1, ఫిబ్రవరి 2013, శుక్రవారం
ఆయనేమన్నా టెర్రరిస్టా..? మావోయిస్టా..?
అత్యంత అమానుషం. గుండెకు ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి అన్న కనికరం, వయసు మీదపడిందన్న ఇంగితజ్ఞానం పోలీసులకు లేకపోయింది. కరడుగట్టిన నేరస్థుడిని, ఇంకా చెప్పాలంటే, ఏ టెర్రరిస్టో, మావోయిస్టో దొరికితే ఎలా వ్యవహరిస్తారో.. అలా వ్యవహరించారు.. మాజీమంత్రి శంకర్రావును అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు. చెప్పాలంటే చాలా అతిగా ప్రవర్తించారు. కనీసం బట్టలు కూడా సరిగా వేసుకోనివ్వకుండా పంచెతో ఉన్న ఆయన్ను అలాగే లాక్కుపోయారు. షర్ట్ బటన్స్ కూడా పెట్టుకోనివ్వలేదు. పైగా యాక్టింగ్ చేస్తోండు అంటూ కామెంట్లు చేస్తూ.. జీపులో ఎత్తిపడేశారు.
శంకర్రావు అరెస్ట్ పై మీడియాలో విస్తృతంగా కవరేజ్ రావడం, పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తర్వాత ఆయన ఆరోగ్యం విషమించడంతో పోలీసులు తత్తరపడ్డారు. హడావుడిగా ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించి తమ చేతులు దులుపుకున్నారు. పైగా అరెస్ట్ చేయలేదని, గ్రీన్ ఫీల్డ్స్ కేసులో ప్రశ్నించడానికే ఆయన్ను స్టేషన్ కు తీసుకువెళ్లామని ప్రకటించారు. కేవలం ప్రశ్నించడానికే అయినప్పుడు ఇంత హడావుడి చేయడం అవసరమా..? బట్టలు కూడా వేసుకోనివ్వకుండా లాక్కుపోవడం కరెక్టేనా...?
ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీమంత్రి అన్న విషయాలను పక్కనపెడితే, ఆయన ఆరోగ్యాన్నైనా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాన్ని పోలీసులు మర్చిపోయారు. బడాబడా బాబు కోట్లాది రూపాయల స్కామ్ లు చేసినప్పుడు, వాళ్లను ముట్టుకోవడానికి కూడా భయపడే పోలీసులు, శంకర్రావు లాంటి విషయంలో తమ ప్రతాపం చూపించడం నిజంగా శోచనీయమే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి