చిన్నస్వామి స్టేడియంలో సిక్సులతో దీపావళి టపాసులు కాల్చిన రోహిత్ శర్మ అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. డబుల్ సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించగా, ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 209 పరుగులతో రెండోస్థానంలో నిలిచాడు. మొదటిస్థానంలో 219 పరుగులతో సెహ్వాగ్, మూడో స్థానంలో 200 పరుగులతో సచిన్ ఉన్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో 2961 మ్యాచ్‌లు అయ్యేవరకూ డబుల్ సెంచరీ అన్నది అందరికీ కలగానే మిగిలిపోయింది. ఎంతోమంది చిచ్చర పిడుగులు క్రీజ్‌లోకి అడుగుపెట్టినా ఎవరూ ఆ ఫీట్‌ను సాధించలేకపోయారు.1997లో చెన్నై స్టేడియంలో సయ్యద్ అన్వర్ చెలరేగి ఆడినా, ఆ ఫీట్‌కు కేవలం 6 పరుగుల దూరంలోనే ఆగిపోయాడు. ఆ ఇన్నింగ్స్‌ను అంతా నోరెళ్లబెట్టి చూశారు. అయితే ఫిబ్రవరి 24,2010న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సరిగ్గా 200 కొట్టి ఆ రికార్డ్ సృష్టించిన తొలి బ్యాట్స్‌మెన్ అయ్యాడు సచిన్. ఆ తర్వాత డిసెంబర్ 8, 2011 న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఓపెనర్ సెహ్వాగ్ 219 రన్స్ కొట్టి సరికొత్త రికార్డ్‌ను సృష్టించాడు. ఇప్పుడు రోహిత్ డబుల్ సెంచరీతో మరోసారి ఆ రికార్డ్ ఇండియన్స్‌కే దక్కింది.
మరో విశేషం ఏమిటంటే, ఈ మూడు డబుల్ సెంచరీలో మనదేశంలోనే నమోదు కావడం. మరే దేశానికి చెందిన క్రికెటర్ కూడా ఇంతవరకూ డబుల్ ధమాకా మోగించలేదు.తొలి 2961 వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ నమోదు కాకపోగా, ఆ తర్వాత జరిగిన 467 మ్యాచ్‌ల్లోనే మూడు డబుల్ సెంచరీలు నమోదు కావడం గమనార్హం. ఇటీవలికాలంలో బ్యాట్స్‌మెన్ ఇరగదీసి కొట్టడం చూస్తుంటే, త్వరలో మరిన్ని డబుల్స్ లిస్ట్‌లో చేరే అవకాశం కనిపిస్తోంది.
రోహిత్ సృష్టించిన మరో రికార్డ్ అత్యధిక సిక్సులు. 16సిక్సులు బాదిన రోహిత్, ప్రపంచరికార్డ్‌ను సృష్టించాడు. ఇంతవరకూ ఇది 15 సిక్సులతో షేన్ వాట్సన్ పేరిట ఉంది. ఇక అత్యధిక సిక్సులు నమోదైన మ్యాచ్‌గా కూడా బెంగళూరులో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ రికార్డ్ సృష్టించింది.38 సిక్సులు నమోదైన ఈ మ్యాచ్‌లో ఇండియా, ఆస్ట్రేలియాలు చెరో 19 సిక్సులు కొట్టడం విశేషం.
384 పరుగుల టార్గెట్ ను ఛేదించడానికి వీరోచితంగా ఆస్ట్రేలియా పోరాడిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. వికెట్లు పడిపోతున్నా, కంగారూలు భారత బౌలర్లను కంగారుపెట్టించారు. మ్యాక్స్ వెల్, వాట్సన్ లు మెరుపులు మెరిపించగా, ఆరోస్థానంలో బ్యాటింగ్ కు దిగిన ఫాల్కనర్ సిక్సర్లతో హోరెత్తించాడు. 57 బంతుల్లోనే సెంచరీ సాధించి, ఆస్ట్రేలియాను విజయతీరాల వైపు నడిపించాడు. అయితే, మరో ఐదు ఓవర్లు ఉండగానే వికెట్లన్నీ పడిపోవడంతో ఆస్ట్రేలియా పరాజయం పాలవ్వాల్సి వచ్చింది.
3, నవంబర్ 2013, ఆదివారం
ఆ మూడూ మనవే
Categories :
bengalore one day . CRICKET . double century . india vs australia . records . rohit sharma . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి