రాజకీయ కారణాలతో తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలపడం లేదని, ఎన్నో ఏళ్ల సంఘర్షణ, డిమాండ్ల నేపథ్యంలోనే నిర్ణయం తీసుకుంటున్నామని నిన్న సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం ప్రకటించిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంఛార్జ్, అదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అదే కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానంటూ గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. త్వరలోనే విలీనం జరగొచ్చనీ చెప్పుకొచ్చారు దిగ్విజయ్. అయితే, ఇప్పటివరకూ విలీనం గురించి వీలైనన్ని సార్లుచెప్పిన కేసీఆర్, విభజనకు కాంగ్రెస్ పచ్చ జెండా ఊపేసరికి మాత్రం ఒక్కసారిగా ఆత్మరక్షణకు లోనయ్యారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేవరకూ విలీనం గురించి మాట్లాడకపోవడమే మంచిదని, అప్పటివరకూ తామెంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారాయన.
జాతీయ స్థాయిలో ప్రచారంలో ఉన్న విషయాల ప్రకారం చూస్తే, కేసీఆర్ తో కాంగ్రెస్ అధిష్టానం టచ్ లోనే ఉందని తెలుస్తోంది. విలీనం దిశగా చర్చలూ జరపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఇంతకాలం కష్టపడి, ఎన్నో ఉద్యమాలు చేసి, ఎన్నోసార్లు ఉద్యమాలు ఆపి, రాజకీయంగా ఎన్నో వ్యూహాలను, ఎత్తులకు పైఎత్తులను వేసి, తెలంగాణలో టీఆర్ ఎస్ ను కీలక పార్టీగా చేసిన కేసీఆర్, దాన్ని కాంగ్రెస్ కలపడం ఎంతవరకూ సాధ్యమన్నదే ఆసక్తికరంగా మారింది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ లో తన పార్టీని కలపడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. పార్టీని కలిపిస్తే గనక, తనకు, తన కుటుంబ సభ్యులకు, తన అనుచరులకు అది రాజకీయ ఆత్మహత్యే అవుతుందన్నది ఆయన నమ్మకం. ఇలానే ఉంటే తెలంగాణలో ఎక్కువ స్థానాలను దక్కించుకుని సొంతగా ప్రభుత్వ ఏర్పాటుకూ ప్రయత్నించవచ్చు. అలా చేస్తే మాట తప్పినవాళ్లవుతారు కాబట్టి, దీనికోసం కేసీఆర్ కొన్ని ప్రకటనలను సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందులో మొదటిది..
1. తెలంగాణ ఏర్పడిన తర్వాత, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి కాబట్టి, కొంతకాలం కాంగ్రెస్ కు మిత్ర పక్షంగానే ఉండి, అభివృద్ధి తీరును ముందుకు నడిపిస్తామని చెప్పొచ్చు.
2. హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు కాబట్టి, హైదరాబాద్ తెలంగాణకు అందిన తర్వాతే విలీనం చేస్తానని మెలిక పెట్టవచ్చు. పదేళ్ల తర్వాత పరిస్థితులు మారిపోవచ్చు కాబట్టి అప్పుడే నిర్ణయం తీసుకోవచ్చు.
3. విలీనం అన్నది తన ఒక్కడి నిర్ణయం కాదని, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తల అభిప్రాయమూ ముఖ్యమేనని వారంతా కోరుకోవడం లేదంటూ తప్పించుకోవచ్చు.
ఈ లెక్కన చూస్తే, ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం అయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.
31, జులై 2013, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి