Pages

17, డిసెంబర్ 2009, గురువారం

మళ్లీ తెలంగాణ పోరు


దాదాపు వారం రోజుల పాటు మౌనంగా ఉన్న తెలంగాణ వాదుల్లో మళ్ళీ 'చిరు' కదలిక వచ్చింది. సమైక్యాంధ్ర నినాదం ఊపందుకుని మరింత ఉధృతమవుతున్న తరుణంలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సమైక్యాంధ్ర వైపునకు మొగ్గు చూపనన్నారనే సంకేతాలు కనబడడంతో తెలంగాణవాదులు మండిపడ్డారు. ''చిరంజీవి పరివార్‌'' కటౌట్లు, ఫ్లెక్సీలు ధ్వంసంచేసి దిష్టిబొమ్మలను దగ్ధంచేశారు. ''సమైక్యాంధ్ర''కు జై కొడితే తెలంగాణ ప్రాంతంలోవారి సినిమాలను బహిష్కరిస్తామని తెలంగాణవాదులు ''ఫత్వా'' జారీచేశారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల ఒత్తిడి మేరకు చిరంజీవి సామాజిక తెలంగాణ నినాదాన్ని వదిలి సమైక్యాంధ్ర జెండా పట్టనున్నాడనే వార్తలు తెలంగాణాలో ఏర్పడిన స్తబ్దతను తొలగించింది. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మళ్ళీ లొల్లి మొదలైంది. చిరంజీవి కుమారుడు రాంచరణ్‌తేజ్‌, అల్లుడు అల్లు అర్జున్‌, గీతా ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ సినిమాలను నిలిపివేస్తామంటూ తెలంగాణ వాదులు ప్రకటించారు. మరో నటుడు మోహన్‌బాబు కూడా గురువారం సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనదీక్షను కొనసాగిస్తానని ప్రకటించడంతో ఆయన కుమారుడు విష్ణు నటించిన సలీమ్‌ సినిమా ప్రదర్శనలను కూడా తెలంగాణాలో అడ్డుకున్నారు. పలుచోట్ల చిరంజీవి, చంద్రబాబు నాయుడు, వైఎస్‌ జగన్‌, లగడపాటి రాజగోపాల్‌ల దిష్టిబొమ్మలను, తెలంగాణవాదులు, విద్యార్థులు దహనం చేశారు. సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. విద్యార్థులు మళ్ళీ రోడ్లపైకి రానున్నట్లు ప్రకటించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బుధవారం విద్యార్థులు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌ నాయకుడు వైఎస్‌ జగన్‌ల దిష్టిబొమ్మలను దగ్ధంచేశారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో ప్రజారాజ్యం పార్టీశ్రేణులే ఆ పార్టీ అధినేత చిరంజీవిపై నిప్పులు చెరిగారు. పలుచోట్ల పార్టీ జెండా దిమ్మెలను కార్యకర్తలే కూల్చివేశారు. మహబూబ్‌నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, వరంగల్‌, హైదరాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో ఆర్య-2, మగధీర, సలీమ్‌ సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు. ఈ మేరకు సినిమా థియేటర్ల యజమానులు కూడా ఆ సినిమాల ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఆ సినిమాల కటౌట్లను తెలంగాణ వాదులు ధ్వంసంచేశారు. దీంతో బుధవారం మళ్లిd తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనట్లయింది. తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థుల జేఏసీ, చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్‌ ఉత్పత్తులను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా ఆ ఉత్పత్తులను తెలంగాణ ప్రాంతంలో ఎవరూ కొనకూడదని పిలుపునిచ్చింది. మెదక్‌ జిల్లా దుబ్బాకలో ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలే ర్యాలీగా వచ్చి పార్టీ జెండాదిమ్మెను కూల్చివేసి ఇకనుంచి ప్రజారాజ్యం పార్టీ పేరును తెలంగాణాలో ఉచ్చరించవద్దంటూ తీర్మానించారు. ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ బిల్లును త్వరితగతిన ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పలువురు ప్రముఖులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.

తెలంగాణాపై కేంద్ర నిర్ణయం అర్ధరాత్రి తీసుకుంది కాదనీ, 50ఏళ్ళ తెలంగాణ ఉద్యమ ఫలితమని ప్రకటించారు. అంబేద్కర్‌ చెప్పినట్టుగా చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమనే సిద్ధాంతాన్ని అనుసరించే తాము తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనట్టు తెలిపారు. ఆర్య-2, సలీమ్‌, మగధీర సినిమాల పుణ్యమా అని తెలంగాణ జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో ఉద్యమం మళ్ళీ ప్రారంభమైనట్లయింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి