సమైక్య ఉద్యమంలో పడి అందరూ మరిచిపోతున్న విషయం ఒకటుంది. అసలు ఆ ప్రస్తావనే పెద్దగా రావడం లేదు. సమైక్య సుడిగుండమంతా హైదరాబాద్ చుట్టూ.. ఇంకా చెప్పాలంటే, హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల చుట్టూ తిరుగుతోంది. రాష్ట్ర విభజన చేస్తే, హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులకు భద్రత ఏమవుతుందని చివరకు పార్లమెంట్ లో గళమెత్తేవరకూ వచ్చింది. ఉద్యోగుల పరిస్థితి ఏమవుతుందంటూ మన నేతలు గుండెలు బాదుకునే వరకూ విషయం చేరుకుంది. బాగానే ఉంది. ప్రజల కోసం ఇంతగా తపించిపోయే నేతలు ఉండడం మనకు గర్వకారణం. ప్రజల రక్షణ కోసం ఇంతగా పోరాడుతున్నవారున్నందుకు సంతోషం.
కాకపోతే, ఈ నేతలంతా మాట్లాడుతోంది, దృష్టి పెట్టింది కేవలం హైదరాబాద్ పైనే. సీమాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఒక్క హైదరాబాద్‌లోనే ఉన్నారా.. ? తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో లేరా.? హైదరాబాద్ లో కేపీహెచ్ బీ ఉన్నట్లే, తెలంగాణలోని ప్రతీ జిల్లాల్లోనూ సీమాంధ్ర పల్లెలు, క్యాంపులున్నాయి. హైదరాబాద్ లో ఎంతమంది సీమాంధ్రులుంటారో, మిగిలిన తెలంగాణ జిల్లాల్లోనూ దాదాపు అంతేమంది సీమాంధ్రులు ఉంటారు. రైతులుగా, వ్యాపారులుగా, కూలీలుగా, ఉద్యోగులుగా ఎంతోమంది తెలంగాణలో భాగమైపోయారు. మరి వీరికి భద్రత అవసరం లేదా.. వీరి భద్రత గురించి ఒక్క రాజకీయ నాయకుడు కూడా నోరువిప్పడెందుకు..
మరో విషయం హైదరాబాద్‌లో ఇంతమంది ఆందోళనలు చేసి హడావుడి చేస్తున్నా, తెలంగాణ జిల్లాల్లోని సీమాంధ్ర ప్రాంత వాసులు ఏమాత్రం భయపడడం లేదు. ఎందుకంటే, వాళ్లు అక్కడి సమాజంలో భాగమనుకుంటున్నారు. తెలంగాణ ప్రాంత వాసులు అలాగే భావిస్తున్నారు. నీవు వేరు.. మేం వేరు అనుకోవడం లేదు కాబట్టే జిల్లాల్లో ఎక్కడా సమస్యలేదు. మారుమూల ప్రాంతాల్లో ఉన్నవాళ్లకే ఏ భయం లేనప్పుడు, హైదరాబాద్‌లో, రాజధానిలో, అత్యాధునిక వసతులు, రక్షణ ఏర్పాట్లు ఉన్న నగరంలో భయపడాల్సిన అవసరం ఏముంది.. తెలంగాణ జిల్లాల్లో ఉన్న సీమాంధ్రులకు లేని భయం హైదరాబాద్‌లో ఉన్నవాళ్లకే ఎందుకు.. పోనీ నిజంగా భయపడుతున్నారనుకున్నా, ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పి భద్రతపై భరోసా కల్పించాల్సిన నేతలు, దీన్నో రాజకీయ అంశంగా ఎందుకు మార్చేస్తున్నారు.. హైదరాబాద్ చుట్టూ కుట్రలు ఎందుకు పన్నుతున్నారు..?
చెప్పాలంటే, నేతలకు నిజంగా కావాల్సింది హైదరాబాద్‌లో ఉన్న ప్రజల రక్షణ కాదు.. ఆ పేరుతో, వారి ఆస్తులకు, బినామీలకు రక్షణ. అందుకే, కేవలం హైదరాబాద్ పైనే గగ్గోలు పెడుతున్నారు. ఈ మాయా రాజకీయాలనే జనం అర్థం చేసుకోవాలి.
13, ఆగస్టు 2013, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి