టీఆర్ఎస్ లో కేకేకు పెద్ద పాత్ర ఇస్తానంటూ చేర్చుకున్న కేసీఆర్, ఆయనకు ఎట్టకేలకు పార్టీ సెక్రటరీ జనరల్ హోదాను కట్టబెట్టారు. పార్టీ ఆఫీస్ లో తన ఛాంబర్ కు ఎదురుగానే ఓ గదిని ఆయనకు కేటాయించారు. అధ్యక్షుడి తర్వాతి హోదా సెక్రటరీ జనరల్ దే నంటూ కేకేనూ గాల్లోకి ఎత్తేశారు కేసీఆర్. పైగా, టీఆర్ఎస్ కు సంబంధించి జాతీయస్థాయి వ్యవహారాలన్నింటినీ కేకేనే పర్యవేక్షిస్తారని తెలిపారు. కేకే కు ఉన్న జాతీయస్థాయి అనుభవం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారాయన.
ఇంతవరకూ బాగానే ఉన్నా, తెలంగాణ భవన్ లో ప్రత్యేక ఛాంబర్ తీసుకున్నవాళ్లు ఇంతవరకూ ఎవరూ పార్టీలో ఎక్కువ కాలం ఉండలేకపోయారు. అందుకే, ప్రస్తుతం కేసీఆర్ కు తప్ప మరెవరకీ ఆఫీస్ లో ప్రత్యేకంగా ఛాంబర్ ఉండదు. అలాంటిది కేకేకు ఛాంబర్ కేటాయించడంతో, ఆయన త్వరలోనే పార్టీ వదిలేస్తారేమోనన్న సెంటిమెంటు గుసగుసలు గులాబీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. పైగా కేసీఆర్ ఎవర్ని గాల్లోకి లేపుతారో, వారిని సడన్ గా ఎప్పుడు కిందకు పడేస్తారో పార్టీ వర్గాలకు ఇప్పటికీ అర్థం కాదు. కేసీఆర్ పొగడ్తలకు ఉబ్బితబ్బిబై, ఆ తర్వాత అక్కడి పరిణామాలు తట్టుకోలేక గులాబీకి గుడ్ బై చెప్పేసిన వారి జాబితా పెద్దగానే ఉంది.
జాతీయస్థాయి వ్యవహారాలనే కేకేకు కట్టబెట్టడంలోనూ కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీని ద్వారా రాష్ట్రస్థాయి వ్యవహారాలకు కేకేను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు స్పష్టమవుతోంది. ఇక జాతీయ స్థాయిలో ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ చేసేది, చేయగలిగేదీ ఏమీ లేదు. ఒకవేళ కేసీఆర్ ఆశించినట్లు వచ్చే ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటే, అప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే కూటమికి టీఆర్ఎస్ మద్దతు అవసరం అవుతుంది. అలాంటి కీలక ఒప్పందాలను పూర్తిగా కేకేపైనే కేసీఆర్ పెట్టేస్తారని ఊహించలేం. పైగా, కేసీఆర్ ను కాదని కేకే నిర్ణయాలు తీసుకునే అవకాశమూ ఉండదు. దీన్నిబట్టి చూస్తే, ఇదో నామ్ కే వాస్తే పోస్ట్ లాగానే ఉందంటున్నారు కేకే సన్నిహితులు.
19, జూన్ 2013, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి