సమైక్యం ఉద్యమంలో చివరి బాల్ కు సిక్స్ కొడతానంటూ ఊరించి ఊరించి.. చివరకు ఔట్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి.. మరో సారి చేతులెత్తేశారు. ఈ సారి బంతి పడకుండానే తన వికెట్ పడగొట్టుకున్నారు. ఎంతో కీలకమైన ఈ సారి ఎన్నికల నుంచి "రిటైర్డ్ హర్ట్"గా వెనుదిరిగారు.
సమైక్యవాదానికి హోల్ అండ్ సోల్ లీడర్ గా సీఎంగా ఉన్న సమయంలో బిల్డప్ ఇచ్చుకున్న కిరణ్ కు వాస్తవ పరిస్థితి ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నట్లుంది. సీఎం కుర్చీలో ఉన్నంత కాలం తాను ఏదికావాలంటే అది చేసుకున్న ఆయన చుట్టూ లీడర్లు వందిమాగధుల్లా తెగ తిరిగారు. ఆయనపై ఈగ వాలినా కత్తితో నరికేస్తాం అన్న రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. ఇక్కడే కిరణ్ పప్పులో కాలేశారు. వాపును చూసి బలుపు అనుకున్నారు. తాను పార్టీ పెడితే, అన్ని పార్టీలు ఖాళీ అవడం ఖాయమని, అందరూ తనవెంటే ఉంటారన్న అతివిశ్వాసాన్ని తన గుండెల్లో నింపేసుకున్నారాయన. పైగా, కాంగ్రెస్ పార్టీకి అతీతంగా ప్రజల్లో తనకు విపరీతమైన ఫాలోయింగ్ కూడా వచ్చేసిందనుకున్నారు. అయితే, అది సీఎం కుర్చీలో కూర్చోవడం వల్లే వచ్చిందని, అందులో నుంచి దిగగానే అది మాయమైపోతుందన్న సంగతిని ఆయన గుర్తించలేకపోయారు. సీన్ కట్ చేస్తే, పదవికి రాజీనామా చేయడం, కొన్నాళ్లు ఖాళీగా ఉండడం, తీరిగ్గా పార్టీ అనౌన్స్ చేయడం, ఇలా ప్రతీ దానిలోనూ ఆయన వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
కిరణ్ పార్టీ పెట్టి ఇన్నాళ్లైనా ఇంతవరకూ పెద్ద లీడర్లెవరూ ఆయన వెంట లేరు. కాంగ్రెస్ బహిష్కరించిన ఎంపీలు తప్ప, మరెవరూ ఆయనవైపు చూడలేదు. మీరు పార్టీ పెట్టడం మీ వెంటే ఉంటామన్న రాయపాటి, శైలజానాథ్, కొండ్రు మురళి, పితాని లాంటి వాళ్లు.. ఆయనకు హ్యాండిచ్చేశారు. చెప్పాలంటే, ఇప్పుడు కిరణ్ ఒంటరి. సమైక్యవాదాన్నే నమ్ముకున్న ఆయన కనీసం సీమాంధ్రలో అన్ని స్థానాల్లోనూ పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. దీన్ని అవమానంగా భావించారో ఏమో గానీ, నామినేషన్ల చివరి రోజు సడన్ గా అందరికీ ఝలక్ ఇచ్చారు కిరణ్. పీలేరు నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేస్తానని అందరికీ సమాచారం ఇచ్చిన ఆయన, చివరకు తన తమ్ముడు కిశోర్ కుమార్‌తో నామినేషన్ వేయించారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన తప్పుకోవడంతో జేఎస్పీ నేతలంతా విస్తుపోయారు. యుద్ధంలోకి దిగకుండానే ఓటమిని అంగీకరించారంటూ చెవులు కొరుక్కుంటున్నారు. నాయకుడే పోటీ నుంచి తప్పుకుంటే ఇక తమ పరిస్థితి ఏమిటంటున్నారు అక్కడక్కడా పోటీ చేస్తున్న జేఎస్పీ నేతలు.
20, ఏప్రిల్ 2014, ఆదివారం
బాల్ పడకుండానే వికెట్ పడింది
Categories :
election . jsp . kiran kumar . POLITICS . samaikya
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి