ఏపీఎన్జీవోల సమ్మె విరమణతో ఇప్పుడు సమైక్యవాదులు, సీమాంధ్ర ప్రజల మదిని తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే. రెండు నెలలకుపైగా చేసిన సమ్మెతో ఏపీఎన్జీవోలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఏం సాధించారనే..? తెలంగాణపై వెనక్కి తగ్గుతామని స్పష్టంగా ప్రకటించేదాకా సమ్మె విరమించేది లేదని ముందునుంచీ చెబుతూ వచ్చారు ఏపీఎన్జీవోలు. అలాంటి ప్రకటన ఏదీ రాకుండానే ఇప్పుడు సమ్మె విరమించాల్సి వచ్చింది. ఆర్టికల్ 371 డి లాంటి కొనసాగింపు పైనా హామీ కోసం ఏపీఎన్జీవోలు పట్టుబడుతున్నారు. దానిపైనా ఎలాంటి హామీ వారికి రాలేదు. కానీ, విధిలేని పరిస్థితుల్లో సమ్మె నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎన్నో కారణాలు
వారితో మొదలైన సమ్మె ఉద్యమంలోకి ఇతర సంఘాలు క్రమక్రమంగా చేరాయి. అయితే, అలానే విడిపోయి సమ్మెను కూడా విరమించాయి. విద్యుత్ ఉద్యోగులు, సెక్రటేరియెట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు ఒకరి తర్వాత ఒకరు సమ్మె విరమించడంతో ఏపీఎన్జీవోలపై తీవ్రంగా ఒత్తిడి పెరిగిపోయింది. పైగా రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో చిన్న ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అసలు, ఉద్యోగులు చేస్తున్న కీలకమైన డిమాండ్లను తీర్చడం సంగతి అటుంచితే ఇటు రాష్ట్రంలో గానీ, అటు కేంద్రంలో గానీ పట్టించుకునే నాథుడే లేడు. పైగా, రాజకీయ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వారందరినీ దూరం చేసుకున్నారు ఉద్యోగులు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులను చర్చలకు పిలిచిందే లేదు. భవిష్యత్తులో పిలుస్తుందన్న గ్యారెంటీలేదు .మరోవైపు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వడివడిగా సాగిపోతోంది. ఈ నేపథ్యంతో సమ్మె చేస్తూ, ఉద్యోగాలకు దూరం కావడం వల్ల వచ్చే ఉపయోగమేమీ లేదని సీమాంధ్ర ఉద్యోగులు చాలా మంది భావించారు. కేంద్ర మంత్రులే ఇప్పుడేమీ చేయలేమని చెప్పడంతో ఇంకెన్ని రోజులు సమ్మె చేసినా ఉపయోగం లేదని తేలిపోయింది. పైగా ఆర్థిక ఇబ్బందులు కూడా పెరిగిపోవడంతో, ఉద్యోగ సంఘాల నేతలపై తీవ్ర స్థాయిలోనే ఉద్యోగులు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెనుంచి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది . కానీ రెండు నెలల పాటు తీవ్ర ఇబ్బందులు పడి, జనాన్ని ఇబ్బందులు పెట్టి చేసిన సమ్మె ఏమీ సాధించకుండానే విరమించుకోవాల్సి రావడమే ఉద్యోగ సంఘాల నేతలకు మింగుడుపడడం లేదు.
17, అక్టోబర్ 2013, గురువారం
ఏం సాధించారని విరమించారు..?
Categories :
apngo . news . samaikya protest . seemandhra . strike . strike call off . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి