15, జులై 2012, ఆదివారం
సవాల్ గా మారిన సైకో సాంబ
ఒకటీ.. రెండు ... మూడు.. త్రీడేస్ కంప్లీట్
పది సెర్చ్ పార్టీలు ఒకవైపు... ఒకే ఒక్కడు మరోవైపు...
కొండపల్లి అడవుల్లో ఫలితం లేని కూంబింగ్
మూడు రోజులు గడిచిపోయాయి.. అయినా ఏ మాత్రం ఉపయోగం లేదు. కొండపల్లి అడవుల్లోకి వందలాది మంది పోలీసులు వెళ్లినా సైకో సాంబ ఆచూకీని కనిపెట్టలేకపోయారు.. కొండను చుట్టుముట్టామని, సైకో సాంబ ఏమాత్రం తప్పించుకోలేదని బీరాలు పలుకుతున్న పోలీసులు.. మూడు రోజులు గడిచినా ముందడుగు మాత్రం వేయలేకపోయారు.
నాలుగు జిల్లాలను వణికించి.. పోలీసులకు చిక్కిన సైకో సాంబ.. చాలా తెలివిగా పోలీసులను బోల్తా కొట్టించాడు. దోచుకున్న బంగారాన్ని దాచిపెట్టిన చోటు చూపిస్తానంటూ.. కొండపల్లి ఖిల్లాకు పోలీసులను తీసుకొచ్చిన సాంబ.. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. అయితే.. చేతులకు కాళ్లకు బేడీలున్నా సాంబ తప్పించుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొండపల్లి చుట్టుపక్కల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు.. అడవిలోనూ విస్తృతంగా గాలింపు చేపట్టారు. పది బృందాలు సైకో కోసం అడవిని జల్లెడపడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం కొండపై సాంబ కనిపించాడని.. ఓ బృందం చెప్పడంతో పోలీసులు అటుగా దూసుకెళ్లారు. కానీ, పోలీసులు అక్కడికి వెళ్లేసరికి అక్కడెవరూ లేరు. కొండపల్లి అడవుల్లో వెతికీ వెతికీ పోలీసులే అలిసిపోతున్నారు తప్ప.. సైకో ఆచూకీ మాత్రం దొరకడం లేదు. అసలు చేతులకు, కాళ్లకు సంకెళ్లున్న వ్యక్తి మూడు రోజుల పాటు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరగడం ఎలా సాధ్యమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. సాంబను సజీవంగా పట్టుకోవడానికే.. కూంబింగ్ చేస్తున్నామంటున్నారు పోలీసులు.
సాంబను పోలీసులు పట్టుకోలేకపోవడంతో కొండపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో భయం మొదలయ్యింది. మానవమృగం ఎప్పుడు తమపై పడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. మహిళలైతే ఒంటరిగా బయటకు రావడానికి సాహసించలేకపోతున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి