ఢిల్లీ పీఠం సాక్షిగా ప్రధాని పరువు మట్టిగొట్టుకుపోయింది. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, అపర మేధావి, వర్తమాన రాజకీయాల్లో అవినీతి మకిలి అంటని ఏకైక నాయకుడైన మన్మోహన్, తనకు ఏదీ చేతగాదన్న విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు. దేశానికే ప్రతిష్టాత్మకమైన పదవిలో కూర్చున్నది గాంధీ కుటుంబం చెప్పినదానికి బుర్ర ఊపడానికేనని మళ్లీ చాటిచెప్పారు. నేరచరిత్రుల ఆర్డినెన్స్ పై రాహుల్ అభ్యంతరాల నేపథ్యంలో దాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయించింది. ఇది బాధాకరమే అయినప్పటికీ, రాహుల్ చెప్పాడు కాబట్టి వెనక్కి పోవడమే మంచిదని కాంగ్రెస్ నేతలంతా డిసైడ్ అయ్యారు. అంతకుముందే అరగంట పాటు రాహుల్ తో సమావేశమైన ఆర్డినెన్స్ పై అభ్యంతరాలను తెలుసుకున్నారు ప్రధాని. నేరచరిత్రలను రక్షించుకోవడానికి ఉద్దేశించిన ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవడం దేశం హర్షించదగ్గదే అయినప్పటికీ, దీన్ని వెనక్కి తీసుకోవడంలో జరిగిన పరిణామాలే, కేంద్రంలో పవర్ సెంటర్ ప్రధాని సీటులో కాక, మరో దగ్గర ఉందని తేల్చి చెప్పింది.
ఈ విషయంలో ప్రధాని అసమర్థత, నాయకత్వలేమి, ముందుచూపు కొరవడిన తనం స్పష్టంగా బయటపడ్డాయి. నేరచరితులను రక్షించడానికి ఆర్డినెన్స్ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రధాని ఆలోచించలేకపోయారా..? రాహుల్ చెప్పే దాకా అదో పనికిమాలిన ఆర్డినెన్స్ అని గుర్తించలేకపోయారా? ఈ రెండింటికీ జవాబు అవునని అంటే ప్రధాని పదవిలో కూర్చునే అర్హత మన్మోహన్ కు లేనట్లే.
ఇక మరో కోణంలో చూస్తే, ఇదంతా పకడ్బందీగా మన్మోహన్ ను కీర్తిహీనుడిని చేయడానికే జరిగినదానిలా కనిపిస్తోంది. రాహుల్ ఇమేజ్ పెంచుతూ, మన్మోహన్ గ్రాఫ్ ను పడేసేలా ఢిల్లీ పెద్దలు స్కెచ్ వేశారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. లేదంటే, కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు, పార్టీ జనరల్ సెక్రటరీ రాహుల్ కు తెలియకుండానే ఆర్డినెన్స్ తయారవడం, రాష్ట్రపతిదాకా వెళ్లడం జరగని పని. అప్పుడెప్పుడూ అభ్యంతరం చెప్పని రాహుల్, సడన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడంలో ఆంతర్యం ఏమై ఉండొచ్చన్నది అందరూ అర్థం చేసుకోవచ్చు. రాహుల్ గొప్ప లీడర్ అన్న భావనను జనంలో పెంచడానికే ఈ వ్యవహారం అంతా కాంగ్రెస్ పెద్దలు నడిపించినట్లు కనిపిస్తోంది. ఏదేమైనా మరోసారి మన్మోహన్ తన చేతిలో ప్రధాని పదవి తప్ప నిర్ణయాధికారం ఏమీ లేదని జాతి మొత్తానికి తెలిసేలా చేశారు. అదీ స్వరాజ్యం,స్వయంపాలన అని ఎలుగెత్తి చాటిన గాంధీ జయంతి రోజే జరగడం విచారకరం.
2, అక్టోబర్ 2013, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి