సమైక్యవాదులు వందరోజులకు పైగా ఆందోళనలు కొనసాగిస్తున్నా.. రాష్ట్ర విభజన ప్రక్రియ మాత్రం హస్తినలో చకచకా సాగిపోతోంది. ఓ వైపు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో పోరాటం జరుగుతున్నప్పటికీ, రాష్ట్రం విడిపోతే రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నదానిపై జోరుగానే చర్చసాగుతోంది. ఉత్తరాంధ్రకు రాజధాని ఇవ్వాలంటూ కొంతమంది, గతంలో కర్నూలు రాజధాని కాబట్టి, మళ్లీ కర్నూలును రాజధాని చేయాలని సీమ నేతలు, మధ్యేమార్గం ఒంగోలును రాజధాని చేయాలంటూ ఇంకొంతమంది, బెజవాడే బెటర్ అంటూ మరికొంతమంది డిమాండ్లు చేస్తూ వస్తున్నారు. అయితే, తాజాగా కేంద్ర మంత్రుల బృందానికి సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇచ్చిన నివేదిక ప్రకారం రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై కీలకమైన సిఫార్సులే చేసినట్లు తెలుస్తోంది.
జీవోఎంకు ఇచ్చిన నివేదికలో హైకోర్ట్ బెంచ్‌లను కర్నూలులోనూ, విశాఖలోనూ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్తరాజధానిలో హైకోర్ట్ ఏర్పాటవుతుంది కాబట్టి, వాటి బెంచ్‌లు మాత్రమే ఈ రెండు నగరాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. అంటే, ఈ రెండింటినీ రాజధానిగా సీమాంధ్ర కేంద్రమంత్రులు కోరుకోవడం లేదన్నమాట. పైగా భౌగోళికంగా ఎన్నో ఇబ్బందులు ఈ రెండు ప్రాంతాలకు ఉన్నాయి. కర్నూలును రాజధాని చేస్తే, ఉత్తరాంధ్రకు దూరం అవుతుంది. ప్రతీదానికి కర్నూలు దాకా శ్రీకాకుళం, విజయనగరం,విశాఖ వాసులు రావడం కష్టం. పైగా కర్నూలుకు వరదముప్పు పొంచి ఉంటుంది. విమానాశ్రయం కూడా లేకపోవడం మరో మైనస్. ఇక విశాఖను రాజధానిని చేస్తే, రాయలసీమ,నెల్లూరు వాసులకూ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. విమానాశ్రయం ఉన్నప్పటికీ, తూర్పు నావికాదళ కేంద్రం కావడంతో ఎన్నో పరిమితులున్నాయి. పైగా గట్టిగా వర్షం పడితే ఎయిర్‌పోర్ట్‌లోకి నీళ్లొచ్చేస్తాయి. కాబట్టి వైజాగ్ కూ రాజధాని అర్హత లేదని తేల్చేసుకున్నారు సీమాంధ్ర కేంద్ర మంత్రులు.
వాన్‌పిక్ భూములు ఎక్కువగా ఉండడంతో కొత్తరాజధాని ప్రచారంలో ఒంగోలు పేరు బాగా ప్రచారం సాగుతున్నప్పటికీ, రాజధానికి అవసరమైన మౌలికసదుపాయాలు అక్కడ లేవంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో అందరి ఛాయిస్‌గా గన్నవరం-విజయవాడ-మంగళగిరి-గుంటూరు కారిడార్‌నే కొత్త రాజధానిగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఊపందుకొంటోంది. సీమాంధ్రకు దాదాపుగా మధ్యలో ఉండడం, విమానాశ్రయాన్ని విస్తరించే అవకాశాలుండడం, విశాలమైన భూభాగం, రోడ్,రైల్ కనెక్టివిటీ ఉండడంతో విజయవాడలో ఓటు పడిపోతోంది. అయితే రాజధానికి కొత్త పేరు పెడతారా లేక, విజయవాడ పేరునే ఉంచాతారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది.
10, నవంబర్ 2013, ఆదివారం
సీమాంధ్రకు రాజధాని అదేనా..?
Categories :
bifurcation . capital . GOM . POLITICS . seemandhra . TOP . vijayawada
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి