Pages

26, నవంబర్ 2009, గురువారం

మీ ఫోన్ సేఫేనా?


మీ ఫోన్లకు కాలం చెల్లిందా..?
ఇంకో ఐదు రోజులే మీ ఫోన్‌ పనిచేస్తుందా..?
ఆ తర్వాత ఏమవుతుంది..?
దేశంలోని అన్ని ఫోన్లూ పనిచేయవా..?

 ఇవీ ఇప్పుడు మొబైల్‌ వినియోగదారులను వేధిస్తున్న ప్రశ్నలు.. సెల్‌ఫోన్‌ ఇప్పుడో నిత్యావసరం.. ప్రపంచాన్నే జేబులో నింపేసిన ఆయుధం అది. కేవలం క్షేమసమాచారాలకే కాదు.. , పోటోలు, వీడియోలు, ఇంటర్నెట్‌, గేమ్స్‌.. ఇలా మొబైల్‌ఫోన్‌తో సాధ్యంకానిదంటూ ఇప్పుడేదీ లేదు.. అయితే.. సెల్‌ఫోన్‌ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో.. అది అంతే దుర్వినియోగమూ అవుతోంది. అసాంఘిక శక్తుల్లో పడిన సెల్‌ఫోన్... పెద్ద ఆయుధంగా మారిపోయింది. విధ్వంసానికి హేతువవుతోంది.. మొబైల్‌ఫోన్‌ను రిమోట్‌గా వాడి ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండలెన్నో..దేశంలో మొబైల్‌ ఫోన్‌ వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో.. వాటి తయారీసంస్థలు ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తులు ప్రారంభించాయి. ముఖ్యంగా దేశంలో చైనా ఫోన్లు సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు.. ఎక్కువ ఫీచర్లు.. తక్కువ ధరతో లభిస్తున్న ఈ ఫోన్లు పేదవాడిపాలిట వరంగా మారాయి. చైనా ఫోన్లే కావాలని ముబైల్‌ దుకాణదారులను డిమాండ్‌చేసి కొనుగోలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. కానీ అవి ఒరిజినల్‌ మొబైల్సా కాదా అనే విషయాన్ని వారు దృష్టి పెట్టడంలేదు. దీంతో.. ఇలాంటివారంతా ఇక్కుడు చిక్కుల్లో పడబోతున్నారు. దేశంలో దాదాపు రెండన్నర కోట్ల మొబైల్‌ ఫోన్లు.. డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి మూగబోతున్నాయి.. తొందరపడి ఫోన్లు కొన్న ఫలితమే ఇది.
 ఇన్ని రోజులూ పనిచేసిన ఫోన్లు ఇప్పుడు ఎందుకు మూగబోతున్నాయనేకదా మీ సందేహం.?
మొబైల్‌ఫోన్లు దుర్వినియోగమవుతున్న విషయాన్ని గమనించిన టెలికాం మంత్రిత్వ శాఖ నకిలీ ఫోన్లకు సేవలను నిలిపేయాలని ఆదేశించింది..
నకిలీ ఫోన్లను ఎలా నిర్ధారిస్తారు.?
ప్రతి మొబైల్‌కు 17 లేదా 15 అంకెల కోడ్‌ ఒకటి ఉంటుంది. దీన్నే ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటి IMEI అంటారు. ఓ మొబైల్‌ ఫోన్‌ నకిలీదా.. ఒరిజినలా అని గుర్తించడానికి ఇదే ప్రామాణికం.. ఇప్పటికే జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం.. చౌకరకం హ్యాండ్‌సెట్లపై నిషేధం విధించింది. ఇప్పటికే వినియోగంలో ఉన్న ఆయా హ్యాండ్‌సెట్లకు ఈ ఏడాది ఏప్రిల్‌ 15 నుంచి సర్వీసెస్‌ను నిలిపేయాల్సిందిగా కూడా ఆదేశించింది. అయితే.. వినియోగదారుల కోరిక మేరకు ఈ గడువును ఈ నెలాఖరువరకూ పొడిగించారు. ఇప్పటికే ఈ గడువును రెండుసార్లు పెంచిన ప్రభుత్వం.. మరోమారు పెంచేందుకు ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడంలేదు. దీంతో.. డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి IMEI నంబరు లేని ఫోన్లకు సేవలు నిలిచిపోనున్నాయి.. సో.. వినియోగదారులంతా ఇప్పుడు తమ మొబైల్‌ ఫోన్లు నిజమైనవో.. నకిలీవో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వెంటనే మేలుకోకపోతే.. మీ ఫోన్‌ కూడా మూగబోయే ప్రమాదముంది.. వెంటనే ఆపరేటర్‌ను సంప్రదించి.. మూగబోతున్న రెండున్నర కోట్ల మొబైళ్లలో మీరు లేకుండా చూసుకోండి.. లేకుంటే.. మీరు మరో కొత్త మొబైల్‌ కొనుక్కోవాల్సి రావొచ్చు.. సో హర్రీ అప్‌..!

IMEI అంటే ఏంటి?
IMEI.. ఇంటర్నేషనల్ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటి దీని అబ్రివేషన్‌.! ప్రతి మొబైల్‌లోనూ ఈ నెంబర్‌ ఉండి తీరాలి.. సాధారణంగా ఒరిజినల్‌ ఫోన్లలో ఇది 17 లేదు 15 అంకెల కోడ్‌ రూపంలో ఉంటుంది.
IMEI ఎందుకు?
ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌ను గుర్తించడానికి ఇది దోహదపడుతుంది. ఓ వెహికల్‌కు నెంబర్‌ ఎంత ముఖ్యమో.. సెల్‌ఫోన్‌కూ ఇది అంతే.! IMEI నెంబర్లకు సంబంధించిన ప్రపంచవ్యాప్త డేటాబేస్‌ను GSM అసోసియేషన్‌ నిర్వహిస్తుంది. ఈ వివరాలను 15 రోజులకోసారి మొబైల్‌ ఆపరేటర్ల నెట్‌వర్క్‌ల్లో ఉండే ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ IERలో అప్‌డేట్‌ అవుతుంది.. నిజమైన హ్యాండ్‌సెట్ల ద్వారా కాల్‌ చేస్తున్నారని నిర్ధారించుకోవడానికి IMEI నెంబర్‌ అత్యవసరం..
 
IMEIపై ఇప్పుడే ఎందుకు ఈ నిర్ణయం?
IMEI నెంబర్ లేని మొబైల్‌ ఫోన్లను దుర్వినియోగపరుస్తున్న అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా IMEI లేని ఫోన్లనుంచి ఏంచేసినా అది ఎక్కడా రికార్డుకాదు. దీన్ని ఆధారంగా చేసుకునే టెర్రరిస్టులు రెచ్చిపోతున్నారు.
 
IMEI వల్ల ఉపయోగాలేంటి.?

కేవలం దుర్వినియోగం చేయకుండా ఉండేందుకేకాదు.. IMEI వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. సెల్‌ఫోన్‌ ద్వారా ఫోన్‌ చేసినప్పుడు దాని IMEI నంబర్‌ ఆపరేటర్‌ నెట్‌వర్క్‌పై దర్శనమిస్తుంది. ఒకవేళ మన ఫోన్‌ను ఎవరైనా దొంగలిస్తే... అతణ్ని పట్టుకునేందుకు ఇది సహాయపడుతుంది. అంతేకాదు.. వినియోగదారులపై ఓ కన్నేయడానికి భద్రతాసంస్థలకు తోడ్పడుతుంది. ఎవరైనా ఫోన్‌ను దుర్వినియోగపరుస్తున్నారని తెలిసినప్పుడు దాన్ని బ్లాక్‌ చేసే అవకాశముంటుంది. IMEI నెంబర్‌ ఉన్న ఫోన్ల నుంచి కాల్ డేటాను సేకరించవచ్చు.. నేరాల నిర్ధారణకు ఇదెంతో దోహదపడుతుంది. అంతేకాదు.. IMEI కోడ్‌తెలిస్తే.. ఆ ఫోన్ తయరీదారుతోపాటు మోడల్‌, దేశం.. తదితర వివరాలు కూడా వెంటనే తెలుసుకోవచ్చు... ఒకవేళ మీ మొబైల్‌ ఫోన్‌ చోరీకి గురైనప్పుడు వెంటనే ఆపరేటర్‌కు మీ IMEI నంబర్‌ చెప్తే.. దాన్ని ట్రేస్‌ చేసే అవకాశముంది. వెంటనే ఆ ఫోన్‌ను నిర్వీర్యం చేసి.. మరొకరు వినియోగించకుండా చేయొచ్చు.. సాధారణంగా బ్రాండెడ్‌ కంపెనీల మొబైల్‌ ఫోన్లు వాడుతున్నవారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.. ఎందుకంటే.. అవన్నీ IMEI కోడ్‌ను తప్పనిసరిగా కలిగి ఉంటాయి.. ఇక ఆలోచించుకోవాల్సిందల్లా చౌకరకం ఫోన్‌ వినియోగదారులే.!

అన్ని ఫోన్లకూ IMEI ప్రాబ్లమ్‌ ఉందా.?
ముఖ్యంగా చైనా మొబైల్స్‌లోనే IMEI కోడ్ ప్రాబ్లమ్ ఉంది. దేశంలోని చాలా చైనా ఫోన్లలో ఈ నెంబర్‌ లేదు.. దీంతో.. చైనా మొబైల్‌ వాడుతున్నవారంతా... వెంటనే IMEI నంబర్‌ ఉందో లేదో చెక్‌ చేసుకోవాలని ఆపరేటర్లు కోరుతున్నారు. దీంతో చౌకరకం ఫోన్లు వాడుతున్నవారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.
 
IMEI కోడ్‌ లేకుంటే ప్రమాదమా?
VO: సెల్‌ఫోన్‌ ఆపరేటర్లు కూడా IMEI నెంబర్‌ లేకుంటే ప్రమాదంలో పడే అవకాశముందని వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. నిత్యవసరంగా మారిపోయిన మొబైల్‌ ఫోన్‌ సమస్యలు సృష్టించకుండా ఉండాలంటే.. తప్పనిసరిగా మీ ఫోన్‌లో IMEI ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు..
IMEI నెంబర్‌ తనిఖీ చేసుకోవడం ఎలా.?
 
IMEI కోడ్‌ మీ ఫోన్‌లో ఉందో లేదో తెలుసుకోవడం చాలా సులభం.. మీ ఫోన్‌ నుంచి *#06# డయల్‌ చేయడం ద్వారా మీ హ్యాండ్‌సెట్‌ IMEIని పరిశీలించుకోవచ్చు.. ఇది డయల్‌ చేయగానే మీ మొబైల్‌లో 15 అంకెల సంఖ్య కనిపిస్తుంది. దీన్ని చెల్లుబాటులేకి తేవాలంటే ఈ 15 అంకెల నెంబర్‌ను 53232 లేదా 57886కు SMS చేయాలి.. మీ IMEI సరైనదైతే సక్సెస్‌ అని.. లేకుంటే అలెర్ట్‌.. ఇన్‌వాలీడ్‌ IMEI అని మెసేజ్‌ వస్తుంది..

IMEI ఇన్‌వాలీడ్‌ ఐతే ఫోన్ పనికిరాదా.?

ఒకవేళ మీకు IMEI ఇన్‌వాలీడ్‌ మెసేజ్‌ వస్తే.. వెంటనే మీ సర్వీస్‌ ప్రొవైడర్‌ను సంప్రదించడం ద్వారా కొత్త ఫోన్‌ కొనే బాధ తప్పుతుంది.. ఇందుకోసం మీరు ప్రభుత్వం ఆమోదించిన IMEI ఇంప్లాంట్‌ సెంటర్లను సంప్రదించాలి. అక్కడ మీ మొబైల్‌కు కొత్త, సరైన IMEI నెంబర్‌ను కేటాయిస్తారు. ఇందుకోసం 199 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
 
IMEI ఇంప్లాంట్‌ సెంటర్లకు వెళ్లేటప్పుడు.. మీ హ్యాండ్‌సెట్‌తో పాటు గుర్తింపు నిమిత్తం PAN కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ కార్డ్‌, పాస్‌పోర్ట్‌, రేషన్‌కార్డ్‌.. తదితర గుర్తింపు కార్డుతో పాటు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో గ్రాఫ్‌ తీసుకెళ్లాలి. IMEI నెంబరు పొందేందుకు సమయం దగ్గరపడుతోంది. నవంబర్‌ 30 లోపు మీరు IMEI నెంబరు పొందడం ద్వారా మీ మొబైల్‌ఫోన్‌ను మీరు సురక్షితంగా వినియోగించుకోవచ్చు.. సో హర్రీ అప్‌..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి