9, ఆగస్టు 2011, మంగళవారం
మార్కెట్లు ఎందుకు పడుతున్నాయి?
స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి... షేర్లు కనిష్ట స్థాయిలకు దిగజారుతున్నాయి.. ప్రపంచమంతా ఆందోళన.. అన్నిదేశాల్లోనూ ప్రకంపన. అసలు ఆర్థిక వ్యవస్థలకు ఏమయ్యింది..? ఎందుకీ సంక్షోభం వచ్చింది..? ఎంతవరకూ ఇది సాగుతుంది..?
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లు పతనం చెందుతున్నాయి. ఎక్కడ విన్నా అమెరికా సంక్షోభమే వినపడుతోంది. అమెరికా సంక్షోభం వల్లే స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా క్రెడిట్ రేటింగ్... ట్రిపుల్ A నుంచి డబుల్ A + కు దిగజారడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది.
అసలీ రేటింగ్ గొడవేమిటి?
ట్రిపుల్ A రేటింగ్ అనేది స్టాండర్డ్స్ అండ్ పూర్ సంస్థ ఇచ్చే అత్యున్నతమైన రేటింగ్. ఈ రేటింగ్ ఉన్న దేశాల్లో పెట్టుబడులు అత్యంత సురక్షితమని ఇది సూచిస్తుంది. అదే.. డబుల్ A+ది ట్రిపుల్ A కన్నా ఓ స్థాయి తక్కువ. అంటే రిస్క్ పెరుగుతుందన్నమాట. గత ఏడాది కాలంగా, అమెరికా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం కన్నా.. పెడుతున్న ఖర్చు ఎక్కువగా ఉంది. 2011లో అమెరికా ఆదాయం 2 లక్షల 17 వేల కోట్ల డాలర్లు.. కానీ ఖర్చయ్యే అంచనా 3 లక్షల 82 వేల కోట్లు. దీన్ని బట్టి చూస్తే.. ఆదాయం కన్నా లక్షా 65 వేల కోట్లను అదనంగా ఖర్చుపెట్టాలి. ఇంత లోటు బడ్జెట్ అంటే.. అప్పులను చెల్లించే పరిస్థితుల్లో అమెరికా ప్రభుత్వం ఉండదు. ఇంకా అప్పులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా అమెరికా ఆర్థిక వ్యవస్థ దిగజారింది కాబట్టి.. రేటింగ్ కూడా తగ్గింది.
రేటింగ్ తగ్గితే ఏమవుతుంది.?
ప్రపంచంలో భారీ ఇన్వెస్టర్లు, పెన్షన్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్.. తమ నిబంధనలకు అనుగుణంగా AAA రేటింగ్ ఉన్న సెక్యూరిటీల్లోనే పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అమెరికా ఈ రేటింగ్ కోల్పోయింది కాబట్టి, వారంతా తమ పెట్టుబడులు ఉపసంహరించుకునే ప్రమాదం ఉంది. అసలే కష్టాల్లో ఉన్న అమెరికా ఆర్థికవ్యవస్థకు ఇది పెద్ద దెబ్బే. ప్రస్తుతానికి స్టాండర్డ్స్ అండ్ పూర్ సంస్థ మాత్రమే రేటింగ్‌ను తగ్గించింది. మరో రెండు ప్రముఖ సంస్థలైన మూడీ, ఫిచ్లు మాత్రం ఇంకా అమెరికా రేటింగ్‌ను తగ్గించలేదు. అదే జరిగితే సెక్యూరిటీల అమ్మకం భారీగా మొదలవ్వొచ్చు.
అమ్మకాలు మొదలైతే ఏమవుతుంది..?
ఒక్కసారి అమ్మకాలు మొదలైతే సెక్యూరిటీల విలువ కూడా తగ్గిపోతుంది. అదే సమయంలో తక్కువ మొత్తానికే కొనుక్కున్న వారికి ఎక్కువ డబ్బు చెల్లించాలి. వందరూపాయల సెక్యూరిటీని 5 శాతం వడ్డీకి అమెరికా జారీ చేసి ఉంటే.. అమ్మకాల వత్తిడితో అది 80 రూపాయలకూ క్షీణించవచ్చు. ఇలా 80 రూపాయలకు ఎవరైనా కొన్నా.. వారికి వందరూపాయాల లెక్కనే 5 శాతం వడ్డీని అమెరికా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా విలువ తగ్గుతున్న కొద్దీ ఎక్కువమంది అమ్మకాలు జరుపుతారు. ఈ పరిస్థితిని మార్చడానికి వడ్డీ రేట్లను పెంచాల్సి ఉంటుంది. వడ్డీరేట్లు పెరిగితే.. జనం సంపాదించే దానిలో ఎక్కువ మొత్తం EMIలు కట్టడానికి వెచ్చించాల్సి ఉంటుంది. మిగిలిన దానిపై ఖర్చు తగ్గిపోతుంది. అమెరికా వృద్ధి కూడా మందగిస్తుంది.
స్టాక్ మార్కెట్లు ఎందుకు పడుతున్నాయి?
అమెరికాలో పరిస్థితి తగ్గట్లుగా అక్కడ మార్కెట్లు స్పందిస్తుంటాయి. ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు.. ఒకే దేశంలో కాక ఎన్నో దేశాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. ఒక్క మార్కెట్లో నష్టాలు మొదలైతే, మిగిలిన మార్కెట్లలో స్టాక్స్ అమ్మి నష్టాలను తగ్గించుకుంటారు. ఇప్పుడు మన దగ్గరా విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా అమ్మకాలు చేయడానికి ప్రధాన కారణం ఇదే. అమ్మకాలు పెరిగితే షేర్ విలువ పడిపోతుంటుంది. నష్టాలను తప్పించుకోవడానికి స్వదేశీ ఇన్వెస్టర్లు కూడా స్టాక్స్‌ను అమ్ముకోవాల్సి వస్తుంది. కేవలం ఒక్క ఏజెన్సీనే అమెరికా రేటింగ్ తగ్గించినందుకు ఇంత ఘోరంగా ప్రభావం ఉంటే.. ఇక మిగిలిన రెండు సంస్థలూ రేటింగ్ తగ్గిస్తే ఏమవుతుందో.. ఎలా ఉంటుందో.. ఒక్కసారి ఊహించుకోండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి