సమైక్య ఉద్యమం సాక్షిగా జనం జీవితాలతో చెలగాటమాడే వికృతక్రీడ రెండు రోజులుగా సీమాంధ్ర జిల్లాల్లో సాగుతోంది. ఎంతో అత్యవసరసర్వీసైన విద్యుత్ ఉత్పత్తిని, సరఫరాను నిలిపివేసి, కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని సంబరపడుతున్నారు విద్యుత్ ఉద్యోగులు. ఓ రకంగా ప్రభుత్వంపై కాస్త ఒత్తిడి పెరిగినప్పటికీ, దాని వల్ల నిజంగా నష్టపోతోంది ఎవరన్న విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. సీమాంధ్రలో విద్యుత్ సమ్మె కారణంగా తీవ్రంగా నష్టపోతోంది సీమాంధ్ర ప్రజలే. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కరెంటు లేక, సగానికిపైగా ప్రాంతాల్లో 24 గంటలూ కరెంటు లేక జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. తాగడానికి నీళ్లు రాక, కరెంటు ఆధారంగా జీవనం సాగించే చిరువ్యాపారులు ఉపాధి లేక సమస్యల వలయంలో చిక్కుకుపోతున్నారు. ఇక కరెంటు సరఫరా నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకూ అంతరాయం కలగడం వల్ల సీమాంధ్రలో తిరిగే చాలా రైళ్లు ఆగిపోయాయి. ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలియక, ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే వాళ్లూ ఇబ్బందిపడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే, మరో ఎత్తు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు. అన్నీ సరిగ్గా ఉంటేనే అంతంత మాత్రంగా అందే వైద్య సేవలు కరెంటు లేకపోవడంతో, పూర్తిగా అటకెక్కాయి. వెంటిలేటర్లు పనిచేయక, అత్యవసర చికిత్స పొందుతున్న వారి ప్రాణాలు కాపాడే పరికరాలు పనిచేయక ప్రాణాలతో పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి ప్రాణాలైనా పోతే, దానికి ఎవరు బాధ్యులు.. విద్యుత్ ఉద్యోగులు దానికి బాధ్యత తీసుకుంటారా..
తెలుగువారిని విభజించే హక్కు కేంద్రానికి లేదని వాదిస్తున్న ఉద్యోగులు, ప్రజలను ఇబ్బంది పెట్టే హక్కు తమకు ఉందా లేదా అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఒకవేళ కేంద్రంపై నిజంగానే ఒత్తిడి తేవాలనుకుంటే ప్రజాప్రతినిధుల ఇళ్లకు కరెంట్ కట్ చేయండి, రైలు సర్వీసులకు నిలిపివేయండి, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు నిలిపివేయండి.. అంతేగానీ, సామాన్యుడి ఇంటికి వెళ్లే విద్యుత్ నిలిపివేసి వారి ప్రాణాలతో ఆడుకోకండి. ఇప్పటికే సీమాంధ్రలోని విద్యుత్ ఉద్యోగుల తీరుపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పలుచోట్ల సబ్ స్టేషన్ల ముందు కరెంటు సరఫరా ఇవ్వాలంటూ ధర్నాలు చేస్తున్నారు. ఇది మరింత ఉధృతమవుతే, పూర్తిగా సమైక్య ఉద్యమానికే ఎసరువచ్చే అవకాశం ఉంది. ఆ ఉద్యమంపైనే ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది.
7, అక్టోబర్ 2013, సోమవారం
జనాన్ని హింసించి సాధించేదేమిటి?
Categories :
news . power strike . samaikya protest . seemandhra . telangana . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి