Pages

23, జనవరి 2010, శనివారం

క్షణాల్లో వైఎస్ మృతి...


బెల్ - 430 .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార హెలికాప్టర్. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ఎక్కువగా ప్రయాణించింది ఇందులోనే. కొత్త హెలికాప్టర్ అందుబాటులో లేకపోవడంతో.. వైఎస్ రాజశేఖరరెడ్డి.. తిరుపతి టూర్‌కు బెల్‌-430నే సిద్ధం చేశారు. సెప్టెంబర్ 2న ఉదయం ఆరు గంటలకే.. ప్రీ ఫ్లైట్ చెక్‌ను నిర్వహించారు. ప్రీఫ్లైట్ టాస్క్‌కార్డ్ ప్రకారం.. హెలికాప్టర్‌లో అన్ని వ్యవస్థలు సక్రమంగానే పనిచేస్తున్నాయి. నిబంధనలకు అనుగుణంగానే అన్నీ ఉన్నాయని పైలెట్లు కూడా అంగీకరించారు. ఏటీసీతో జరిపిన సంభాషణల్లోనూ... ట్రాన్స్‌మిషన్ ఆయిల్ లోపాలు ప్రస్తావనకు రాలేదు. ఆ తర్వాతే.. హెలికాప్టర్ ప్రయాణానికి అనుమతి లభించింది.
ఇక ప్రయాణం ప్రారంభమైన తర్వాత.. ఏటీసీ నిర్దేశించిన మార్గంలో ఎక్కడా హెలికాప్టర్ ప్రయాణించలేదు. రాడార్ గుర్తించిన దాని ప్రకారం... బేగంపేట నుంచి కొద్ది దూరం.. నిర్దేశిత మార్గానికి కుడివైపున.. ఆ తర్వాత.. ఎడమవైపున ప్రయాణించింది. మేఘాలు ఎక్కువగా ఉండడం వల్లే.. ఇలా పక్కకు వెళ్లారని కాక్‌పిట్ వాయిస్ రికార్డులు చెబుతున్నా... ఆ సమయంలో వాతావరణాన్ని పూర్తిగా అంచనా వేయడంలో పైలెట్లు విఫలమయ్యారనే చెప్పాలి. అసలే మబ్బుల్లో చిక్కుకుపోయిన హెలికాప్టర్‌ను బయటకు తీసుకురాలేకపోయారు పైలెట్లు. నిర్దేశిత మార్గానికి ఎడమవైపు వెళుతూనే... మరింత ప్రమాదంలో చిక్కుకుపోయారు. ఏటీసీతో సంబంధాలు తెగిపోవడంతో.. వాతావరణంపై సమచారం తెలుసుకునే అవకాశమూ లేకుండా పోయింది. దీంతో.. కేవలం జీపీఎస్ ఆధారంగానే ముందుకు వెళ్లారు. కొంచెం ముందుకెళితే అంతా బాగానే ఉంటుందని పైలెట్లు వేసుకున్న అంచనాలే.. కొంప ముంచాయి.
ప్రయాణం మొదలయ్యే సరికి హెలికాప్టర్ కండీషన్ బాగానే ఉందని రికార్డులు చెబుతున్నా.. గాల్లో ఉండగానే.. ఆయిల్ ట్రాన్స్‌మిషన్‌లో సమస్యలు తలెత్తాయి. ఈ లోపాన్ని ఎలా సరిదిద్దాలో పైలెట్లకు అర్థం కాలేదు. దీనిపై వారికి అవగాహన కూడా లేకపోవడంతో.. చెక్‌లిస్ట్‌ను వెతకడం మొదలుపెట్టారు. ఈ సమయానికి పావురాల గుట్టకు చేరువలో ఉంది.. వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్. నేరుగా వెళుతున్న హెలికాప్టర్ ఒక్కసారిగా.. దాదాపు 90 డిగ్రీలు మళ్లి కొండ వైపుగా వెళ్లడం మొదలుపెట్టింది. చెక్‌లిస్ట్‌ను వెతకడంలో మునిగిపోయిన పైలెట్లు... హెలికాప్టర్ టర్న్ అవ్వడాన్ని వెంటనే గుర్తించలేకపోయారు. ముందుగా కో-పైలెట్ ఎంఎస్.ఎన్.రెడ్డి తేరుకుని.. గో ఎరౌండ్ అంటూ గట్టిగా అరిచారు. కానీ.. అప్పటికే అదుపు తప్పిపోయింది. 33 సెకన్లలో పావురాలగుట్టను ఢీకొట్టి.. పేలిపోయింది. హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తకపోయినా.. సడన్‌గా టర్న్ కాకాపోయినా.. ఈ ప్రమాదం జరిగుండేది కాదు.

క్షణక్షణం..

ఉదయం 8 గంటల 38 నిమిషాలకు.. అనుమతి లభించడంతో హెలికాప్టర్ బేగంపేట నుంచి బయల్దేరింది. 5500 అడుగుల ఎత్తులో ప్రయాణించడానికి ఏటీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేఘాలు దట్టంగానే ఉన్నా... దాదాపు అరగంట పాటు.. ఎలాంటి ఇబ్బందిలేకుండానే ప్రయాణం సాగింది.
సమయం 9 గంటల 3 నిమిషాల 20 సెకన్లయ్యింది. అప్పటికి.. 46 నాటికల్ మైళ్ల దూరంలో.. 5600 అడుగుల ఎత్తున హెలికాప్టర్ ప్రయాణిస్తోంది. 50 మైళ్లకు చేరగానే.. 5500 అడుగులకు దిగిరావాలని ఏటీసీ పైలెట్లకు సూచించింది. 9 గంటల 7 నిమిషాల 46 సెకన్లకు.. 120 నాట్స్ వేగంతో, 5500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నట్లు పైలెట్లు సమాచారం అందించారు. మరో మూడునిమిషాల్లోకే .. 64 నాటికల్ మైళ్ల దూరానికి హెలికాప్టర్ చేరుకొంది. అక్కడే దట్టమైన మేఘాల్లోకి ప్రవేశించింది. వాతావరణ వివరాలు అందించే హెలికాప్టర్‌లోని రాడార్.. రెడ్ సిగ్నల్ ఇవ్వడం మొదలుపెట్టింది. 9 గంటల 12 నిమిషాల 52 సెకన్లకు హైదరాబాద్‌లోని ఏటీసీని చివరిసారిగా సంప్రదించారు. మరికాసేపటికే.. రాడార్లకు హెలికాప్టర్‌కు మధ్య సంబంధాలు కట్ అయ్యాయి. మేఘాలు అడ్డుగా ఉండడంతో.. నిర్దేశించిన మార్గానికి.. కొద్దిగా ఎడమవైపు వెళ్లాలని పైలెట్లు నిర్ణయించారు. ఆదిశగా ప్రయాణం మొదలుపెట్టారు. అప్పటికీ మేఘాల్లోనూ హెలికాప్టర్ వెళుతోంది. 9 గంటల 16 నిమిషాల 31 సెకన్లకు కుడివైపున మరిన్ని మేఘాలు ఉన్నట్లు పైలెట్లు గుర్తించారు. కృష్ణ దాటిన తర్వాత ఎడమవైపుకు మళ్లాలని నిర్ణయించుకున్నారు. 9 గంటల 20 నిమిషాల 22 సెకన్లకు.. పైలెట్ల సంభాషణలు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో రికార్డ్ అయ్యింది. కృష్ణానది దాటిన తర్వాత వాతావరణ పరిస్థితి మెరుగుపడుతుందని పైలెట్లు భావించారు. కానీ.. అప్పుడే అసలు సమస్య మొదలయ్యింది.
9 గంటల 21 నిమిషాల 7 సెకన్లకు. .. హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఛాపర్ ప్రయాణించడానికి కీలకమైన ట్రాన్స్‌మిషన్ ఆయిల్ ప్రెజర్‌లో తేడాలు వచ్చాయి. అటోపైలెట్‌ను ఆన్ చేసి.. సమస్యను పరిష్కరించడానికి చెక్‌లిస్ట్‌ను వెతకడంలో పైలెట్లు మునిగిపోయారు. 9 గంటల 27 నిమిషాల 24 సెకన్లయ్యే సరికి.. ఊహించని ప్రమాదం ముంచుకొచ్చింది. ఎదురుగా నేలను గమనించిన కోపైలెట్ ఎం.ఎస్.ఎన్. రెడ్డి.. గో ఎరౌండ్ అంటూ.. గట్టిగా అరిచారు. ఆ సమయంలో నిమిషానికి 10 వేల అడుగుల వేగంతో కిందకు దిగిపోతోంది. హెలికాప్టర్‌పై అప్పటికే పైలెట్లు నియంత్రణ కోల్పోయారు. ప్రమాదం నుంచి బయటపడడానికి ప్రయత్నించడానికి కూడా.. పైలెట్ల చేతిలో సమయంలేదు. షాక్ నుంచి తేరుకునేలోగానే.. హెలికాప్టర్ వేగంగా దూసుకువెళ్లి... పావురాలగుట్టపై వేగంగా కూలిపోయింది. తునాతునకలవ్వడంతో.. శకలాలు చెల్లాచెదురయ్యాయి. 9 గంటల 27 నిమిషాల 57 సెకన్లకు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ ఆగిపోయింది.

హెలికాప్టర్‌ మెయింటైనెన్స్‌

రాష్ట్రంలో అతి ముఖ్యమైన వ్యక్తులు ప్రయాణించే హెలికాప్టర్‌ కానీ, ఇతర వాహనాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కాగితాల్లో గొప్పగా చెప్పుకుంటారు.. కానీ, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని మృత్యువులోకి లాక్కుపోయిన బెల్‌ 430 విషయంలో కనీసం ఆ కాగితాలపై కూడా సరైన రికార్డులు లేవు.. హెలికాప్టర్‌ను నిర్వహిస్తున్న సంస్థ దాని ప్రయాణానికి సంబంధించి కానీ, లోపాల గురించి కానీ, మరమ్మతుల గురించి కానీ సరైన రీతిలో రిజిష్టర్లు నిర్వహించలేదు.

బెల్‌ 430 రెండు ఇంజన్లతో నడిచే హెలికాప్టర్‌. ఇది నాలుగు బ్లేడ్ల ప్రధాన పంఖా, మరో టెయిల్‌ రోటార్లను కలిగి ఉంటుంది. టెయిల్‌ రోటార్‌ హెలికాప్టర్‌ దిశను నిర్దేశిస్తుంది. విఐపిలు ప్రయాణించేందుకు ఇది అనువైన హెలికాప్టరే అయినా దీని నిర్వహణ విషయంలోనే అధికారులు మొదటి నుంచీ అలసత్వం ప్రదర్శించినట్లు స్పష్టంగానే అర్థం అవుతోంది.

2007 నవంబర్‌ 1న హెలికాప్టర్‌లోని మొదటి ఇంజన్‌ను తొలగించారు. దానికి మరమ్మతులు చేసి రెండో ఇంజన్‌ స్థానంలో అమర్చారు.. అయితే మొదటి ఇంజన్‌లో తలెత్తిన లోపం ఏమిటి? రెండో ఇంజన్‌ను తొలగించి మొదటి ఇంజన్‌ను ఆ స్థానంలో ఉంచేందుకు కారణం ఏమిటి? అన్న వివరాలను ఎక్కడా నమోదు చేయలేదు. ఇందుకు సంబంధించిన లాగ్‌ బుక్‌ను కూడా నిర్వహించలేదు.

ఏ హెలికాప్టర్‌ అయినా అది ప్రయాణించిన ప్రతిసారీ ఏదైనా లోపం తలెత్తినప్పుడు దాని వివరాలు, కారణాలు, దాన్ని సరిదిద్దటానికి చేపట్టిన చర్యలు ఏమిటన్న విషయాలకోసం స్నాగ్‌ రిజిష్టర్‌ను నిర్వహిస్తారు.. బెల్‌ 430కి అలాంటి రిజిష్టరే లేదు.. కారణం ఏమిటో తెలియదు..విచిత్రమేమిటంటే ఈ హెలికాప్టర్‌కు సంబంధించిన జర్నీ లాగ్‌బుక్‌ కూడా అస్తవ్యస్తంగానే ఉంది. 2009 ఆగస్టు 7వ తేదీ తరువాత ఈ హెలికాప్టర్‌ ప్రయాణానికి చెందిన వివరాలు లేవు. అంటే ఆగస్టు 7-2009 తరువాత హెలికాప్టర్‌ ఎక్కడికీ ప్రయాణించలేదా? ఒక వేళ వెళ్లినా రికార్డులో నమోదు కాలేదా? అన్నది స్పష్టంగా లేదు. గత ఏడాది కాలంగా జర్నీ లాగ్‌బుక్‌లో ఒకసారి కానీ, అంతకు ఎక్కువ సార్లు కానీ లోపాలు తలెత్తిన సూచనలు లేవు..
అయితే ఎమర్జెన్సీ లొకేటర్‌ ట్రాన్స్‌మీటర్‌ జూన్‌ 18, 2009 న ఇన్‌స్టాల్‌ చేశారు.. అది మాత్రం సరిగ్గానే పనిచేసినట్లు త్యాగి నివేదిక భావించింది.

లైసెన్సులు కరెక్టుగానే ఉన్నాయా...

ఏ హెలికాప్టర్‌ నడిపే పైలెట్‌కైనా ఇద్దరు నిపుణులు ఇన్‌స్ట్రుమెంట్‌ రేటింగ్‌ టెస్ట్‌లను చేస్తారు.. ఆ పరీక్షల్లో సంతృప్తి అయిన తరువాత కానీ పైలెట్‌కు లైసెన్స్‌ జారీ చేయరాదని ఏవియేషన్‌ నిబంధనలు స్పష్టంగా చెప్తున్నాయి. కానీ, బెల్‌ -430 విషయంలో భాటియాకు ఒక పరీక్ష నిర్వహించటంతోనే సరిపెట్టారు. ఎందుకో తెలియదు.. భాటియా పైలట్‌ ట్రైనింగ్‌ తీసుకున్న తరువాత 2007లో డిజిసిఏ ఇన్‌స్ట్రక్టర్‌ ఆమోదించారు.. ఆ తరువాత రెండేళ్ల తరువాత జూన్‌ 2009లో మాత్రం సిమ్యులేటర్‌ ట్రైనింగ్‌ను భాటియా పూర్తిగా తీసుకోలేదు..

2009 జనవరిలో ఇదే పైలట్‌ బౌద్ధ మతాచార్యుడు దలైలామా ను హైదరాబాద్‌, గుల్బర్గాకు తీసుకువెళ్తున్న సమయంలో హెలికాప్టర్‌ తీవ్రంగా హైడ్రాలిక్‌ ఒత్తిళ్లకు లోనై ఊగిపోయింది. ఆ సమయంలో కోపైలెట్‌ హెచ్చరిస్తున్నా, తగిన చర్య తీసుకోవటంలో భాటియా విఫలమయ్యాడు. 2009 జూన్‌లో రెండుసార్లు, అంతకు ముందు 2007లో మరోసారి కూడా ఆయన హెలికాప్టర్‌లో లోపాలు తలెత్తినప్పుడు సరిదిద్దలేకపోయారు..

ఏ పైలెట్‌ అయినా హెలికాప్టర్‌ నడిపే ముందు మద్యం సేవించలేదని నిర్ధారించే పరీక్షను ఎదుర్కోవాలి. గతంలో ఒకసారి భాటియా ఈ పరీక్షను ఎదుర్కొనేందుకు నిరాకరించారు.. ఎయిర్‌క్రాఫ్ట్‌ రూల్‌ 24ప్రకారం ఇది తీవ్రమైన నేరం.

ఇక కోపైలట్‌ ఎం.ఎస్‌రెడ్డి భారత సైన్యంలో పనిచేసి రిటైర్‌ అయిన అధికారి. రెడ్డి గతంలో ఎలాంటి ప్రమాదాల్లో చిక్కుకున్న సందర్భం లేదు.. 2009 మార్చి ఆరున డిజిసిఏ ఆమోదించిన అధికారితో ఇన్స్‌ట్రుమెంట్‌ రేటింగ్‌ టెస్ట్‌ నిర్వహించారు.. పరీక్షల్లో పాస్‌ అయినా ఇంకా ప్రాక్టీస్‌ అవసరమని ఎగ్జామినర్‌ తన నివేదికలో పేర్కొన్నారు. త్యాగి విచారణ కమిటీకి మాత్రం ఎంఎస్‌ రెడ్డికి సంబంధించిన లైసెన్స్‌, ఒరిజినల్‌ లాగ్‌బుక్‌ను అధికారులు అందించలేకపోయారు.

సెప్టెంబర్‌ రెండున కోపైలట్‌ గో అరౌండ్‌ అని పలుసార్లు హెచ్చరించినా పైలెట్‌ దాన్ని సరిగ్గా పట్టించుకోలేదని త్యాగి నివేదిక విస్పష్టంగా తేల్చి చెప్పింది.


వాతావరణం ఎలా ఉంది..


వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి బయలు దేరటానికి ముందు హైదరాబాద్‌లో వాతావరణం బాగానే ఉంది. ఆయితే ఆయన ప్రయాణించే మార్గమంతా ఉన్న వాతావరణాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించదు..బేగంపేట విమానాశ్రయంలోని వాతావరణ శాఖ సెప్టెంబర్‌ రెండున ఉదయం 8.10 నుంచి 12.10 వరకు నాలుగు నుంచి 9 నాటికన్‌ మైళ్ల గాలులే ఉంటాయని, 5 కిలోమీటర్ల మేర విజిబులిటీ ఉంటుందని చెప్పింది. ఈ రిపోర్ట్‌ను ఆధారం చేసుకునే వైఎస్‌ ప్రయాణమయ్యారు. అయితే శంషాబాద్‌లోని వాతావరణ శాఖ వాయవ్య దిశగా గాలులు కొంత బలంగానే వీస్తున్నట్లు గుర్తించింది. విజిబులిటీ మాత్రం నాలుగు కిలోమీటర్లే ఉంది. మేఘాలు తక్కువ ఎత్తులో ఉన్నట్లు, వర్షం కూడా కురుస్తున్నట్లు పేర్కొంది. కర్నూలు కూడా మేఘావృతమై ఉంది. అక్కడ కూడా వెలుతురు సరిగా లేదు. ప్రమాదం జరిగిన రుద్రకోడూరు ప్రాంతంలో ఉదయం ఆరుగంటల సమయానికే తక్కువ ఎత్తులో మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. ఎనిమిది గంటల కల్లా మేఘాలు ఇంకా దట్టమయ్యాయి. తొమ్మిది గంటల సమయానికి రుద్రకోడూరు నల్లమల కనుమలపై దారి కనిపించనంత దట్టంగా మేఘాలు కమ్ముకునిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పగలే రాత్రి మాదిరిగా గాఢాంధకారం అలుముకుంది..ఉదయం 9గంటలకు ఒకసారి, 9.30గంటలకు మరోసారి భారీ మెరుపులు ఈ ప్రాంతంలో సంభవించినట్లు ఇండియా ప్రెసిషన్‌ లైటెనింగ్‌ నెట్‌వర్క్‌, రేషనల్‌ టెక్నాలజీస్‌ లు నివేదికను ఇచ్చాయి. ప్రమాదం జరిగిన సమయంలో వర్షం అత్యంత భారీగా కురుస్తున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు కూడా త్యాగి బృందానికి విచారణ సమయంలో వివరించారు. అంతేకాదు.. హెలికాప్టర్‌ ప్రయాణించిన సమయంలో విజువల్‌ ఫ్లైట్‌ రూట్‌లో వెళ్లాలన్న నిబంధనలను సైతం వీళ్లు పాటించినట్లు కనిపించదు..

కాక్‌పిట్ వాయిస్ రికార్డుల సాక్ష్యాలు..


నల్లమల అడవుల్లో కూలిపోయిన బెల్-430 హెలికాప్టర్ నుంచి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్.. సీవీఆర్ ను ప్రమాదంపై విచారణ చేస్తున్న డీజీసీఏ బృందం సేకరించింది. అయితే.. అత్యంత వేగంగా.. హెలికాప్టర్ కూలిపోవడంతో.. ఈ సీవీఆర్ కూడా డామేజ్ అయ్యింది. అమెరికాలోని వాషింగ్‌టన్‌లో NTSBలో దీన్నుంటి వాయిస్‌ను డీకోడ్ చేశారు. ప్రమాదానికి సంబంధించి కొన్ని కీలక వివరాలను అందించింది. ప్రయాణానికి ముందే.. వాతావరణం గురించి పూర్తి వివరాలు పైలెట్‌కు, కోపైలెట్‌కు తెలుసని సీవీఆర్ వెల్లడించింది. చెన్నై HF ఫ్రీకెన్సీకి మారేవరకూ.. హైదరాబాద్‌తో VHF ఫ్రీకెన్సీతో కనెక్ట్ అయ్యి ఉంది. చెన్నై ఫ్రీక్వెన్సీ ఏమిటన్నది పైలెట్లకు తెలియదన్న విషయాన్ని.. సీవీఆర్ బయటపెట్టింది. హైదరాబాద్ నుంచి అందిన ఫ్రీక్వెన్సీ సమాచారం కరెక్టా కాదా అన్నది.. పైలెట్, కోపైలెట్‌లు చర్చించుకోవడం కాక్‌పిట్ వాయిస్‌లో రికార్డ్ అయ్యింది. ప్రయాణానికి ముందే సరైన ప్లానింగ్ చేసుకోలేదనడానికి ఇదో నిదర్శనం.
వాతావరణ సరిగ్గా లేకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యల గురించి పైలెట్ ఇన్ కమాండ్ భాటియాకు పూర్తిగా తెలుసు. మేఘాలను తప్పించే క్రమంలో కిందకూ, పైకి వెళ్లే సమయంలోనూ, టర్బోలెన్స్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని కోపైలెట్ ఎం.ఎస్.ఎన్.రెడ్డికి ఆదేశాలు ఇచ్చాడు. IIDSలో ట్రాన్స్‌మిషన్ ప్రెజర్ తగ్గినట్లు ఇండికేషన్ వచ్చింది. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి ఎమర్జెన్సీ చెక్‌లిస్ట్‌ను వెతకడం మొదలుపెట్టారు. ఇందులోనూ, ఫ్లైట్ మాన్యువల్‌లోనూ.. వారికి కావాల్సిన సమాచారం దొరకలేదు. సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునే ప్రయత్నంలో మునిగిపోయిన పైలెట్లు.. వాతావరణం సరిగ్గా లేదన్న విషయాన్ని పట్టించుకోలేదు. హెలికాప్టర్ నేలకు పడిపోతున్నవిషయాన్ని గుర్తించిన కో పైలెట్.. గో ఎరౌండ్ అంటూ గట్టిగా అరిచాడు. సీవీఆర్ రిపోర్ట్‌ను పూర్తిగా విశ్లేషించిన త్యాగి బృందం.. పైలెట్ల మధ్య సమన్వయలోపం ఎక్కువగా ఉందని గుర్తించింది. వీరిద్దరి మధ్యా సరైన అవగాహన లేకపోవడం వల్లే.. ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి