర్‌బగ్‌కు చికిత్స లేదా..?
మన ఇండియా నుంచే వ్యాపిస్తోందా?
ఇండియా వచ్చిన వారిలోకి సూపర్‌బగ్ ప్రవేశిస్తుందా?
అవుననే అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. ఎలాంటి యాంటీబయాటిక్‌నైనా తట్టుకోగలిగే ఓ క్రిమిని వారు గుర్తించారు. 31 మంది పరిశోధకులు దీనికి సంబంధించిన వివరాలను లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా పెనుప్రమాదాన్ని సృష్టించవచ్చంటూ ఆందోళనను కూడా వ్యక్తం చేశారు. సూపర్‌బగ్‌ అని చెబుతున్న ఈ క్రిమికి ఓ లక్షణం ఉంది. ఎలాంటి బ్యాక్టీరియాలోకైనా ఇది చొచ్చుకు పోగలదు. అంతేకాదు.. యాంటీబయాటిక్‌లను తట్టుకునే శక్తిని ఆ బ్యాక్టీరియాలో అభివృద్ధి చేస్తుంది. ఇక ఆ బ్యాక్టీరియాను చంపడం ఎవరితరమూ కాదన్నమాట. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులేవీ, ఈ సూపర్‌బగ్ చేరిన బ్యాక్టీరియాను నిరోధించలేవంటున్నారు పరిశోధకులు. వైద్యచికిత్సతో చివరిప్రయత్నంగా అందించే అత్యంత శక్తికారి అయిన.. కార్బాపెనమ్స్‌కు కూడా ఇది లొంగదట. అందుకే.. అతిపెద్ద ప్రమాదం పొంచి ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంతవరకూ బాగానే ఉంది. ప్రాణాలతో చెలగాటమాడే ఓ ప్రమాదకర బగ్‌ను ముందుగానే గుర్తించనందుకు పరిశోధకులను ప్రశంసించాల్సిందే. కానీ, ఇక్కడే ఓ కీలకవిషయం దాగి ఉంది. కొత్తగా కనుగొన్న బగ్‌కు పేరుపెట్టాలి కాబట్టి.. దీనికీ ఓ పేరు పెట్టారు. అదే NDM-1. దీనిపూర్తి పేరు తెలుసుకుంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అదే న్యూఢిల్లీ మెటాల్లో -బీటా- లాక్టమోజ్. ఈ పేరే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలవరం కలిగిస్తోంది. అసలు న్యూఢిల్లీ పేరు పెట్టాల్సిన అవసరం ఏమిటి? పరిశోధకులు బగ్ గురించి చెప్పాలనుకున్నారా.. లేక, వైద్యరంగంలో భారత అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్నారా..

భారత్‌పై నింద

సూపర్‌బగ్.. అపరిశుభ్ర వాతావరణంలో పుడుతుంది. ముఖ్యంగా సర్జరీలు చేసే ఎక్విప్‌మెంట్‌ను సరిగ్గా క్లీన్‌చేయకపోతే తయారవుతుంది. దీన్నే బేస్ చేసుకుని.. ఇండియాకు, సూపర్‌బగ్‌కు లింకుపెట్టారు బ్రిటన్ పరిశోధకులు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో హాస్పిటల్స్ అధ్వాన్న పరిస్థితుల్లో ఉండగా.. అక్కడెక్కడా పుట్టని ఈ సూపర్‌బగ్‌.. మనదేశంలోనే తయారవుతోందని తేల్చేశారు. బగ్ లక్షణాలు బ్రిటన్‌వాసుల్లో ముందుగా బయటపడ్డా.. దానికి బలయ్యింది మాత్రం మన దేశరాజధాని న్యూఢిల్లీనే.

శస్త్రచికిత్సల కోసం ఇండియాకు వెళ్లిన విదేశీయుల్లోనే ఈ బగ్ ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు. 37 మంది బ్రిటీష్ పౌరుల్లో ఈ బగ్ ఆనవాళ్లు ఉన్నాయట, వీరిలో దాదాపు 20 మందిదాకా ఇండియా, పాకిస్తాన్‌కు వెళ్లివచ్చినవారే అంటున్నారు పరిశోధకులు. ఇదే మనదేశంపై సూపర్‌బగ్ నింద మోపడానికి ప్రధాన కారణం. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని కొన్ని ప్రాంతాల్లోనే పరిశోధనలు చేసి.. ఈ నిర్దారణకు వచ్చేశారు. మన దగ్గర నుంచే ప్రపంచానికి ఈ ప్రమాదకరక్రిమి వ్యాపిస్తోందని ఆరోపిస్తున్నారు. అంతేకానీ, ప్రపంచమంతటా శాంపిల్స్ తీసుకొని పరిశోధించింది కూడా లేదు. ఇక పేరు విషయాన్ని చూస్తే.. న్యూఢిల్లీలో తొలిసారి ఈ క్రిమిని గుర్తించడంతో దానికి ఆ పేరును పెట్టేశారు. గుర్తింపు కోసమే ఈ పేరును పెట్టినప్పటికీ.. దానివల్ల మంచికన్నా ఇప్పుడు చెడే ఎక్కువగా జరగనుంది. న్యూఢిల్లీ పేరు చెబితేనే, విదేశీయులు భయపడే పరిస్థితిని ఈ పరిశోధన తెచ్చిపెట్టింది. అసలు ఓ దేశంపై నిందవేయాల్సిన అవసరం ఉందా..

దురుద్దేశమా?

ఇక్కడే మరో విషయాన్ని చెప్పుకోవాలి. ఈ పరిశోధనలో పాలుపంచుకున్న చెన్నై స్కాలర్ కార్తికేయన్ కుమారస్వామి కొట్టి పారేశారు. తాము రాసింది ఒకటైతే.. దాన్ని వక్రీకరించి ప్రచురించారంటున్నారు. ఈ సూపర్‌బగ్ గురించి వచ్చినవన్నీ ఊహాజనితమైన అంశాలేనంటూ ప్రకటించారు. ఎన్‌డీఎం-1 అన్ని యాంటీబయాటిక్స్‌ను తట్టుకుంటుందనడంలోనూ వాస్తవం లేదంటున్నారు. ఇదంతా చూస్తుంటే.. మనదేశంపై ఏదో కుట్ర కావాలనే జరుగుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ కుట్రేమిటి?

మెడికల్ టూరిజంపై దాడా?

సూపర్‌బగ్ కేవలం న్యూఢిల్లీలోనే ఉందా.. అక్కడి నుంచే ప్రపంచమంతా వ్యాపిస్తోందా..? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే.. విదేశీ పరిశోధకులు మనపై ఎంతగా కత్తిగట్టారో అర్థమవుతుంది. వాస్తవానికి ఈ సూపర్‌బగ్ ఆనవాళ్లు మనదేశంలో మాత్రమే కనిపించలేదు. ప్రపంచమంతా చాలా దేశాల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. మనదేశంతో పాటు, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోనూ ఈ సూపర్‌బగ్ సోకుతోంది. అంతేకాదు, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్, అమెరికా, నెదర్లాండ్స్‌ల్లో ఈ సూపర్‌బగ్ ఆనవాళ్లు కనిపించాయి. మిగిలినదేశాల్లో ఈ రకమైన పరిశోధనలు జరగలేదు కాబట్టి.. అక్కడ ఈ బగ్ ఉందో లేదో తెలియదు. ఇన్ని దేశాల్లో సూపర్‌బగ్ ఉన్నప్పుడు దానికి, మనదేశాన్ని మాత్రమే బాధ్యుల్ని చేయడం కరెక్టేనా..? కచ్చితంగా కాదు. మనదేశంలో ముందుగా గుర్తించారు గానీ, ఎక్కడ నుంచి వచ్చింది? ఎలా వచ్చిందన్నది ఇంకా తేలలేదు. విదేశాల నుంచి మనకు టూరిస్టులు ఎక్కువగా వస్తారు కాబట్టి. .వారు ఈ వైరస్‌ను మనదేశంలోకి తెచ్చి ఉండకూడదా..?

సూపర్‌బగ్‌ నేరుగా మనిషిని అంతం చేయదు. కొన్ని రకాల బ్యాక్టీరియాల్లోకి చేరి వాటిని యాంటీబయాటిక్‌లను తట్టుకునేలా మార్చుతుంది. ఇంతకన్నా ప్రమాదకరమైన వైరస్‌లు, బ్యాక్టీరియాలు ఎన్నో దేశాల నుంచి ప్రపంచానికి పాకాయి. అది హెచ్‌ఐవీ అయినా, బర్డ్‌ఫ్లూ అయినా, చివరకు.. ప్రాణాంతక స్వైన్‌ఫ్లూను కలగజేసే H1N1 వైరస్ అయినా.. దేనికీ, ఏ పట్టణం పేరునూ పెట్టలేదు. అంతెందుకు, ఇన్ఫెక్షన్స్‌ను కలగజేసే సూపర్‌బగ్‌ను 2006లో టెక్సాస్‌లోని హూస్టన్‌లో కనిపెట్టారు. దానికి VIM-7 అని పేరుపెట్టారే తప్ప.. హూస్టర్ సూపర్‌బగ్ అని పిలవలేదు. దీన్ని బట్టి, మనపై కుట్ర చేశారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.

ఇంతకీ ఇండియాపై ఇంత పెద్ద మచ్చవేయడానికి కారణం ఏమిటనుకుంటున్నారా..? అదే మెడికల్ టూరిజం. ప్రపంచశక్తుల్లో ఒకటిగా ఎదుగుతున్న మనదేశం ఇప్పుడు మెడికల్ టూరిజానికి కేరాఫ్ అడ్రస్. అమెరికా,బ్రిటన్ ఇలా అగ్రరాజ్యాలుగా చెప్పుకునే దేశాల్లో కోట్లు ఖర్చుపెడితే గానీ దొరకని వైద్యం, మన దగ్గర లక్షల్లోనే అందుతుంది. బైపాస్ సర్జరీ కోసం ఒకప్పుడు భారతీయులు అమెరికాకు వెళితే.. ఇప్పుడు హార్ట్ సర్జరీతో సహా, మోకాలి సమస్యలు, లివర్‌ ట్రాన్‌ప్లాంటేషన్, ప్లాస్టిక్ సర్జరీలు, బోన్‌మారో సర్జరీల కోసం విదేశీయులంతా మనవైపు చూస్తున్నారు. ప్రతీఏటా వేలాది మంది మనదేశానికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. అమెరికా, బ్రిటన్‌లతో పోల్చితే.. మూడొంతుల తక్కువ ఖర్చుకే మనదగ్గర ఆపరేషన్లు చేయించుకోవచ్చు. ఇండియాలో ఓపెన్ హార్ట్ సర్జరీకి 4500 డాలర్లు ఖర్చైతే, బ్రిటన్‌లో 18 వేల డాలర్లు ఖర్చుపెట్టాలి. న్యూరో సర్జరీకి మనదగ్గర 4300 డాలర్లు చెల్లించాల్సి ఉంటే.. బ్రిటన్‌లో 13 వేల డాలర్లు కడితే తప్ప పని జరగదు. హిప్ రీప్లేస్‌మెంట్‌కు మన దగ్గర 4300 చెల్లిస్తే చాలు.. అదే బ్రిటన్‌లో అయితే 13 వేల డాలర్లు వదలించుకోవాలి. పైగా.. మనదగ్గర ట్రీట్‌మెంట్ తక్షణం అందుతుంది. అమెరికా, బ్రిటన్‌లో కనీసం ఏడాది పాటు వెయిటింగ్‌లో ఉండాలి. ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టే... విదేశీయులు ఇండియాలో ట్రీట్‌మెంట్‌కు తరలి వస్తున్నారు.

వైరస్‌లు సోకకుండా, కొత్త రోగాలు పేషెంట్లకు వ్యాపించకుండా ఇండియన్ హాస్పిటల్స్ ఎన్నో జాగ్రత్తలు పాటిస్తాయి. సుదూరప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్ల కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాయి. ఒక్క 2008లోనే సర్జరీలు, దంత చికిత్సల కోసం బ్రిటన్ నుంచి లక్షమంది ఇతర దేశాలకు వెళ్లినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఇందులో సగానికిపైగా ట్రీట్‌మెంట్ పొందింది మనదేశంలోనే. ఈ సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతుండడం అక్కడి కార్పొరేట్ హాస్పిటల్స్‌ను, డ్రగ్స్ కంపెనీలను కలవరపెడుతోంది. ముఖ్యంగా కాస్మోటిక్ సర్జరీలకోసం ఎక్కువ మంది ఇండియాకు వస్తుండడంతోనే.. ఇప్పుడు సూపర్‌బగ్‌పై ఆందోళన లేవనెత్తినట్లు సమాచారం. దీనికి తగ్గట్లుగానే రీసెర్చ్ పేపర్ చివర్లో ఇండియాకు వెళ్లొద్దంటూ సూచించడమూ అనుమానాలను కలిగిస్తోంది. మెడికల్ టూరిజం పరంగా ఇండియా ఎదుగుదలను ఓర్చుకోలేకే ఈ సూపర్‌బగ్ విషయంలో ఇండియాను అప్రతిష్ట పాలు చేస్తున్నారనడానికి ఈ రిపోర్టే ఓ సాక్ష్యం.

హైదరాబాద్‌లోనూ బగ్..

మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ ఈ బగ్‌ను గుర్తించినట్లు ది లాన్‌సెట్ జర్నల్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు, ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, కోల్‌కతా,వారణాసి, గౌహతి, పోర్ట్‌బ్లెయిర్‌లో ఈ సూపర్‌బగ్ ఉన్నట్లు బ్రిటన్ పరిశోధకులు అంటున్నారు. ఇవన్నీ పర్యాటక ప్రాంతాలే కాక, వైద్యరంగంలోనూ విశేషంగా అభివృద్ధి చెందుతున్నాయి. వీటిని టార్గెట్ చేసుకుంటే.. మెడికల్ టూరిజంను అడ్డుకోవచ్చని బ్రిటన్ రీసెర్చర్స్ భావించనట్లున్నారు. చాలా దేశాల్లో ఈ బగ్ ఉన్నప్పటికీ, ఇండియాకు వెళ్లి కొస్మొటిక్ సర్జరీలు చేసుకుంటేనే, సూపర్‌బగ్ ప్రవేశిస్తుందని హెచ్చరించడమూ, మనపై కక్షను చాటి చెబుతుంది.
ఇక నేరుగా న్యూఢిల్లీ పేరునే పెట్టడంతో, ప్రపంచవ్యాప్తంగా ఈ బగ్‌ గురించి తెలుస్తుంది. పైగా.. మనదేశంలో మాత్రమే ఉంటుందన్న జనరల్ ఓపీనియన్ కూడా ఏర్పడిపోతుంది. దీన్నే ఇప్పుడు ప్రభుత్వం అడ్డుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో ఏదో మతలబు ఉందంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా, సీరియస్‌గా మాత్రం స్పందించడం లేదు. అసలు ఆ సూపర్‌బగ్‌ పేరులో ఉన్న న్యూఢిల్లీ పదాన్ని వెంటనే తొలగించేలా చేయాలి. వైద్యరంగంలో మన ప్రతిష్టను కాపాడాలి.
దీంతో పాటు.. సూపర్‌బగ్‌కు ఇండియా మాత్రమే కేంద్రం కాదని చెప్పాలి. మన హాస్పిటల్స్ ఎంత పరిశుభ్రంగా ఉంటాయో.. విదేశీయులకు ఎంత మంచి ట్రీట్‌మెంట్ లభిస్తుందో ప్రపంచానికి చాటి చెప్పాలి. లేదంటే, వైద్యం కోసం మనదేశానికి వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది.

1 కామెంట్‌: